Swaroopa narendra saraswati swamy
-
వైభవంగా రాజశ్యామల యాగం
పెందుర్తి: విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది. యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలుపంచుకున్నారు. అంతకుముందు శారదా పీఠానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిసి సీఎం జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం జగన్ సంప్రదాయ వస్త్రధారణతో స్వామీజీలతో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం స్వర్ణ మండపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దీక్ష పీఠం వద్ద విశేష పూజలు చేశారు. ప్రముఖ పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీల సమక్షంలో దాదాపు 30 నిమిషాలు అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేసి స్వహస్తాలతో హారతులిచ్చారు. పీఠంలోని స్వయంజ్యోతి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామిలను దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. వేద పండితులను సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం నిర్వహించిన రాజశ్యామల యాగాన్ని దర్శించుకుని, పూర్ణాహుతిలో పాలుపంచుకున్నారు. యాగ భస్మా న్ని స్వరూపానందేంద్ర సరస్వతి సీఎం నుదిటిన దిద్దారు. 2 గంటలకు పైగా సీఎం వైఎస్ జగన్ యా గం, పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. పీఠంలోని వేద విద్యార్థులతో ముచ్చటించారు. సీఎం వెంట వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు డాక్టర్ బీశెట్టి సత్యవతి, ఎం.వి.వి.సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, విశాఖ మేయర్ హరివెంకటకుమారి ఉన్నారు. రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం ఇదే: స్వామీజీ దేశంలో రాజశ్యామల యాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల సీఎంలు సైతం ఇక్కడ రాజశ్యామల యాగంలో పాల్గొన్న వారే అని తెలిపారు. శ్రీ శారదా పీఠంలో కొలువుదీరిన రాజశ్యామల మాత అత్యంత శక్తివంతమైన దేవత అని స్వామీజీ తెలిపారు. సీఎం జగన్ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడం, రాజశ్యామల యాగాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. మేం ‘సిద్ధం’జగనన్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విశాఖ ప్రజల ఘన స్వాగతం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగానికి వచ్చిన సీఎం జగన్‌కు విశాఖ ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీ శారదా పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘నిన్ను మరోసారి గెలిపించడానికి మేం సిద్ధం జగనన్నా’అంటూ స్వాగతం పలికారు. ప్రజలు, మహిళలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జెండాలు, సిద్ధం ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక అభిమాని కాన్వాయ్ వెంట ప్లకార్డు ప్రదర్శిస్తూ పరుగులు తీశాడు. సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, అక్క చెల్లెమ్మలను పలకరిస్తూ శ్రీ శారదా పీఠానికి వెళ్లారు. -
ద్రాక్షారామంలో దధి నివేదన శుభపరిణామం
సింహాచలం (పెందుర్తి)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా): పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామికి దధి (పెరుగు) నివేదనను సమర్పించడం శుభపరిణామమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల మూడోరోజు ఆదివారం వైభవంగా జరిగాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నివేదనకు వినియోగించిన దధిని అన్నదానంలో వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాల ఏర్పాటు మరోవైపు.. శారదాపీఠంలో త్వరలో వైష్ణవ ఆగమ పాఠశాలను ఏర్పాటుచేస్తున్నట్లు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా గడిచిన మూడ్రోజులుగా నిర్వహించిన చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పం మేరకు త్వరలోనే వైష్ణవ ఆగమ సదస్సుని కూడా ఏర్పాటుచేయదలచామని తెలిపారు. అర్చక అకాడమీ ఆధ్వర్యంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి నిర్వహించిన ఈ సదస్సులో చిర్రావూరి శ్రీరామశర్మ, విభీషణ శర్మ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సతీసమేతంగా రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, వీరిద్దరికీ శ్రీకాళహస్తీశ్వరాలయ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థానం ఈఓ సాగర్‌బాబు అందజేశారు. -
గుంటూరులో విడిది చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
-
నిజరూపంలో అరసవెల్లి ఆదిత్యుడు
శ్రీకాకుళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్థరాత్రి ఆదిత్యుని నిజరూప మూర్తికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ క్షీరాభిషేకం, ప్రథమ అర్చనలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు పుష్పాలంకరణ సేవ జరగనుంది. రాత్రి 11 గంటలకు పవళింపు సేవ, మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేక దర్శనం టిక్కెట్ల ధరను రూ.500కు పెంచడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉత్తరంలో ఉన్న గోడను పోలీసులు కూల్చివేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులను ఆ మార్గంగుండా అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, టీడీపీ నాయకుడు కరణం బలరాం తదితరులు ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.