దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌ | Kcr Recived by Ap ministers in Vijayawada airport | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

Published Mon, Jun 17 2019 1:13 PM | Last Updated on Mon, Jun 17 2019 2:15 PM

Kcr Recived by Ap ministers in Vijayawada airport - Sakshi

సాక్షి, విజయవాడ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుండి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనాంతరం అమ్మవారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో కేసీఆర్‌ను దుర్గగుడి అధికారులు సత్కరించారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్‌ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ పాల్గొంటారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. 


విభజన వివాదాలపై నేడు జగన్, కేసీఆర్‌ చర్చలు! 
రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సోమవారం మరోసారి సమావేశమై చర్చలు జరిపే అవకాశముంది. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన వివాదాల స్థితిగతులపై సంబంధిత శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇద్దరు సీఎంలు సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్‌ 9, 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాల పరిష్కరించుకోవాల్సి ఉంది. సోమవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వీటిలో కొన్నింటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.

కేసీఆర్‌ పర్యటన ఇలా...
కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 1.25కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని అక్కడి నుంచి 1.45కు దుర్గామల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకొని ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అక్కడే భోజనం చేసి సాయత్రం 4.15కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు కృష్ణా తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే శారదాపీఠం ఉత్తరాదికారి ఆశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంటారు. తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement