
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీని సత్కరిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి
పెందుర్తి: పరంపర అంటే వంశ పారంపర్యం కాదని, జ్ఞానంతో కూడినదై ఉండాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పురాతన పీఠాల కన్నా ముఖ్యమైన జ్ఞాన పరంపర విశాఖ శ్రీశారదాపీఠం సొంతమన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి హోళె నర్సిపూర్‌లోని గురుస్థానాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి సందర్శించారు. పరమ గురువు సచ్చిదానందేంద్ర స్వామి శివైక్యమైన ప్రాంతంలోని గురు సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ముద్రించిన గ్రంథాలను పరిశీలించారు. ప్రముఖ వేదాంతి ప్రకాశానందేంద్రతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సచ్చిదానందేంద్ర పాద రేణువే విశాఖ శ్రీశారదాపీఠమన్నారు. ఆయన శిష్యునిగా ఎంతో గర్వపడుతున్నానని.. తన పరమ గురువుల శిష్యరికం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దైర్యంగా ధర్మపోరాటాలు చేస్తున్నామంటే అది సచ్చిదానందేంద్ర సరస్వతి అనుగ్రహమే అన్నారు. సంస్కృతంలో ఉన్న తైత్తిరీయోపనిషత్తును తెలుగులోకి అనువదించి వేద విద్యార్థులకు పాఠంగా బోధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
గణపతి సచ్చిదానంద జన్మదినోత్సవానికి హాజరు
మైసూర్‌లోని దత్త పీఠాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. సచ్చిదానందకు జ్ఞాపిక బహూకరించారు. అనంతరం స్వామీజీలను సచ్చిదానంద ఘనంగా సత్కరించారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment