ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..?
డొల్లు కర్తరీ ప్రారంభం..
ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది.
పెద్ద కర్తరీ ప్రారంభం..
ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం.
కర్తరీ త్యాగం..
ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం.
‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్‌లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు.
రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము
4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం.
నవనాయక ఫలితాలు (2024– 2025)
రాజు కుజుడు:
కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును.
మంత్రి శని:
వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు.
సేనాధిపతి శని:
సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది.
సస్యాధిపతి కుజుడు:
కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి.
ధాన్యాధిపతి చంద్రుడు:
గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము.
అర్ఘాధిపతి శని:
అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును.
మేఘాధిపతి శని:
వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును.
రసాధిపతి గురువు:
గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
నీరసాధిపతి కుజుడు:
పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును.
ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!
Comments
Please login to add a commentAdd a comment