దుర్గాదేవి ఆలయం వెలుపల స్వరూపానందేంద్ర, తదితరులు
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
దీక్ష కార్యక్రమాలు సాగేదిలా....
శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు.
సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
దుర్గమ్మ సేవలో స్వరూపానందేంద్ర
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ ఎం.పద్మ, ఆలయ ఈవో ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహా గణపతి ప్రాంగణంలో స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు.
ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతోపాటు టీటీడీలో జరిగిన ఆగడాలపై పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలలో చివరి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతోపాటు గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం మూడు రోజులపాటు దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. స్వామీజీతోపాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులున్నారు.
పీఠాధిపతులు, మఠాధిపతుల రాక
బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. శారదా పీఠం నిర్వాహకులు వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment