
ముంబై: గత కొద్ది రోజులుగా దేశ అర్థిక రాజధాని అందోళనలు, బంద్‌తో అట్టుడికిపోయింది. రెండేళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న మరాఠ ఉద్యమం మంగళవారం ఉప్పెనలా ఎగిసి పడింది. మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో విద్యా, ప్రభుత్వ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరాఠాలు ‘జల్ సమాధి’ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాకాసాహెబ్ షిండే(27) అనే యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. మరాఠా క్రాంతి మోర్చా బుధవారం ముంబై బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే.
బంద్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేశారు. మరికొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ఐదారుగురు ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. నేటి ముంబై బంద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో నవీ ముంబైతోపాటు పన్వేల్, థానేలో బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు మరాఠా నాయకులు ప్రకటించారు.
నిలిచిన రవాణా వ్యవస్థ
బంద్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. అందోళనకారులు రైలు పట్టాలపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే ఆందోళనాకారులు రోడ్లపై భైఠాయించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే శివాజీ చౌక్, ములంద్ చౌక్‌ల వద్ద బంద్ ప్రభావం ఎక్కవగా కనబడింది. పాత ముంబై- పుణె, ముంబై-గోవా రహదార్లపై రాస్తారోకాలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన బస్సుల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. రహదార్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. బంద్‌లో స్వచ్చందంగా పాల్గొనాల్సిందింగా ఆటో యూనియన్స్‌కు ఆందోళనకారులు ముందే హెచ్చరించడంతో రోడ్లపై ఆటోలు తిరగలేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాలు, ఆన్‌లైన్ క్యాబ్ ఏజన్సీలు ఇష్టానుసారంగా ధరలు పెంచేశాయి.
బంద్ విజయవంతం: మరాఠ మోర్చా నేత
ముంబై బంద్ విజయవంతంగా ముగిసిందని మరాఠ క్రాంతి మోర్చ నేత వీరేంద్ర పవార్ పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగుకుండా ముందస్తు జాగ్రత్తగా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో యువత స్వచ్చందంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టం చేశారు. బంద్‌లో అక్కడక్కడా జరిగిన అవాంఛనీయ ఘటనలకు కారణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిసేనని వీరేంద్ర పవార్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment