జీవితమనే చెట్టు
గొప్ప గొప్ప లక్ష్యాల
చిగుర్లు వేసింది
ప్రయత్నాల పూత
పూసింది విరివిగా
కానీ చేదుగా;
అభిమానం అడ్డొచ్చి
పడింది పిందెలుగా
అయితే గుత్తులు గుత్తులుగా,
అంతలో.. చింత
చిరాకుపడి,
పులుపుని రేపడం మొదలుపెట్టింది
ఊరుకోని పట్టుదల
పచ్చపచ్చగా వ్యాపించి
ఎదగడం మొదలుపెట్టింది;
కటువుగా
కారం చల్లినట్లు..
నిర్ణయాలు వాటి వాటి
స్థానం తీసుకున్నాయి;
ధైర్యం
విషయ గుజ్జుని గ్రహించింది..
లోపాలకు వగరు మందేసింది..
పరిశ్రమ
కఠోరంగా అన్నిటినీ కలిపంది..
విజయం తియ్యగా వరించింది
కృతజ్ఞత
ఎక్కువ మోతాదులో కాకుండా..
తగిన మోతాదులో
ఉపయోగించాలని
ఉప్పు ఉపదేశించింది..
మొత్తానికి
కచ్ఛాపచ్ఛాగా
పచ్చడవుతున్న జీవితం..
మాంఛి.. పసందైన
షడ్రుచులతో
నడుస్తున్నది!
:::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment