సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా కరదీపిక పేరుతో తీసుకొచ్చిన హ్యాండ్ బుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇందులో 20 రకాల అంశాలను పొందుపరిచారు. వర్ణమాల, తెలుగు సంవత్సరాలు, తిథులు – వారాలు, పక్షాలు – ఆయనాలు, మాసాలు, రుతువులు, కార్తెలు, నక్షత్రాలు – రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, యుగాలు, ప్రాచీన కాలగణనం, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ప్రాచీన సంఖ్యామానం, పండుగలు, పండుగల పాటలు, రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ కళలు, వాయిద్య పరికరాలు, మన పంటలు – ఆహారం, మన ఆటలు, నీతి పద్యాలు, తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి.
మొత్తం 56 పేజీల పుస్తకం సమగ్ర సమాచారంతో అందరినీ ఆకట్టుకొంటోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిన నేటి తరానికి మన ప్రాచీన జ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కరదీపికను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికీ దీన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన 1.30 కోట్ల కుటుంబాలకు ఈ కరదీపికను డీఈవోలు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ హ్యాండ్ బుక్కులను సరఫరా చేస్తారు. కలెక్టర్లు గ్రామాలకు చేరుకొని ఈ హ్యాండ్ బుక్‌ను ప్రతి ఇంటికీ అందజేస్తారు. జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఈ పుస్తకాల్ని లక్ష వరకు ప్రింట్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment