యాదగిరిగుట్ట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదని, అందుకే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధితోనే సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ను తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. అంత మాత్రాన తాము సమైక్య ఉద్యమానికి మద్దతు పలికినట్లు కాదని, తెలంగాణను వ్యతిరేకించినట్టు కాదని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో సభ్యులను సస్పెండ్ చేసే సంస్కృతి మంచిది కాదన్నదే తమ ఉద్దేశమన్నారు. బొగ్గు కుంభకోణంపై చర్చ జరగకుండా చేసేందుకు సభ్యులను సస్పెండ్ చేయడం, ఇతర గొడవలను కాంగ్రెస్ ప్రోత్సహించడం చేస్తోందని విమర్శించారు.
తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని, అప్పుడు ఎలాంటి గొడవలూ లేకుండా అందరిని సంప్రదించి, వివాదరహితంగా రాష్ట్రాలు ఇచ్చామన్నారు. విభజన అంశంపై మరో అఖిలపక్షం వేయడం ముమ్మాటికి తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని అన్నారు. ఒక వేళ కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించి, తెలంగాణ ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పై సమరభేరి మోగిస్తామని హెచ్చరిం చారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, నాయకులు డి.విజయ్‌పాల్‌రెడ్డి, తొడిమె రవీందర్‌రెడ్డి, తిరుమల్,గుంటిపల్లి సత్యనారాయణ,శ్రీనివాస్,శ్యామ్, బాలస్వామి తదితరులు ఉన్నారు
కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు నల్లు ఇంద్రసేనారెడ్డి
Published Sat, Aug 24 2013 3:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement