డార్జిలింగ్‌లో ఆగని ‘ప్రత్యేక’ మంటలు
డార్జిలింగ్/న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం ప్రకటించిన దరిమిలా దేశంలో పలుచోట్ల ‘ప్రత్యేక’ మంటలు వ్యాపించాయి. గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం మూడోరోజూ బంద్ కొనసాగింది. అస్సాంలో ‘ప్రత్యేక’ వాదాన్ని వినిపిస్తున్న పలు సంఘాలు సోమవారం నుంచి 1,500 గంటల బంద్ ప్రారంభించాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కలింపాంగ్‌లో గూర్ఖాలాండ్ డిమాండ్‌తో ఆత్మాహుతి చేసుకున్న గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుదారు మంగళ్‌సింగ్ అంతిమయాత్రలో జీజేఎం కార్యకర్తలు మౌనప్రదర్శనగా పాల్గొన్నారు.
అట్టుడుకుతున్న అస్సాం: ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాం అట్టుడుకుతోంది. కర్బీ-అంగ్లాంగ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల్లో చెదురు మదురు ఘటనలు జరిగాయి. ‘బోడోలాండ్’ డిమాండ్ కూడా ఊపందుకుంది. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, యునెటైడ్ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ సోమవారం 1,500 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
కర్ణాటకలోనూ డిమాండ్లు: కర్ణాటకలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు మొదలయ్యాయి. 1956 వరకు సి-కేటగిరీ రాష్ట్రంగా ఉన్న కొడుగుకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్‌యూ నాచప్ప కొడవ హెచ్చరించారు. కాగా, కర్ణాటకలో అత్యంత వెనుకబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలని హైదరాబాద్-కర్ణాటక జనపర సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తోంది.