తెలుగు వారి నూతన సంవత్సరాన్ని శుభకామనలతో, కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధనతో పవిత్రంగా ఆరంభించడం సంప్రదాయమని, పంచాంగం చూడటమనేది పెద్దల చాదస్తమని కొట్టి పారేయడం సరి కాదనీ, కాలగణన వెనక ఎంతో నిశితమైన పరిశీలన, దూరదృష్టి ఉన్నాయనీ, అదేవిధంగా జ్యోతిష్యమనేది అవాస్తవమని కొట్టిపారేయడం అవివేకమనీ, జ్యోతిషానికి శాస్త్ర ప్రమాణం ఉందని అంటున్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణంలో... ఉగాది ప్రాశస్త్యాన్ని, నూతన ఉగాది ఫలాలనీ వారి మాటలలోనే తెలుసుకుందాం..
మన భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి. మనదేశంలోనే యుగాది భేదాలతో కాల విభాగం, దైవిక లౌకిక కర్మ విభాగాలు ఉన్నాయి. ఇతర దేశాలలో లేవు. మన రుషులు కాల నిర్ణయం అద్భుతంగా చేశారు. కాలం అంటే ఏమిటీ! భూత.. భవిష్యత్.. వర్తమానాలే కదా కాలాలు. ఈ కాలానికి రూపమేది! అంటే ప్రాణుల కదలికలు, పెరుగుదల, తగ్గుదల, ఆధారం చేసుకుని మానవుల మదిలో మెదిలేదే కాలం. కాలానికి రూపం లేదు. వస్తువులకు రూపం ఉంది. జరిగిపోయిన కాలాన్ని భూతమని.. రాబోయే కాలాన్ని భవిష్యత్ అని.. జరుగుతున్న కాలాన్ని వర్తమానం అని అంటాం. అసలు వర్తమానానికి ఎక్కడి నుంచి ఎక్కడకు కొలమానం? అంటే దానికి స్పష్టత లేదు. ఈ వర్తమానాన్ని ఆధారం చేసుకుని భూత, భవిష్యత్ కాలాలు ఉన్నాయి. అయితే కాలం రూపం లేనిది.. నిలకడ లేనిది కనుక అది వాగారంభణమే.. అంటే నోటి మాట మాత్రమే అనేది వేదాంత సిద్ధాంతం.
అయితే లోకం గురించి కాలనిర్ణయాన్ని మన పూర్వీకులు చాలా చక్కగా చేశారు. సూర్యచంద్రాది గ్రహాలు, భూమి పరివర్తన ఆధారం చేసుకుని తిథులు, నక్షత్రాలు ఆధారం చేసుకుని కాల నిర్ణయం చేశారు. ప్రతిరోజు, ప్రతిమాసం, ఋతువులతో సహా ఎలా ఏర్పడుతుంది, భూమి మీద అన్ని ప్రాణులకి ఋతువులతోను, మనుషులతోను, ఉత్తర, దక్షిణాయనాలతోనూ ఎలా సంబంధం ఉన్నది అన్నది మన పూర్వీకులు చూపించారు. అధి దైవికమైన సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులతో కూడిన సర్వదివ్యమైన జ్యోతనమైన అధి దైవికంతో భూగోళానికి ఉన్న సంబంధం మన కాల నిర్ణయం. దానినే జ్యోతిష్యం అంటాము.
కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. ఖగోళ, భూగోళ సంబంధాన్ని తెలియజేసేది ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచ చిత్రపటలాన్ని నమ్మము అంటే అవివేకమే.జ్యోతిష్యం అంటే మూఢ విశ్వాసం కాదు. ఇతర దేశాలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకునే సంవత్సరం కేవలం విశ్వాసంతో కూడినది కానీ మన సంవత్సరం విశ్వాసం మాత్రమే కాదు. ఖగోళంతో కూడిన సర్వసంబంధాలు భూమికి సంబంధం కలగడం వలన ప్రత్యక్ష ప్రచారంలో అనుభవ సిద్ధమైనది. మరి ఇంత విశాలమైన ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికాలతో కూడిన ఈ ప్రపంచం అనే ప్రకృతి ఎలా సృష్టించబడింది?.. అది ఎప్పుడు? అంటే దానిని తెలియజేసేదే మన యుగాది.
సృష్టి ఆరంభం...
మన ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటున్నాం. ధర్మసింధులో ఆ రోజున సృష్టి ప్రారంభమైనట్లు ఉంది. హేమాద్రిలో కూడా ‘చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రధమేఒహని’ అన్నాడు. అంటే బ్రహ్మ చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జగత్తును సృష్టించాడని ఉంది. అయితే ఒక వస్తువు సృష్టి కావాలంటే దానిని సృష్టించేవాడు, దేశం, కాలం అనేవి కావాలి కదా. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు అంటే అతను ఎక్కడ ఉండి ఎప్పుడు సృష్టించాడు? దానికి దేశం, కాలం చెప్పవలసి ఉంది. అలా అంగీకరిస్తే దేశాన్ని కాలాన్ని అతను సృష్టించ లేదనే కదా? అంతేకాదు దేశం, కాలం అనేవి జగత్తులోనే అంతర్గతాలు. కనుక జగత్తుని ఎక్కడ సృష్టించాలి. ఎప్పుడు సృజించాలి అనే ప్రశ్నలే పుట్టవు. శ్రుతి ఇలా చెప్పిందే కాని సృష్టి జరిగిందని ఎప్పుడూ నిరూపించలేదు.
సృష్టి జరిగితే బంధం అనేది సత్యం అవుతుంది. కనుక బంధ నివృత్తి ఎప్పుడూ కాదు. సత్యానికి నివృత్తి ఎక్కడిది? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ నకర్త్నత్వం, న కర్మోణి లోకస్య సృజతి ప్రభుః...అని అన్నారు. అంటే ఈ సృష్టిని చేయనేలేదని, అజ్ఞానం చేత పరమాత్మనే జగత్తు అని భ్రాంతి పొందుతున్నామని అన్నారు. మట్టిని వీడి కుండ లేదు అంతా మన్నే అన్నట్లు పరమాత్మ చేత జగత్తు పుట్టింది అంటే పరమాత్మను వదలి జగత్తు లేదు అంతా పరమాత్మయే అనే జ్ఞానం ఉపదేశించడానికే ఈ సృష్టి ప్రక్రియ ఒక ఉపాయం అని శ్రీగౌడపాదాచార్యులు ‘ఉపాయః స్నోవతామామ’ అని అన్నారు.
ఉగాది పండగ అంటే ఏమిటి?
ఈ చైత్ర మాసంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చేమలు తమ పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్ళతో కళకళలాడుతూ ప్రకృతి అంతా నవనవలాడుతుంది. అలాగే భక్తుడు ఈ ఉగాది నుండి అయినా సద్గురువులను ఆశ్రయించి తనలోని దోషం, క్రోధం, అసూయ, మిధ్యాజ్ఞానం, దురభిమానం అనే పాత భావాలను రాల్చి శాంతి.. దయ, విద్య మొదలగునవి సంపాదించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలాగే మనగలిగే అనేక మానసిక ఒత్తిడులకు తలొగ్గక ధీరులై ఉండి మనందరి ఆత్మీయ విశ్వం, పరమార్థం అనే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే ఉగాది పండుగ. అంతేగాని ఆ రోజు రకరకాల పిండివంటలు తిని ఉగాది బాగా జరిగింది అని అనుకుంటే అది భ్రాంతే. అయితే ఈ కొత్త సంవత్సరం వికారి నామసంవత్సరం పెద్దలు, యువకులు, సకల ప్రాణులు పరమాత్మ దయ వలన ఈ సంవత్సరమంతా బాగుండాలి. పంటలు పండాలి. అన్నం పెట్టే రైతు బాగుండాలి.
సమర్థవంతమైన పాలన ఉంటుంది
వికారి నామసంవత్సరంలో రాజు శని అయినందున మంత్రులు సమర్థవంతంగా పరిపాలన సాగిస్తారు. రాజకీయపరంగా ప్రతిపక్షంలో ఉన్న వారు బలం చూపించుకునే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే రవిగ్రహం మంత్రి అయిన కారణం చేతను రవి, శని శత్రువులు అయిన కారణంగానూ పరిపాలన విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సునందు గురు, శని, కేతు గ్రహాలు ఉండి ఈ రాశికి ఆరవ రాశినందు కుజుడు ఉండడం వలన అధికార, ప్రతిపక్షాలకు పోరు అధికంగా ఉంటుంది. ఈ గ్రహ యుద్ధంలో చివరి నిమిషంలో అధికార పక్షానికి ప్రమాదం ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో వాహన, అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది.
పంటలు బాగా పండుతాయి
జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి కారణం చేత సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. బుధుడు సస్యాధిపతి కావడం వల్ల పంటలు బాగా పండుతాయి. పెసలకు మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధ వ్యాపారాలు బాగుంటాయి. చంద్రుడు ధాన్యాధిపతి అయిన కారణంగా మంచి వర్షాలు కురుస్తాయి. పశుసంపద పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ధనుస్సునందు గురు, శని, కేతువుల కలయిక వలన దేశారిష్టయోగం ఉంది. దీని నివారణార్థం అధికారులు పీఠాధిపతులను, గురువులను సంప్రదించి శాంతి కర్మ ఆచరించిన తరువాత అంతా శుభాలు కలుగుతాయి.
స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి
పంచాంగం..‘వికారి’ ప్రవర్తన...
‘తిథిర్యారంభ యోగఃకరణమేవచ పంచాంగమతి విశ్యాతం లోకోయం కర్మ నాథక’ అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలతో కూడుకుని ఉన్న దానిని పంచాంగం అంటారు. అసలు పంచాంగాలతో ఎవరికి ఉపయోగం? దాని వలన ప్రయోజనం ఏమిటి? అనే సందేహాలు నేటితరంలో అందరినీ బాధిస్తున్నాయి. ఈ పంచాంగాలు వృద్ధులకు మాత్రమే సంబంధం మాకు కాదు అంటారు యువకులు. నిజానికి ఈ పంచాంగం అంటే వ్యక్తిగత విషయం కాదు అని గ్రహించాలి. వైయుక్తిక విషయముల కంటే సార్వత్రిక విషయాలే పంచాంగాల ముఖ్య లక్షణం. అది ఎలాగో పరిశీలిద్దాం. పంచాంగ గణితం మనకు అమావాస్య, పౌర్ణమి రూపంలో ప్రత్యక్ష ప్రమాణంగా సామాన్యులకు సైతం ఉన్నది. వర్షాల విషయంలో కూడా ప్రామాణికంగా తెలియజేస్తున్నాయి.
ప్రధానంగా గ్రహణాలు ఏ నిమిషానికి ప్రారంభమయి ఏ నిమిషంలో అంతమవుతాయి– అనే విషయంలో కూడా పంచాంగాలే ప్రామాణికం. పై విషయాలను నేటి సాంకేతిక విజ్ఞానంతో శాస్త్రవేత్తలు ఎన్నో కోట్ల వ్యయంతో పరిశ్రమ చేసి తెలుసుకుంటూ ఉంటే అవే విషయాలను శాస్త్రవేత్తలకు ఏ మాత్రమూ తీసిపోకుండా మన పంచాంగ కర్తలు కేవలం కాగితం, కలం సహాయంతో తెలుసుకుంటున్నారు... నిరూపిస్తున్నారు. ఇటువంటి పంచాంగం మన సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. దీనినే ఉగాది అంటారు. యుగాది అనే శబ్దం నుంచి ఉగాది అనే మాట వాడుకలోకి వచ్చింది. ఈ రోజున అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, షడ్రసాత్మకమయిన ఉగాది పచ్చడిని తినడం, పెద్దలకు నమస్కరించడం, పంచాంగ శ్రవణం చేయడం మన తెలుగువారికి ఆచారం.
- సమ్మంగి భాస్కర రావు, సాక్షి, పెందుర్తి
Comments
Please login to add a commentAdd a comment