‘భాషాప్రయుక్తా’నికి సమాధి
యూపీఏ ప్రభుత్వం తెలంగాణ సమస్యను తన ఐదేళ్ల ఎజెండాలో చివరి అంశాన్ని చేసింది. ఎలాంటి బాధ్యతలను తీసుకోకుండానే ఎన్నికల్లో లబ్ధిని సాధించాలని కోరుకుంది. లేకపోతే ఈ ప్రమాదకరమైన నాటకం లేకుండానే రెండు మూడేళ్ల క్రితమే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేది. పార్టీలే కాదు దేశం కూడా ఇందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
భారత యూనియన్‌లో 30వ రాష్ట్రం అవతరిస్తుంది. 29వ రాష్ట్రమైన తెలంగాణ భారత అంతర్గత పటం పునర్వ్యవస్థీకరణలో చిట్ట చివరిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ గాంధేయవాది పొట్టి శ్రీరాములు 1952లో చేపట్టిన ఆమరణ దీక్షతో ఈ పునర్వ్యవస్థీకరణ మొదలు కావడమే ఆంధ్రప్రదేశ్ విభజనలోని వైచిత్రి. మద్రాసు రాష్ట్రంలోని తె లుగు మాట్లాడే జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భాషా ప్రాతిపదికపై గీసిన రేఖలను అనుసరించి రాష్ట్రాలను ఏర్పాటు చేయడమనే ఆ భావన అప్పటికే అస్తిత్వంలో ఉన్న ‘పరిపాలనాపరమైన సౌలభ్యం’ కోసం రాష్ట్రాల ఏర్పాటుకు విరుద్ధమైనది. సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వం లోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) 1955లో భాషాప్రయుక్త రాష్ట్రాల భావనను లాంఛనప్రాయంగా ధ్రువీకరించింది. ప్రాంతీయ అస్తిత్వ భావోద్వేగాల బలం పరిపాలనాపరమైన అవసరాలను అధిగమించింది.
తెలంగాణ పురిటి నొప్పులు పడుతుండగా ఆంధ్ర వ్యాప్తంగా చిమ్మిన విషాల నుంచే తదుపరి రాష్ట్రం ఏర్పాటు కారాదని నిషేధించాల్సింది ఆ భగవంతుడే. అలసిసొలసిన, నైతికంగా దివాలా తీసిన పార్లమెంటు తెలంగాణ పుట్టుకను ప్రకటిస్తుంటే ఒక రాష్ట్రాన్ని రెండుగా చేస్తున్నట్టు గాక దేశాన్ని విభజిస్తున్నట్టే అనిపించింది.
యూపీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలకు గానీ, వాటిని బీజేపీ ఆమోదించడానికి గానీ ఉన్న విలువ స్వల్పం. పంజాబ్ విభజన సమయంలో చండీగఢ్ ఆ రాష్ట్రానికే రాజధానిగా ఉంటుందని వాగ్దానం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత కూడా అది దాన్ని హర్యానాతో పంచుకుంటూనే ఉంది. అలా పంజాబ్, హర్యానాలు కనీసం చండీగఢ్‌లోనైనా కలసిపోతున్నాయి. భావనాపరమైన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ సీమాంధ్ర కు దూరంగా ఉంది. తత్పర్యవసానంగా కలుగగల ప్రమాదకర పర్యవసానాలను ఊహించి చెప్పడం అత్యంత ధైర్యవంతుడైన ద్రష్టకు మాత్రమే సాధ్యం.
తెలంగాణ ఏర్పాటు ఒక నమూనాగా ఆచరణలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు చరమగీతం పాడేసినట్టే. ఇక పరిపాలన, ఆర్థిక వ్యత్యాసాలు మాత్రమే సరికొత్త, ఏకైక కొలబద్దగా మారుతాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఒకే భాషను మాట్లాడుతారు. అయితే ఇలాంటి విభజన ఇంతకు ముందు జరిగింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాగే అదే భాషను మాట్లాడుతుంది. మాండలిక భేదాలు మినహా రెండూ ఒకే లిపిని వాడుతాయి. అయితే అది ఒక మినహాయింపు మాత్రమే. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల ఏర్పాటు జాతిపరమైన కారణాలతోనే జరిగింది.
అభివృద్ధిలో పక్షపాతం అనే ఆరోపణతో ప్రేరిపితమయ్యే భావి విభజనలు ఆర్థికపరమైన పొందిక లోపించడం చుట్టూ పరిభ్రమిస్తాయి. ఈ హడావుడి గందరగోళం ముగిశాక, యుద్ధంలో ఓడిపోవటం, గెల వటం ముగిశాక మనం ఒక అత్యంత మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది: చిన్న రాష్ట్రం సుపరిపాలనకు హామీని ఇవ్వగలుగుతుందా?
అసమతూకానికి ఒకే ఒక్క కారణం ఎప్పుడూ ఉండదు. తెలంగాణ పాత నిజాం రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అక్కడి చిన్న, రాచరిక సంపన్న కులీనుల వర్గం అత్యంత సంపన్నవంతమైనది. 1948లో అది భారత యూనియన్‌లో చేరినప్పుడుగానీ లేదా 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడుగానీ నాడు ఆధిపత్యం కోసం పోటీపడుతున్న మిగతా బృందాలేవీ ఆస్తులు, సంపదల విషయంలో వారికి సాటిరాగలిగేవి కావు. అయితే ఈ సంపన్న వర్గం విచిత్రమైన, తలబిరుసుతనం సైతం గలిగిన సోమరితనాన్ని ప్రదర్శించింది. గొప్ప ఆస్తుల పునాదులను కలిగి ఉండి కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించడానికి అందివచ్చిన అవకాశాన్ని తాము జారవిడుచుకోవడమే కాదు తమ రాష్ట్రానికి కూడా దక్కనీయకుండా చేసింది. అలాంటి అసమర్థతకు మీరు మరెవరినీ నిందించ లేరు.
అయితే నేటి రాష్ట్ర విభజన సమస్య ప్రైవేటు పెట్టుబడి క్షీణతకు సంబంధించినది కాదు. మేకులా గుచ్చినట్టున్న ప్రభుత్వ విధానానికి సంబంధించినది. న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధికి హామీని కల్పించడమే ప్రభుత్వం పోషించగల ప్రాథమిక పాత్ర. ఆరున్నర దశాబ్దాలు... వేచి వుండే గదిలోనే పడి ఉండడానికి చరిత్రకు సైతం చాలా ఎక్కువ. ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ నమూనా అబ్రహం లింకన్ నిర్వచించినదే: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ప్రభుత్వం. ఇందులో రెండవ మూల స్తంభం ఊగిసలాడిపోతే మొత్తంగా సౌధమే కుప్పకూలిపోతుంది.
ఇంతకూ తెలంగాణ ఏర్పాటు నూతన రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి హామీని ఇస్తుందా? ఆధారాలు అవును, కాదుల మిశ్రమంగా ఉన్నాయి. హర్యానా, పంజాబ్‌లు రెండూ విడిపోయాక మరింత సుసంపన్నవంతమయ్యాయి. ఇటీవలి కాలంలో వేరు పడిన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లు ప్రత్యేక కుదుళ్ల నుంచి పుష్పించాయి. అయితే జార్ఖండ్ మాత్రం బీహార్ నుంచి విడిపోయినప్పటి నుంచి దయనీయమైన స్థితిలో, అస్థిరత్వంతో, లంచగొండి పాలనతో కొట్టుమిట్టాడుతోంది. బేరసారాల వ్యాపారం ఆ రాష్ట్ర రాజకీయవేత్తల ప్రత్యేక నైపుణ్యం. మంచి ధర పలకాలేగానీ అక్కడి శాసన సభ్యులు అమ్మకం గుర్రాలుగా మారిపోడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇటీవల ఒక జార్ఖండ్ మంత్రి తమ ప్రభుత్వాన్ని ఎన్నడూ ఎరుగని అత్యంత అవినీతికర ప్రభుత్వంగా అభివర్ణించి, ఆ కారణంగా పదవిని పోగొట్టుకున్నారు. గొప్ప సహజ వనరులున్న జార్ఖండ్ వాటితోనే సంపన్న రాష్ట్రంగా మారిపోగలదన్న తర్కంతోనే బీహార్ నుంచి అది విడాకులు పుచ్చుకుంది. అది జరగ లేదు. కాబట్టి ప్రస్తుతం జార్ఖండ్ ప్రత్యేకించి సందర్భోచితమైనది.
ఒక జంట విడాకులు పుచ్చుకున్నప్పుడు లేదా ఉమ్మడి కుటుంబం నుంచి ఓ సోదరుడు విడిపోవడం జరిగినప్పుడు విద్వేషం ప్రబలడం దాదాపు అనివార్యం. ఆ ద్వేషం ఆర్థికపరమైన పోటీకి దారి తీసినట్టయితే దానివల్ల కొంత మంచి జరుగుతుంది. బాగుపడాలనే వాంఛ అతి తరచుగా ప్రత్యర్థులు మరింతటి సమున్నతిని సాధించడానికి దోహదపడుతుంది. తెలంగాణ, సీమాంధ్రల విషయంలో కొంత శంక కలుగుతోంది. ఎందుకంటే లక్ష్యాన్ని సాధించడం కోసం అనుసరించిన పద్ధతులు దేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగనంతటి స్థాయిలో ఆవేశకావేశాలను, ద్వేషాన్ని సృష్టించాయి.
సంఘర్షణకు దారితీసే అవకాశమున్న కారణాలు పరివర్తనాత్మకమైన ఉద్వేగాలపరమైనవి మాత్రమే కాదు. నీరు వ్యవసాయానికి జీవన్మరణ సమస్య. వాటాల పంపకంపై వాదనలు అరుదుగా మాత్రమే హేతుబ్దతపై ఆధారపడి ఉంటాయి. రెండవది, తక్షణమైనది హైదరాబాద్‌లోనూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉన్న భారీ పెట్టుబడులు. సామరస్యం అడుగంటితే జన సమూహాలు ఒరవడిలో పడి కొట్టుకుపోవడం ప్రారంభమవుతుంది. ద్వేష భావం పెచ్చుపెరుగుతుంది. వాతావరణంలో హింస తారట్లాడుతూ ఉంటుంది. భారత దేశపు శరీరంపైన మరొక విషపూరితమైన గాయం ఏర్పడటం మనం కోరుకోం.
యూపీఏ ప్రభుత్వం తెలంగాణ సమస్యను తన ఐదేళ్ల ఎజెండాలో చివరి అంశాన్ని చేసింది. ఎందుకంటే అది ఎలాంటి బాధ్యతలను తీసుకోకుండానే ఎన్నికల పరమైన ప్రయోజనాలను సాధించాలని కోరుకుంది. లేకపోతే ఈ ప్రమాదకరమైన నాటకం ఆంతా లేకుండానే కొత్త రాష్ట్రం రెండు మూడేళ్ల క్రితమే ఏర్పాటు చేసి ఉండేది. కేవలం రాజకీయ పార్టీలే కాదు దేశం కూడా ఇందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
-ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు