సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు మనవడు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. వారికి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ కుటుంబం నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఇది వరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. ఈ ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment