మాయ నుంచి బయటపడాలి | devotional information | Sakshi
Sakshi News home page

మాయ నుంచి బయటపడాలి

Apr 30 2017 1:10 AM | Updated on Sep 5 2017 9:59 AM

మాయ నుంచి బయటపడాలి

మాయ నుంచి బయటపడాలి

సాక్షాత్తూ పరమశివుని అంశగా పేర్కొనదగిన శ్రీ శంకర భగవత్పాదుల వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళలోని కాలడిలో ఆర్యాంబ

సాక్షాత్తూ పరమశివుని అంశగా పేర్కొనదగిన శ్రీ శంకర భగవత్పాదుల వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళలోని కాలడిలో ఆర్యాంబ – శివగురువు దంపతులకు వైశాఖ శుక్ల పంచమినాడు జన్మించారు. వారు జన్మించేనాటికి భారతదేశం సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనావస్థలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు భగవంతుడొక్కడే అని ఘోషిస్తున్నా, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటూ, పరమత ద్వేషులుగా మారి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి. దాన్ని సమర్థంగా నివారించి సనాతన ధర్మ ప్రబోధతో ప్రజలను ఏకీకృతం చేసిన వారు శ్రీ శంకర భగవత్పాదులు. పిన్న వయస్సులోనే వేదవేదాంగాలను ఆపోశన పట్టి మహా పండితులను, విద్వాంసులనూ తన వాక్పటిమతో, మేధాసంపత్తితో అబ్బురపరచేవారు.

పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటి మీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన  శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. అందులో శ్రీ శృంగేరీ శారదా పీఠం ఒకటి. శారదాంబ ఆలయ ప్రాకారంపైన పీఠంపై ఆసీనులై ఉన్న శ్రీ శంకర భగవత్పాదుల వారి మూర్తి దర్శనమిస్తుంది. పక్కనే వారు మానవాళికి జ్ఞానబోధ చేసిన శంకర భాష్యం, తదితర మహాగ్రంథాలను కూడా దర్శించుకోవచ్చు. వందల ఏళ్ల క్రితమే వారు భాష్యత్రయాన్ని, అనేక ప్రకరణ గ్రంథాలను, శివానందలహరి, సౌందర్యలహరిని, మనీషా పంచకాన్ని, ఇవిగాక అనేక స్తోత్రరత్నాలను అందించారు.

ఆయన అన్ని గ్రంథాలను రచించడానికి కారణం బ్రహ్మచే సృష్టించబడిన మనుషులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుంటారు. వారిలో కొందరు తపశ్శక్తిని నమ్మినవారు, మరికొందరు స్తోత్రాధ్యయనాదులయందు ఇచ్ఛగలవారు, వీరినందరినీ పరిపూర్ణ విజ్ఞానవంతులను చేయడమనే శంకరుల ఆశయం. ఆయన అందించిన శ్లోకాలనేకం నేటికీ పండిత, పామర జనాల నాలుకల మీద నర్తిస్తున్నాయి.శంకరులు బోధించిన సాధన చతుష్టయం ద్వారా విజ్ఞానధనులై సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముని కృపకు పాత్రులు కావడమే ఆయన జయంతినాడు మనం సమర్పించే నమోవాకాలు. –స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శారదాపీఠం, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement