
వివాహం ఆలస్యమవడానికి కుజదోషం అసలు కారణం కానే కాదు. వివాహం ఆలస్యానికి గ్రహసంబంధమైన దోషాలు వాటి కారణాలు వేరేగా ఉంటాయి. ప్రజలలో అక్కరలేని అపోహలు కుజ దోషం మీద ఎక్కువయ్యాయి. ప్రధానంగా భర్తకు కుజదోషం ఉంటే భార్యకు నష్టం. భార్యకు కుజ దోషం ఉంటే భర్తకు నష్టం అని కుజదోష సంబంధమైన సూత్రాలలో ఉంటుంది. అసలు భార్యాభర్త అనే పదాలు వివాహం అనంతరం ప్రారంభం అవుతాయి కదా! వివాహం ముందు కాదు కదా! ఆలోచించవలసిన విషయమే!
కుజ దోషం ప్రభావం కూడా వివాహం తర్వాతనే ప్రారంభం అవుతుంది అని స్పష్టంగా వాటికి సంబంధించిన శాస్త్రాలలో కనబడుతుంది. మరి నేటి సమాజంలో వ్యాపార ధోరణితో జరుగుతున్న వివాహం ఆలస్యానికి కుజదోషం కారణం అనేది ఎంత తప్పుదోవ పట్టించే అంశమో గుర్తించండి. కుజదోషం స్థాయిని అనుసరించి కలహములు, విడిపోవడం, మరణం, బలవన్మరణం వంటివి చెప్పాలి.
కుజదోష శాంతి వివాహానికి ముందు చేయుట అజ్ఞానమే. మీరు శాంతి చేయించినా, శాంతి చేయించకున్నా వివాహ పొంతనలు చూసేటప్పుడు కుజదోషం ఉన్నవారికి ఉన్నట్టు గానే, కుజదోషం లేనివారికి కుజదోషం లేనట్టుగానే జాతకములు శోధన చేయవలెను. అందువలన వివాహ ఆలస్యానికి కుజదోషానికి వివాహాత్ పూర్వం చేసే శాంతికి సంబంధం లేదు. వివాహానంతరం కుజదోషం యొక్క ఉద్ధృతి తగ్గి, కుటుంబ సమస్యలు తగ్గడానికి సుబ్రహ్మణ్యారాధన, ఆంజనేయస్వామి ఆరాధన, భౌమ చతుర్థి వ్రతం, కృష్ణాంగారక చతుర్థి వ్రతం వంటివి ఆచరించటం చాలా అవసరం.