72 గంటల్లోగా బంద్ విరమించాలి | Mamata Banerjee issues 72-hour deadline to GJM, says she 'will not give up Darjeeling' | Sakshi
Sakshi News home page

72 గంటల్లోగా బంద్ విరమించాలి

Published Sun, Aug 11 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

Mamata Banerjee issues 72-hour deadline to GJM, says she 'will not give up Darjeeling'

డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఎనిమిది రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక బంద్‌ను చట్టవిరుద్ధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రకటించారు.బంద్‌ను విరమించుకునేందుకు జీజేఎంకు 72 గంటల గడువు విధించారు. బంద్‌లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రిగా తనకు కొన్ని రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నాయని మమత కోల్‌కతాలో ఏర్పాటైన మీడియా సమావేశంలో అన్నారు. ‘ఎనిమిది రోజులు సహనం వహించాను... నేను చాలా కఠినురాలిని. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పించవద్దు’ అని హెచ్చరించారు.
 
డార్జిలింగ్ తన గుండె అని, రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని మమత తేల్చి చెప్పారు. బంద్‌ను విరమించుకుంటే, చర్చలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చర్చల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లేదా హోంశాఖ కార్యదర్శిని సంప్రదించవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా మమత విమర్శలు కురిపించారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సూచించారు. డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గంపై కన్నేసి ఎవరూ జీజేఎంతో అవగాహన కుదుర్చుకోరాదని హెచ్చరించారు. అయితే, మమత అల్టిమేటంపై గురుంగ్ తీవ్రంగా స్పందించారు. నిరంకుశత్వంతో తమను లొంగదీయాలని ఆమె భావించినట్లయితే, అది పొరపాటే అవుతుందని అన్నారు. ్ర ఆమె తన అల్టిమేటంను ఉపసంహరించుకోకుంటే ‘జనతా కర్ఫ్యూ’ను అమలు చేస్తామని హెచ్చరించారు. మమత అల్టిమేటం నేపథ్యంలో స్థానిక పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు డార్జిలింగ్‌లో భారీ ఎత్తున మోహరించాయి. జీజేఎం మద్దతుదారులు పలువురిపై అరెస్టు వారంట్లు ఉన్నాయని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డార్జిలింగ్ ఎస్పీ కునాల్ అగ్రవాల్ చెప్పారు. ఇదిలా ఉండగా, జీజేఎం కీలక నేతలు ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పాత కేసులకు సంబంధించి గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ (జీటీఏ) పాలక మండలి సభ్యుడు మహేంద్ర ప్రధాని, జీజేఎం డార్జిలింగ్ పట్టణ శాఖ అధ్యక్షుడు నారాయణ్ ప్రధాన్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
 డార్జిలింగ్‌లో కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత...
 గూర్ఖాలాండ్ ఉద్యమంపై మమత సర్కారు అణచివేత కొనసాగిస్తోంది. తాజాగా, డార్జిలింగ్ పట్టణంలోని కేబుల్ ఆపరేటర్ల సేవలను నిలిపివేసింది. తగిన పత్రాలు లేనందునే ఈ చర్య తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా, మరోవైపు కేబుల్ ప్రసారాలు నిలిచిపోవడంతో ప్రజలు ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోలేని పరిస్థితిలో పడ్డారు.  
 
 అస్సాంలో ‘ప్రత్యేక’ డిమాండ్లను ఆలకించిన పాండే
 గువాహటి/దిఫు: అస్సాంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే శనివారం ఆలకించారు. కర్బీ ఆంగ్లాంగ్‌ను తెలంగాణ తరహాలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరగా, దీనిని అస్సాంలోనే స్వయంప్రతిపత్తి గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కర్బీ ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్తి రాష్ట్ర డిమాండ్ కమిటీ (కేఏఏఎస్‌డీసీఓఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోనియాను ఉద్దేశించి రాసిన వినతిపత్రాన్ని పాండేకు అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement