ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కేసీఆర్ దంపతులు
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొక్కు చెల్లించారు. గురువారం కుటుంబసమేతంగా పూజలు చేసి అమ్మవారికి 11.9 గ్రాముల బంగారం, వజ్రాలు పొదిగిన ముక్కుపుడక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని ఆయన మొక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి శోభ, కోడలు నీలిమ, మనవడితో పాటు పలువురు బంధువులు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అర్చ కులు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ముక్కుపుడకతో పాటు పట్టువస్త్రాలు, పూలు, పండ్లను సీఎం సమర్పించారు.
అర్చకులు ముక్కెర (ముక్కుపుడక)ను అమ్మవారికి అలంకరిం చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కుటుంబసభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయం వద్ద విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, ఈవో ఎం.పద్మ, ప్రధాన అర్చకుడు లింగబొట్ల దుర్గాప్రసాద్, తెలంగాణ దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు సీఎంకు సాదరంగా స్వాగతం పలికారు. సీఎం వెంట ఎంపీలు కె.కేశవరావు, సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాజు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ సలహాదారు సుభాష్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజగోపురం నుంచే...
కేసీఆర్‌ను ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లాలని పోలీసులు, దేవస్థానం అధికారులు తొలుత భావించారు. అమ్మవారి గుడికి తూర్పువైపున్న రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లడం శుభమని తెలంగాణ అధికారులు భావించి, అటువైపు నుంచే తీసుకెళ్లాలని కోరారు. ఆ మేరకు కేసీఆర్ దంపతుల్ని అర్జున వీధి మీదుగా మల్లికార్జున మహామండపానికి, అక్కడ నుంచి లిఫ్టులో రాజగోపురం వద్దకు తీసుకెళ్లారు. పూజల అనంతరం వారు అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయారు. కేసీఆర్ ఆలయానికి వచ్చే ముందు ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సిద్ధిస్తే అమ్మవారికి ముక్కపుడక సమర్పిస్తానన్న మొక్కును సీఎం ఇప్పుడు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఆయన ఇప్పటికే తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి మొక్కు చెల్లించారని గుర్తు చేశారు.
విమానాశ్రయంలో ఘనస్వాగతం
విమానాశ్రయం (గన్నవరం): ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి గన్నవరం విమానాశ్రయంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్, ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీసీపీ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.05కు వచ్చిన సీఎం రోడ్డు మార్గంలో ప్రత్యేక భద్రత మధ్య విజయవాడ వెళ్లారు. అమ్మ వారి దర్శనానంతరం 1.40కి విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన టెర్మినల్‌లో కాసేపు విశ్రాంతి తర్వాత 2.30కు అదే విమానంలో సీఎం తదితరులు హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. అధికారులతో పాటు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజ కుమారి తదితరులు వారికి వీడ్కోలు పలికారు.
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారని ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ మీడియాకు తెలిపారు. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారని వివరించారు. సీఎం ఆలయానికి చేరుకునే ముందు కొందరు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రకీలాద్రి పైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దేవస్థానం సిబ్బంది వారిని వారించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నామస్మరణ తప్ప మరే నినాదాలూ చేయొద్దంటూ వారిని పంపేశారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి దాకా ఫ్లెక్సీలు, ద్వారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఒకరోజు ముందే ఇంద్రకీలాద్రి చేరుకుని ఏర్పాట్లు సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment