గుర్ఖా లొల్లి లోగుట్టు | Centre rushes 600 paramilitary personnel to Darjeeling, seeks report from Bengal govt | Sakshi
Sakshi News home page

‘డార్జిలింగ్‌’ ఉడుకుతోంది..

Published Tue, Jun 13 2017 8:12 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

గుర్ఖా లొల్లి లోగుట్టు

గుర్ఖా లొల్లి లోగుట్టు

వేసవిలోనూ చల్లగా ఉండే పర్వతప్రాంతం ‘డార్జిలింగ్‌’ వానాకాలం వచ్చేసినా... ఉడుకుతోంది. ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్‌ కావాలనే డిమాండ్‌తో ఇక్కడి ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపినివ్వడం... మరోవైపు శాంతిభద్రతల నిమిత్తం బెంగాల్‌ ప్రభుత్వం ఆర్మీని రప్పించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజానికి గూర్ఖాలాండ్‌ డిమాండ్‌ కొత్తదేమీ కాదు... వందేళ్లుగా ఉన్నదే. మరిప్పుడు ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే... రాజకీయ ఆధిపత్య పోరే కారణం.

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బెంగాలీని తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ఆధిపత్యంలోని డార్జిలింగ్‌లో హింసాత్మక ఆందోళనలకు దిగారు.. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమత గోబ్యాక్‌ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగం కూడా జరిగింది. గుర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు జీజేఎం నాయకుడు బిమల్‌ గురుంగ్‌ ప్రకటించారు.

ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని ప్రకటించారు. మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్‌’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.  ఆరు పటాలాల సైన్యం, ఐదు కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, స్థానిక పోలీసులను పెద్ద సంఖ్యలో డార్జిలింగ్‌లో మొహరించింది బెంగాల్‌ ప్రభుత్వం. కేంద్రం మంగళవారం మరో 600 మంది పారా మిలటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు తరలించింది.

పైచేయి సాధించాలనే ఆరాటం...
నిజానికి ప్రస్తుతం డార్జిలింగ్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. ప్రతిపాదిత గూర్ఖాలాండ్‌ ప్రాంతంలో బిమల్‌ గురుంగ్‌ మాటకు తిరుగులేదు. అయితే మమత ఈ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇతర ఆదివాసీలైన లెప్చాలు, తమంగ్స్, భూటియాలు, షెర్పాలు, మంగర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించారు. కలింపాంగ్‌ను జిల్లాగా చేస్తున్నట్లు ప్రకటించారు. గతనెల 14న నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా... మిరిక్‌ మున్సిపాలిటీని తృణమూల్‌ గెలుచుకుంది. పర్వతప్రాంతాల్లో తమకు పెట్టని కోటలుగా ఉన్నచోట్ల తృణమూల్‌ ఖాతాలు తెరవడం, మిరిక్‌కు కైవసం చేసుకోవడాన్ని... తన ఆధిపత్యానికి సవాల్‌గా గురుంగ్‌ భావించారు. బెంగాలీ తప్పనిసరి అనే మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ సెంటిమెంటును తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్‌ ఆలోచన.

బీజేపీకి చెక్‌ పెట్టడమే దీదీ వ్యూహం..
ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో (కూచ్‌ బెహార్, అలీపూర్‌దౌర్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్‌) 2014– 2016 మధ్యకాలంలో బీజేపీ బాగా బలపడింది. 42 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిలాల్లో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. డార్జిలింగ్‌ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉంటుందని, మైదాన ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారు కాబట్టి వీరి మద్దతు తృణమూల్‌కు లభిస్తుందని మమత లెక్క. బెంగాల్‌ విభజనకు మమత మొదటి నుంచి వ్యతిరేకమే. ఎన్డీయే భాగస్వామి అయిన జీజేఎం మద్దతుతోనే 2014లో బీజేపీ డార్జిలింగ్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూర్ఖాలాండ్‌ను బీజేపీ ప్రస్తావించింది. కాబట్టి బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి... ఈ జిల్లాల్లో కమలం పార్టీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైతే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. బెంగాల్‌ బీజేపీ నేతలు విభజనను బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం జేజీఎం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గూర్ఖాలాండ్‌కు మొగ్గితే ఉత్తరప్రదేశ్‌లో, మహారాష్ట్రలో విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయి కాబట్టి బీజేపీ ఏమీ తేల్చదు. పైగా బెంగాల్లో బలపడాలని కమలనాథులు చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే గూర్ఖాలాండ్‌ విభజనను ఇప్పట్లో పట్టించుకోరు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు.


110 ఏళ్ల డిమాండ్‌
డార్జిలింగ్‌ పర్వత ప్రాంతంతో పాటు సిలిగురి, జల్‌పాయ్‌గురిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్‌ ఏర్పాటు చేయాలనేది డిమాండ్‌. భారతీయులమైనప్పటికీ... తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనందువల్ల ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా తమకూ ఒక రాష్ట్రం ఉండాలని వీరు బలంగా కోరుకుంటున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వినతిపత్రం అందింది. 1952లో నాటి భారత ప్రధాని నెహ్రూకు ఆలిండియా గూర్ఖా లీగ్‌ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం ఏర్పాటైన తొలి ఎస్సార్సీ తలుపుతట్టినా ఫలితం శూన్యం. తర్వాత ఇందిరాగాంధీ ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్‌ ఘీషింగ్‌ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్‌ ఉద్యమించింది.

1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. 1988 ఆగష్టు 22న ఉద్యమకారులకు, కేంద్రానికి, బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి... ఈ ప్రాంత పరిపాలన చూడటానికి డార్జిలింగ్‌ గూర్ఖా హిల్‌ కౌన్సిల్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఏర్పాటైంది. షీఘింగ్‌ 2008 దాకా డీజీహెచ్‌ఎస్‌కు నేతృత్వం వహించారు. బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలోని జీజేఎం బలమైన శక్తిగా ఎదగడంతో ఘీషింగ్‌ డార్జిలింగ్‌ను వదిలి వెళ్లారు. 

మరో ఉద్యమం తర్వాత గూర్ఖాలాండ్‌ ప్రాదేశిక పాలనావిభాగం (జీటీఏ) ఏర్పాటైంది. ఆరో షెడ్యూల్‌లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్‌ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్‌ తిరిగి ఎత్తుకున్నారు.– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement