Swaroopanandra Saraswathi
-
బాలస్వామి సన్యాస స్వీకార మహోత్సవం ఆరంభం
సాక్షి, విజయవాడ/తాడేపల్లిరూరల్ (మంగళగిరి) : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ బాలస్వామి సన్యాస స్వీకరణ, పట్టాభిషేక మహోత్సవాలకు.. వేద మంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య శనివారం ఉదయం అంకురార్పణ జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టవెంట ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం.. సన్యాస స్వీకరణ కార్యక్రమానికి వేదికైంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం తొలిరోజు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో అంగరంగవైభవంగా జరిగింది సన్యాసదీక్ష స్వీకరిస్తున్న కిరణ్‌కుమార్ శర్మ స్వస్థలం విశాఖ జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. హనుమంతరావు ఇద్దరి కుమారుల్లో పెద్దవాడు కిరణ్‌కుమార్ శర్మ. మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లిదండ్రులతో స్వామిజీ ఆశ్రమానికి వచ్చారు. మహాస్వామి కంటికి ఆ బాలుడు అపర శంకరుడుగా గోచరించడంతో పీఠంలో చేర్చాలని తల్లిదండ్రులను మహాస్వామి కోరారు. తర్వాత మహాస్వామికి ప్రధాన శిష్యుడయ్యారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీరాజశ్యామలాదేవి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్రను దర్శించుకున్న ప్రముఖులు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, సినీనటి శారద, సినీ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. -
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ బాలస్వామి
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దీక్ష కార్యక్రమాలు సాగేదిలా.... శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు. సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. దుర్గమ్మ సేవలో స్వరూపానందేంద్ర ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ ఎం.పద్మ, ఆలయ ఈవో ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహా గణపతి ప్రాంగణంలో స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతోపాటు టీటీడీలో జరిగిన ఆగడాలపై పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలలో చివరి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతోపాటు గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం మూడు రోజులపాటు దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. స్వామీజీతోపాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల రాక బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. శారదా పీఠం నిర్వాహకులు వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. -
విశాఖ శారద పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి
సాక్షి, హైదరాబాద్: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవంను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు. ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
కాల స్వరూపం అమోఘం
తెలుగు వారి నూతన సంవత్సరాన్ని శుభకామనలతో, కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధనతో పవిత్రంగా ఆరంభించడం సంప్రదాయమని, పంచాంగం చూడటమనేది పెద్దల చాదస్తమని కొట్టి పారేయడం సరి కాదనీ, కాలగణన వెనక ఎంతో నిశితమైన పరిశీలన, దూరదృష్టి ఉన్నాయనీ, అదేవిధంగా జ్యోతిష్యమనేది అవాస్తవమని కొట్టిపారేయడం అవివేకమనీ, జ్యోతిషానికి శాస్త్ర ప్రమాణం ఉందని అంటున్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణంలో... ఉగాది ప్రాశస్త్యాన్ని, నూతన ఉగాది ఫలాలనీ వారి మాటలలోనే తెలుసుకుందాం.. మన భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి. మనదేశంలోనే యుగాది భేదాలతో కాల విభాగం, దైవిక లౌకిక కర్మ విభాగాలు ఉన్నాయి. ఇతర దేశాలలో లేవు. మన రుషులు కాల నిర్ణయం అద్భుతంగా చేశారు. కాలం అంటే ఏమిటీ! భూత.. భవిష్యత్.. వర్తమానాలే కదా కాలాలు. ఈ కాలానికి రూపమేది! అంటే ప్రాణుల కదలికలు, పెరుగుదల, తగ్గుదల, ఆధారం చేసుకుని మానవుల మదిలో మెదిలేదే కాలం. కాలానికి రూపం లేదు. వస్తువులకు రూపం ఉంది. జరిగిపోయిన కాలాన్ని భూతమని.. రాబోయే కాలాన్ని భవిష్యత్ అని.. జరుగుతున్న కాలాన్ని వర్తమానం అని అంటాం. అసలు వర్తమానానికి ఎక్కడి నుంచి ఎక్కడకు కొలమానం? అంటే దానికి స్పష్టత లేదు. ఈ వర్తమానాన్ని ఆధారం చేసుకుని భూత, భవిష్యత్ కాలాలు ఉన్నాయి. అయితే కాలం రూపం లేనిది.. నిలకడ లేనిది కనుక అది వాగారంభణమే.. అంటే నోటి మాట మాత్రమే అనేది వేదాంత సిద్ధాంతం. అయితే లోకం గురించి కాలనిర్ణయాన్ని మన పూర్వీకులు చాలా చక్కగా చేశారు. సూర్యచంద్రాది గ్రహాలు, భూమి పరివర్తన ఆధారం చేసుకుని తిథులు, నక్షత్రాలు ఆధారం చేసుకుని కాల నిర్ణయం చేశారు. ప్రతిరోజు, ప్రతిమాసం, ఋతువులతో సహా ఎలా ఏర్పడుతుంది, భూమి మీద అన్ని ప్రాణులకి ఋతువులతోను, మనుషులతోను, ఉత్తర, దక్షిణాయనాలతోనూ ఎలా సంబంధం ఉన్నది అన్నది మన పూర్వీకులు చూపించారు. అధి దైవికమైన సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులతో కూడిన సర్వదివ్యమైన జ్యోతనమైన అధి దైవికంతో భూగోళానికి ఉన్న సంబంధం మన కాల నిర్ణయం. దానినే జ్యోతిష్యం అంటాము. కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. ఖగోళ, భూగోళ సంబంధాన్ని తెలియజేసేది ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచ చిత్రపటలాన్ని నమ్మము అంటే అవివేకమే.జ్యోతిష్యం అంటే మూఢ విశ్వాసం కాదు. ఇతర దేశాలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకునే సంవత్సరం కేవలం విశ్వాసంతో కూడినది కానీ మన సంవత్సరం విశ్వాసం మాత్రమే కాదు. ఖగోళంతో కూడిన సర్వసంబంధాలు భూమికి సంబంధం కలగడం వలన ప్రత్యక్ష ప్రచారంలో అనుభవ సిద్ధమైనది. మరి ఇంత విశాలమైన ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికాలతో కూడిన ఈ ప్రపంచం అనే ప్రకృతి ఎలా సృష్టించబడింది?.. అది ఎప్పుడు? అంటే దానిని తెలియజేసేదే మన యుగాది. సృష్టి ఆరంభం... మన ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటున్నాం. ధర్మసింధులో ఆ రోజున సృష్టి ప్రారంభమైనట్లు ఉంది. హేమాద్రిలో కూడా ‘చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రధమేఒహని’ అన్నాడు. అంటే బ్రహ్మ చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జగత్తును సృష్టించాడని ఉంది. అయితే ఒక వస్తువు సృష్టి కావాలంటే దానిని సృష్టించేవాడు, దేశం, కాలం అనేవి కావాలి కదా. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు అంటే అతను ఎక్కడ ఉండి ఎప్పుడు సృష్టించాడు? దానికి దేశం, కాలం చెప్పవలసి ఉంది. అలా అంగీకరిస్తే దేశాన్ని కాలాన్ని అతను సృష్టించ లేదనే కదా? అంతేకాదు దేశం, కాలం అనేవి జగత్తులోనే అంతర్గతాలు. కనుక జగత్తుని ఎక్కడ సృష్టించాలి. ఎప్పుడు సృజించాలి అనే ప్రశ్నలే పుట్టవు. శ్రుతి ఇలా చెప్పిందే కాని సృష్టి జరిగిందని ఎప్పుడూ నిరూపించలేదు. సృష్టి జరిగితే బంధం అనేది సత్యం అవుతుంది. కనుక బంధ నివృత్తి ఎప్పుడూ కాదు. సత్యానికి నివృత్తి ఎక్కడిది? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ నకర్త్నత్వం, న కర్మోణి లోకస్య సృజతి ప్రభుః...అని అన్నారు. అంటే ఈ సృష్టిని చేయనేలేదని, అజ్ఞానం చేత పరమాత్మనే జగత్తు అని భ్రాంతి పొందుతున్నామని అన్నారు. మట్టిని వీడి కుండ లేదు అంతా మన్నే అన్నట్లు పరమాత్మ చేత జగత్తు పుట్టింది అంటే పరమాత్మను వదలి జగత్తు లేదు అంతా పరమాత్మయే అనే జ్ఞానం ఉపదేశించడానికే ఈ సృష్టి ప్రక్రియ ఒక ఉపాయం అని శ్రీగౌడపాదాచార్యులు ‘ఉపాయః స్నోవతామామ’ అని అన్నారు. ఉగాది పండగ అంటే ఏమిటి? ఈ చైత్ర మాసంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చేమలు తమ పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్ళతో కళకళలాడుతూ ప్రకృతి అంతా నవనవలాడుతుంది. అలాగే భక్తుడు ఈ ఉగాది నుండి అయినా సద్గురువులను ఆశ్రయించి తనలోని దోషం, క్రోధం, అసూయ, మిధ్యాజ్ఞానం, దురభిమానం అనే పాత భావాలను రాల్చి శాంతి.. దయ, విద్య మొదలగునవి సంపాదించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలాగే మనగలిగే అనేక మానసిక ఒత్తిడులకు తలొగ్గక ధీరులై ఉండి మనందరి ఆత్మీయ విశ్వం, పరమార్థం అనే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే ఉగాది పండుగ. అంతేగాని ఆ రోజు రకరకాల పిండివంటలు తిని ఉగాది బాగా జరిగింది అని అనుకుంటే అది భ్రాంతే. అయితే ఈ కొత్త సంవత్సరం వికారి నామసంవత్సరం పెద్దలు, యువకులు, సకల ప్రాణులు పరమాత్మ దయ వలన ఈ సంవత్సరమంతా బాగుండాలి. పంటలు పండాలి. అన్నం పెట్టే రైతు బాగుండాలి. సమర్థవంతమైన పాలన ఉంటుంది వికారి నామసంవత్సరంలో రాజు శని అయినందున మంత్రులు సమర్థవంతంగా పరిపాలన సాగిస్తారు. రాజకీయపరంగా ప్రతిపక్షంలో ఉన్న వారు బలం చూపించుకునే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే రవిగ్రహం మంత్రి అయిన కారణం చేతను రవి, శని శత్రువులు అయిన కారణంగానూ పరిపాలన విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సునందు గురు, శని, కేతు గ్రహాలు ఉండి ఈ రాశికి ఆరవ రాశినందు కుజుడు ఉండడం వలన అధికార, ప్రతిపక్షాలకు పోరు అధికంగా ఉంటుంది. ఈ గ్రహ యుద్ధంలో చివరి నిమిషంలో అధికార పక్షానికి ప్రమాదం ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో వాహన, అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. పంటలు బాగా పండుతాయి జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి కారణం చేత సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. బుధుడు సస్యాధిపతి కావడం వల్ల పంటలు బాగా పండుతాయి. పెసలకు మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధ వ్యాపారాలు బాగుంటాయి. చంద్రుడు ధాన్యాధిపతి అయిన కారణంగా మంచి వర్షాలు కురుస్తాయి. పశుసంపద పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ధనుస్సునందు గురు, శని, కేతువుల కలయిక వలన దేశారిష్టయోగం ఉంది. దీని నివారణార్థం అధికారులు పీఠాధిపతులను, గురువులను సంప్రదించి శాంతి కర్మ ఆచరించిన తరువాత అంతా శుభాలు కలుగుతాయి. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పంచాంగం..‘వికారి’ ప్రవర్తన... ‘తిథిర్యారంభ యోగఃకరణమేవచ పంచాంగమతి విశ్యాతం లోకోయం కర్మ నాథక’ అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలతో కూడుకుని ఉన్న దానిని పంచాంగం అంటారు. అసలు పంచాంగాలతో ఎవరికి ఉపయోగం? దాని వలన ప్రయోజనం ఏమిటి? అనే సందేహాలు నేటితరంలో అందరినీ బాధిస్తున్నాయి. ఈ పంచాంగాలు వృద్ధులకు మాత్రమే సంబంధం మాకు కాదు అంటారు యువకులు. నిజానికి ఈ పంచాంగం అంటే వ్యక్తిగత విషయం కాదు అని గ్రహించాలి. వైయుక్తిక విషయముల కంటే సార్వత్రిక విషయాలే పంచాంగాల ముఖ్య లక్షణం. అది ఎలాగో పరిశీలిద్దాం. పంచాంగ గణితం మనకు అమావాస్య, పౌర్ణమి రూపంలో ప్రత్యక్ష ప్రమాణంగా సామాన్యులకు సైతం ఉన్నది. వర్షాల విషయంలో కూడా ప్రామాణికంగా తెలియజేస్తున్నాయి. ప్రధానంగా గ్రహణాలు ఏ నిమిషానికి ప్రారంభమయి ఏ నిమిషంలో అంతమవుతాయి– అనే విషయంలో కూడా పంచాంగాలే ప్రామాణికం. పై విషయాలను నేటి సాంకేతిక విజ్ఞానంతో శాస్త్రవేత్తలు ఎన్నో కోట్ల వ్యయంతో పరిశ్రమ చేసి తెలుసుకుంటూ ఉంటే అవే విషయాలను శాస్త్రవేత్తలకు ఏ మాత్రమూ తీసిపోకుండా మన పంచాంగ కర్తలు కేవలం కాగితం, కలం సహాయంతో తెలుసుకుంటున్నారు... నిరూపిస్తున్నారు. ఇటువంటి పంచాంగం మన సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. దీనినే ఉగాది అంటారు. యుగాది అనే శబ్దం నుంచి ఉగాది అనే మాట వాడుకలోకి వచ్చింది. ఈ రోజున అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, షడ్రసాత్మకమయిన ఉగాది పచ్చడిని తినడం, పెద్దలకు నమస్కరించడం, పంచాంగ శ్రవణం చేయడం మన తెలుగువారికి ఆచారం. - సమ్మంగి భాస్కర రావు, సాక్షి, పెందుర్తి -
శ్రీవారి ఆలయం మూసివేత వెనుక కుట్ర ఉందా?
పెందుర్తి: మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంలో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా? అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ జరిగే విధానాన్ని భక్తులంతా తిలకిస్తారని.. కానీ ఆ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామంటూ టీటీడీ ప్రకటించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చాతుర్మాస దీక్ష నిమిత్తం రుషికేష్ పర్యటనలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ నిర్ణయంపై స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పాలకమండలి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం మూసివేత నిర్ణయం తీసుకునే ముందు.. శృంగేరి, కంచి వంటి పీఠాలతో గానీ, ఆగమ పండితులతో గానీ సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు. వైఖానస ఆగమం ఏం చెబుతుందో పాలక మండలి తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నీ భక్తుల్లో అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అసలు వారం పాటు సీసీ కెమెరాలను నిలుపుదల చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలయం మూసివేతపై ఆగమ పండితులను గానీ పీఠాధిపతులను గానీ సంప్రదించి.. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై ఉందన్నారు. -
మాయ నుంచి బయటపడాలి
సాక్షాత్తూ పరమశివుని అంశగా పేర్కొనదగిన శ్రీ శంకర భగవత్పాదుల వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళలోని కాలడిలో ఆర్యాంబ – శివగురువు దంపతులకు వైశాఖ శుక్ల పంచమినాడు జన్మించారు. వారు జన్మించేనాటికి భారతదేశం సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనావస్థలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు భగవంతుడొక్కడే అని ఘోషిస్తున్నా, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటూ, పరమత ద్వేషులుగా మారి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి. దాన్ని సమర్థంగా నివారించి సనాతన ధర్మ ప్రబోధతో ప్రజలను ఏకీకృతం చేసిన వారు శ్రీ శంకర భగవత్పాదులు. పిన్న వయస్సులోనే వేదవేదాంగాలను ఆపోశన పట్టి మహా పండితులను, విద్వాంసులనూ తన వాక్పటిమతో, మేధాసంపత్తితో అబ్బురపరచేవారు. పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటి మీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. అందులో శ్రీ శృంగేరీ శారదా పీఠం ఒకటి. శారదాంబ ఆలయ ప్రాకారంపైన పీఠంపై ఆసీనులై ఉన్న శ్రీ శంకర భగవత్పాదుల వారి మూర్తి దర్శనమిస్తుంది. పక్కనే వారు మానవాళికి జ్ఞానబోధ చేసిన శంకర భాష్యం, తదితర మహాగ్రంథాలను కూడా దర్శించుకోవచ్చు. వందల ఏళ్ల క్రితమే వారు భాష్యత్రయాన్ని, అనేక ప్రకరణ గ్రంథాలను, శివానందలహరి, సౌందర్యలహరిని, మనీషా పంచకాన్ని, ఇవిగాక అనేక స్తోత్రరత్నాలను అందించారు. ఆయన అన్ని గ్రంథాలను రచించడానికి కారణం బ్రహ్మచే సృష్టించబడిన మనుషులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుంటారు. వారిలో కొందరు తపశ్శక్తిని నమ్మినవారు, మరికొందరు స్తోత్రాధ్యయనాదులయందు ఇచ్ఛగలవారు, వీరినందరినీ పరిపూర్ణ విజ్ఞానవంతులను చేయడమనే శంకరుల ఆశయం. ఆయన అందించిన శ్లోకాలనేకం నేటికీ పండిత, పామర జనాల నాలుకల మీద నర్తిస్తున్నాయి.శంకరులు బోధించిన సాధన చతుష్టయం ద్వారా విజ్ఞానధనులై సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముని కృపకు పాత్రులు కావడమే ఆయన జయంతినాడు మనం సమర్పించే నమోవాకాలు. –స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శారదాపీఠం, విశాఖపట్నం