కాంగ్రెస్ స్వలాభానికే విభజన
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభం కోసమే ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. 2004 నుంచీ తెలంగాణ ఏర్పాటును పట్టించుకోకుండా ఇవాళ పెద్ద గందరగోళం సృష్టించాయంటూ ధ్వజమెత్తారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఏర్పాటు చేస్తూనే, మరోవైపు సీమాంధ్రుల డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుకు బీజేపీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధులు నిర్మలా సీతారామన్, సుధాంశు త్రివేదిలతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు బీజేపీ దీర్ఘకాలిక ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రల్లో సుపరిపాలన, అభివృద్ధి జరగాలనే దృష్టితోనే రాష్ట్ర విభజనను తాము కాంక్షించామన్నారు. తెలంగాణ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డిమాండన్నారు. భావోద్వేగాలతో ముడివడ్డ సున్నితమైన అంశం కాబట్టే తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని వివరణ ఇచ్చారు. తమ హయాంలో మూడు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఏర్పాటయ్యాయన్నారు. యూపీఏ, కాంగ్రెస్ మాత్రం తెలంగాణ నిర్ణయం తీసుకున్నాయే తప్ప సీమాంధ్రుల డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఓవైపు తెలంగాణ బిల్లు తెస్తున్నారు.
ఇంకో వైపు వారి పార్టీ సీఎం, కాంగ్రెస్‌లోని కేంద్ర, రాష్ట్ర, సీమాంధ్ర మంత్రులు, పార్టీ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా కాంగ్రెస్‌లోనే విభజన జరిగింది. అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ, సీమాంధ్రుల డిమాండ్ల అంశాలను యూపీఏ, కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించడం లేదు’’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును, సీమాంధ్రుల డిమాండ్లను పరిష్కరించడాన్ని సీరియస్ అంశంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వస్తే మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించారు. అలాగే సీమాంధ్రుల డిమాండ్లపై తమకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాదును యూటీ చేయాలనే ప్రతిపాదనలు, సీమాంధ్రుల డిమాండ్లకు సంబంధించిన ప్రశ్నలపై రాజ్‌నాథ్ బదులిస్తూ యూపీఏ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయని, బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడుతామని అన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలన్నారు.