డార్జిలింగ్‌లో చెలరేగిన హింస
► పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి!
► పోలీస్ అవుట్‌పోస్టు, రైల్వే స్టేషన్‌కు నిప్పు
డార్జిలింగ్/కోల్‌కతాæ: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో గత 24 రోజులుగా జరుగుతున్న బంద్ శనివారం హింసాత్మకంగా మారింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఆర్మీ బలగాలను వీధుల్లో మోహరించింది. పోలీసులు శుక్రవారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం కార్యకర్తలు మరణించారని పార్టీ నేతలు ఆరోపించారు.
అందుకు ప్రతీకారంగా కార్యకర్తలు శనివారం ఓ పోలీస్ ఔట్‌పోస్ట్, టాయ్ ట్రైన్ స్టేషన్‌ను తగులబెట్టడంతోపాటు పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఉద్యమ పార్టీలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ముందు వారు హింసను విడనాడాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు.అయితే ఇక మమతతో తాము మాట్లాడేదేమీ ఉండదనీ, కేంద్రం చర్చలకు పిలిస్తే వెళ్తామని జీజేఎం ఒక ప్రకటనలో తెలిపింది. గతనెలలోనూ పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు చనిపోవడం తెలిసిందే. ముగ్గురు కార్యకర్తలు చనిపోతే ఒక్కరే అని చెబుతున్నారని అప్పట్లో జీజేఎం ఆరోపించింది.
బదురియా అల్లర్లపై న్యాయ విచారణ
బదురియా, బసీర్హాట్‌లో మత ఘర్షణలపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ మహిళా ఎంపీ రూపా గంగూలీ మహమ్మద్ ప్రవక్తపై పెట్టిన వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్టు కారణంగా ఈ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ పోస్టుతో ఆగ్రహించిన కొందరు ముస్లింలు బసీర్హాట్‌లో హిందువుల ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై జ్యుడీషియల్ కమిషన్ పూర్తిగా విచారణ చేపడుతుందని, నిష్పాక్షిక నివేదికను అందజేస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఘటనలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అలాగే తప్పుడు వీడియోలు ప్రసారం చేసినందుకు రెండు టీవీ చానళ్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రశాంతను దెబ్బతీయాలని బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు.