చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు.
ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం.
ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్.
ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది.
ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు.
విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది.
ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు.
ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం.
పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే.
ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు.
నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం.
‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట.
మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్‌లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ–
– శ్రీరమణ
(2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది)
Comments
Please login to add a commentAdd a comment