Marathas
-
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
Pankaja Munde: మీరు మోసపోలేరు.. సీఎంను కలుస్తా
ముంబై: రిజర్వేషన్లపై మరాఠాలు మోసపోయామని భావిస్తున్నారని కానీ, ప్రస్తుత తరం ప్రజలు మోసపోలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే వ్యాఖ్యానించారు. గురువారం తన తండ్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. ఉద్ధవ్‌ను త్వరలోనే కలుస్తానని, రిజర్వేషన్ల అంశంపై తన సలహాలు, సూచనలు సీఎంకు అందజేస్తానని పంకజ తెలిపారు. విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో మరాఠాలు మోసపోయామని అనుకుంటున్నారని, కానీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏ వర్గాల కోసం ప్రణాళిక రూపొందిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. ఓబీసీ, మరాఠా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కాగా, బీడ్ జిల్లా పార్లీ నుంచి 2019లో ఎదురైన ఓటమిపై ఆమెను ప్రశ్నించగా ఎన్నికల నష్టం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిలిచిపోదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికీ తన ఓటమి గురించి మాట్లాడుతారని కానీ, ఆ ఓటమి పూర్తి స్థాయిలో లేదన్నారు. ప్రజలకు తనపై ఇంకా ఆశలు ఉన్నాయని, గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం ఇస్తానని పంకజా తెలిపారు. కాగా, 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల వరకు రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకి రాలేదు. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. చదవండి: మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం జీరో కరోనా కేసులు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మరాఠీల ధన్యవాదాలు
సాక్షి ముంబై: మహారాష్ట్రకు వెంటిలేటర్లను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పలు సందేశాలు ముఖ్యంగా మరాఠీ సందేశాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉంది. కరోనా బాధితులకు ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్లు కూడా లభించడంలేదు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాయం కోరారు. కాగా, వెంటనే 300 వెంటిలేటర్లు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నితిన్ గడ్కరీ ఏపీ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన అనంతరం సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి గడ్డు పరిస్థితిలో సాయం చేసి మానవత్వాన్ని చాటిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో కన్పించాయి. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు) -
మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరాఠాలు సామాజికంగా, రాజకీయంగా ప్రభావశీల వర్గమని సీనియర్ న్యాయవాది ప్రదీప్ సంచేటి సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40% వరకు ఉంటారన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ‘వారు వెనుకబడిన వారు, వారికి అన్యాయం జరిగింది అనే వాదనలోనే తప్పు ఉంది’అన్నారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ప్రదీప్ సంచేటి వాదనలు వినిపించారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించే అంశాన్ని కూడా ఈ కేసు విచారణలో జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, ప్రభుత్వ సర్వీసుల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదని 2018లో ఎంజీ గైక్వాడ్ ఇచ్చిన నివేదికను కూడా న్యాయవాది సంచేటి తప్పుబట్టారు. అది రాజకీయ కారణాలతో కావాలనే రూపొందించిన నివేదికలా ఉందన్నారు. ‘ఒకవేళ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించినా.. అది రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు నిర్ధారించిన 50% పరిమితిలోపే ఉండాలి’అని స్పష్టం చేశారు. ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు.. 50% పరిమితిని మించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అసాధారణ పరిస్థితులేవీ లేవని వాదించారు. వివిధ వర్గాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చే విషయంలో గణనీయ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని మరో న్యాయవాది రాజీవ్ ధావన్ పేర్కొన్నారు. ఓటర్లకు రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు రాజ్యాంగబద్ధం కాదన్నారు. సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనేవి సామాజిక స్థితిగతుల్లో మార్పులుగా పరిగణించలేమన్నారు. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అందరికీ సమాన అవకాశాలు లభించే పరిస్థితిని కల్పించడమేనన్నారు. ఇదే విషయాన్ని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ చెప్పారన్నారు. పోరాడే సామర్ధ్యం అందరికీ ఒకేలా లభించేలా చూడాలని అమర్త్యసేన్ వివరించారన్నారు. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా, ఈ కేసు విషయంలో కేంద్రం స్పందన తెలియజేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ఆదేశించింది. వాదనల అనంతరం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్‌గుప్తా, జస్టిస్ రవీంద్రభట్‌లు కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆధార్ లింక్ లేదని 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు! ఇది చాలా తీవ్రమైన అంశం: సుప్రీం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులను రద్దు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సమాధానమివ్వాలని ఆదేశిస్తూ 4 వారాలు గడువు ఇచ్చింది. ఆధార్‌తో లింకప్ చేయలేదన్న కారణంతో 3 కోట్లకుపైగా రేషన్ కార్డులు రద్దు చేశారని, దీంతో నిత్యావసరాలు లభించక ఆకలి చావులు సంభవించాయని జార్ఖండ్‌కు చెందిన కొయిలి దేవి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతీ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ గోన్సాల్వెస్ తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఆధార్ కార్డు లేకపోయినంత మాత్రాన ఆహార హక్కుని వదులుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో విచారణ జరగాలని తొలుత సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ‘ఈ తరహా పిటిషన్లు నేను బొంబే హైకోర్టులో ఉండగా విచారణ జరిపాను. దీనిని ఆయా రాష్ట్రాల హైకోర్టులే చూడాలి’అని చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు. లింకేజీతోపాటు ఆహార భద్రత అంశాన్నీ చూడాలని లాయర్ గోన్సాల్వేస్ వాదించారు. దీంతో సుప్రీం బెంచ్ తానే ఈ పిటిషన్‌ను నాలుగు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తానని çస్పష్టం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పిటిషనర్ కొయిలిదేవి తన రేషన్ కార్డుని ఆధార్‌తో లింకప్ చేయకపోవడంతో రద్దయింది. నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో తినడానికి తిండి లేక 11 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె సరిత రెండేళ్ల క్రితం ఆకలి తట్టుకోలేక మరణించిందన్న వార్తలు వచ్చాయి. -
మరాఠాలకు రిజర్వేషన్లు అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా చాల బలమైన వర్గమైన మరాఠాలకు ఉపాధి, విద్యావసాకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించినంతరం అసెంబ్లీ హాలంతా ‘జై భవాని, జై శివాజీ’ నినాదాలతో మారుమోగిపోయింది. ఈ బిల్లు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మరాఠా నాయకులు ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నత్యాలు చేశారు. పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర జనాభాలో 32 శాతం జనాభా కలిగిన మరాఠాల్లో మెజారిటీ వర్గాన్ని తమవైపు తిప్పుకొని 2019లో జరుగనున్న సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మరాఠాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెల్సిందే. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితే మారి పోతుందన్నది నిస్సందేహం. కానీ బిల్లు ఇంతకు చట్టం రూపం దాలుస్తుందా? అన్నది ప్రధాన ప్రశ్న. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా ఇప్పటికే రాష్ట్రంలో వివధ వర్గాలకు, కులాలకు 52 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిపైనా 16 శాతం అదనంగా రిజర్వేషన్లు కల్పించడమన్నది మామూలు విషయం కాదు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లరని, చట్టం తీసుకరావచ్చని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భావిస్తున్నారు. ఈ బిల్లుకు రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ కూడా సుముఖంగా ఉందని రాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. ఇంతకాలం తమ పార్టీని సమర్థిస్తూ వచ్చిన మరాఠాలను దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు కనుక కాంగ్రెస్ పార్టీ బిల్లును సవాల్ చేయదని భావిస్తున్నారు. అది నిజమే. బిల్లుకు కాంగ్రెస్ సభ్యులు మద్దతివ్వడమే కాకుండా బిల్లు ఆమోదం అనంతరం మరాఠా నాయకులకు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. ఆజాద్ మైదాన్‌లో రిజర్వేషన్ల కోసం గత పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నేతల్లో మాత్రం ఇంకా ఆనందం కనిపించడం లేదు. వారి దీక్షను కూడా విరమించలేదు. తాము నమ్మే శివసేన నుంచి కబురు వచ్చాకే వారు నిరసన దీక్షను విరమించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంటే వారికి ఇంకా రిజర్వేషన్లు చట్టరూపం దాలుస్తాయన్న నమ్మకం లేదన్న మాట. మరాఠీలు గత మూడేళ్లుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 58 మౌన ప్రదర్శనలు జరిపారు. గత జూలై–ఆగస్టులో వారు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర మరాఠాల్లో చిన్నకారు, సన్నకారు రైతులే ఎక్కువ ఉండడం, కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభం వల్ల వారు కష్టాల పాలవడం తెల్సిందే. మహారాష్ట్రలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల్లో కూడా మరాఠాలే ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర మరాఠాల్లో మూడు శాతం మందే ధనవంతులని ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ ఓ నివేదిక వెల్లడించింది. మరాఠాల్లో 37 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారని, 93 శాతం మంది ఏడాదికి లక్ష రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలని, 77 శాతం మంది మరాఠాలు వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నారని, రైతుల్లో 62.7 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని బీసీ కమిషన్ జరిపిన ఓ సర్వేలే తేలింది. మరాఠాల్లో 60 నుంచి 65 శాతం మంది కచ్చా ఇళ్లలో నివసిస్తున్నారని, వారిలో 4.3 శాతం మందే అకాడమిక్ ఉద్యోగాలు చేస్తున్నారు. మరాఠాల్లో రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ ఉండడం వల్ల వారు తమ పిల్లలను ఎక్కువగా ఉన్నత చదువులను చదివించలేక పోయారు. చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు దొరక్కపోవడానికి రిజర్వేషన్లే కారణమని వారికి అర్థమైంది. అందుకని వారు మూడేళ్లుగా అవిశ్రాంతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఉద్యమం తీవ్రత కారణంగానే రిజర్వేషన్ల బిల్లు వచ్చింది. అది చట్టరూపం దాలుస్తుందా అన్నదే అనుమానం. ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయిన పలు రాష్ట్రాల్లో అదనపు రిజర్వేషన్ల హామీలు ఆచరణకు నోచుకోలేని విషయం తెల్సిందే. -
మరో రిజర్వేషన్ల పోరాటం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠాల తర్వాత మరో సామాజిక వర్గం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ధన్గర్ సామాజిక వర్గీయులు(గొర్రెల కాపరులు).. తమను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)ల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ధన్గర్ సంఘర్ష సమితి మహారాష్ట్ర రాజ్య (డీఎస్‌ఎస్‌ఎంఆర్) ఈ నిరసనలకు నేతృత్వం వహించింది. ముంబైతోపాటు విదర్భ, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రల్లో నిరసనలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డంగా మేకలు, గొర్రెలను తోలి వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ధన్గర్ ప్రజలు రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగారు. ప్రస్తుత బీజేపీ సీఎం ఫడ్నవిస్ అప్పట్లో ధన్గర్ సమాజం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై నివేదికను రూపొందిస్తున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ నెల 26లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలనీ, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
‘కోటా కోసం ఆత్మహత్యలు వద్దు’
సాక్షి, ముంబై : మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాంబే హైకోర్టు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ అంశం న్యాయస్ధానాల పరిధిలో ఉన్నందున సంయమనం పాటించాలని సూచించింది. మరాఠాలు కోటా కోరుతూ హింసకు దిగడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడటం కానీ చేయరాదని తాము కోరుతున్నామని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. బీసీ కమిషన్ మరాఠాలకు కోటాపై ఇప్పటివరకూ చేపట్టిన కసరత్తును వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన క్రమంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ ఏర్పాటు చేసిన ఐదు ఏజెన్సీలు క్రోడీకరించిన సమాచారం, అథ్యయనాలను కమిషన్ నియమించిన నిపుణుల కమిటీ క్రోడీకరిస్తోందని సెప్టెంబర్ 5లోగా కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది రవి కదం, ప్రభుత్వ న్యాయవాది అభినందన్ వాగ్యాని కోర్టుకు తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ నవంబర్ మాసాంతానికి తన తుది నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని చెప్పారు. కమిషన్ తన కసరత్తును త్వరితగతిన చేపట్టేలా చూడాలని బెంచ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
ఆగని మరాఠాల ఆందోళన
ముంబై: మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠ్వాడా ప్రాంతంలో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో 8మంది ఆత్మహత్యకు యత్నించారు. తాజా ఘటనతో ఈ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బీడ్ జిల్లా వీడా గ్రామానికి చెందిన అభిజీత్ దేశ్‌ముఖ్(35) తన ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. లాతూర్ జిల్లా ఔసాలో 8మంది కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. -
మరాఠా ఆందోళనలో మళ్లీ హింస
సాక్షి, ముంబై/పుణె/ఔరంగాబాద్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని పుణెలో మరాఠాలు సోమవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల కోసం నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇద్దరు మరాఠాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పుణెలోని చకన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 40 బస్సులకు నిప్పంటించారు. మరో 50 బస్సులతో పాటు పలు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా అల్లరిమూకలు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆందోళనలు షోలాపూర్, ముంబైకి కూడా విస్తరించాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. ఫడ్నవిస్ క్షమాపణ కోరుతూ.. రాష్ట్రంలో కొందరు మరాఠాలు హింసకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ చెప్పాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా అనే సంస్థ పుణె బంద్‌కు పిలుపునిచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి దిగారన్నారు. దీంతో పలువురు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారనీ, కొందరైతే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దాక్కున్నారని వెల్లడించారు. నగరంలో అల్లర్లను అణచేసేందుకు ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ కోరుతూ వారం రోజుల క్రితం ఇదే సంస్థ పుణెలో ఆందోళన నిర్వహించిందన్నారు. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ మరాఠాల ఆందోళన హింసాత్మక రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ నేతృత్వంలో గవర్నర్‌ను కలసిన నేతలు.. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి ప్రాణత్యాగం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మరాఠా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. కానీ రాష్ట్రంలో కొన్నిచోట్ల అవి హింసాత్మక రూపం దాల్చడంతో ఆందోళనల్ని విరమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఔరంగాబాద్ వాసి ప్రమోద్ జైసింగ్(35).. ఆదివారం రాత్రి ముకుంద్వాడీ ప్రాంతంలో ఓ రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా స్నేహితులకు తెలియజేశాడు. మరోవైపు నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘రిజర్వేషన్లు కల్పించే వరకు పన్నులు చెల్లించం’
ముంబై : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న మరాఠా నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పన్నులు చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్ల కోసం మరాఠా నేతలు గతకొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం వివిధ మరాఠా సంఘాలకు చెందిన నేతలు లాథూర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కార్యలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్లపై ప్రకటన చేసే వరకు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని నేతలు భావిస్తున్నారు. మరాఠి నేత సంజీవ్ బోర్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న మరాఠా క్రాంతి జన్ ఆందోళన్ పేరిట రహదారులపై నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. మరాఠాలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని కోరారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గతవారం చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మరాఠా నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారని.. వాటిని తక్షణమే ఎత్తివేయాలని మరో నేత శాంతారామ్ కుంజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కావాలంటూ అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న మరాఠాలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారు నిజంగా సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నామని భావిస్తున్నారా? వారు ఉద్యమ బాట పట్టడానికి మరేమైన కారణాలు ఉన్నాయా? మహారాష్ట్రలో మంగళవారం, బుధవారాల్లో మరాఠాలు నిర్వహించిన ఆందోళన విధ్వంసకాండకు దారి తీసిన విషయం తెల్సిందే. మహారాష్ట్రలో మరాఠాలు 33 శాతం మంది ఉన్నారు. వారికీ రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రధానంగా రెండు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం మించరాదంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు నిర్దేశించిన దానికన్నా ఇప్పటికే రెండు శాతం ఎక్కువ అంటే, 52 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రెండోది సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకే రిజర్వేషన్లు కల్పించాలి. మరాఠాలు వెనకబడిన వర్గాల కేటగిరీ కిందకు రారని, వారు ఫార్వర్డ్ కులమని మండల కమిషన్ ఎప్పుడో స్పష్టం చేసింది. రాజకీయంగా కూడా ఎంతో ఎదిగిన మరాఠా కులాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చలేమని జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ 2003లో స్పష్టం చేసింది. ఆ తర్వాత 2008లో మహారాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ తన 22వ నివేదికలో కూడా మరాఠాలను ఓబీసీ కేటగిరీలో చేర్చలేమంటూ చేతులెత్తేసింది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ సరాఫ్ నాయకత్వాన ఓ కమిషన్ వేసింది. ఆ కమిషన్ మనుగడలో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం నారాయణ రాణె నాయకత్వాన మరో కమిషన్ వేసింది. 2014లో రాష్ట్ర ఎన్నికలకు కొంత కాలం ముందు నారాయణ రాణె కమిషన్ మరాఠాలకు రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఆదరాబాదరా సమావేశమై మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసింది. దాన్ని నిలిపివేస్తు అదే సంవత్సరం నవంబర్ నెలలో బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ-శివసేన ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టమే తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా బాంబే హైకోర్టు అడ్డుకుంది. మరాఠాలు రిజర్వేషన్లకు అర్హులు కారని అన్ని కమిషన్లు, కోర్టులు ఎందుకు తేల్చాయి? 1960లో మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రానికి సీఎం పదవిని 18 మంది నిర్వహించగా, వారిలో పది మంది మరాఠాలే. 1962 నుంచి 2004 మధ్య 2,430 మంది శాసన సభ్యులు ఎన్నిక కాగా వారిలో సగానికన్నా ఎక్కువ అంటే 1,366 మంది మరాఠాలే ఎన్నికయ్యారు. జిల్లా సహకార బ్యాంకుల్లో, విద్యా సంస్థల్లో, వైద్య, ఇంజనీరింగ్ యూనివర్శిటీల్లో వారిదే పైచేయి. వారికే ఎక్కువ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పాల సహకార సంఘాలపై వారిదే ఆధిపత్యం. అన్నింటికంటే వారి చేతుల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా గ్రామీణ సామ్రాజ్యం వారిదే. అందుకే ప్రధానంగా వారి వృత్తి వ్యవసాయం అయింది. ఈ కారణాల వల్లనే వివిధ కమిషన్లు వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ రాగా, ఓట్ల రాజకీయాల కోసం నాడు దిగిపోతున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, నేటి బీజేపీ-శివసేన ప్రభుత్వాలు రిజర్వేషన్లను అనుమతించాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా మరాఠా యువకులు వ్యవసాయ రంగానికి దూరం అవుతూ వచ్చారు. వారికి చదువుకునే స్థోమత ఎక్కువగా ఉన్నా చదువులో పెద్దగా రాణించలేక పోయారు. సామాజికంగా వెనకబడిన వర్గాల వారు ముందుకు దూసుకెళుతుంటే తాము విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడి పోయామన్న భావం యువతలో పేరుకుపోయింది. అసహనం పెరిగిపోయింది. కేవలం రిజర్వేషన్ల కారణంగానే బీసీలు, ఓబీసీలు, దళితులు ముందుకు తీసుకుపోతున్నారన్న అక్కసు వారిలో పుట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది నగర్లో 2016, సెప్టెంబర్ 20వ తేదీన 11 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక అత్యాచారం జరిపి దారుణంగా చంపేశారు. దోషులు దళితులు కావడంతో మరాఠాలు నాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నేరస్థులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సకాలంలోనే పోలీసులు దళితులను అరెస్ట్ చేయగా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆ కేసును త్వరితగతిన విచారించి ఏడాదిలోగానే ముగ్గురు దోషులను మరణ శిక్ష విధించింది. అయినా మరాఠాల కోపం చల్లరలేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేశారు. తమకు రిజర్వేషన్లు కావాలనే డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకొచ్చారు. -
మరాఠా బంద్ అసంపూర్ణం
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరు తూ ముంబైలో మరాఠాలు బుధవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పలు సంస్థలు ముంబై బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మధ్యాహ్నానికే బంద్‌ను విరమిస్తున్నట్లు చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. -
మరాఠాల బంద్ హింసాత్మకం
ముంబై: గత కొద్ది రోజులుగా దేశ అర్థిక రాజధాని అందోళనలు, బంద్‌తో అట్టుడికిపోయింది. రెండేళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న మరాఠ ఉద్యమం మంగళవారం ఉప్పెనలా ఎగిసి పడింది. మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో విద్యా, ప్రభుత్వ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరాఠాలు ‘జల్ సమాధి’ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాకాసాహెబ్ షిండే(27) అనే యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. మరాఠా క్రాంతి మోర్చా బుధవారం ముంబై బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే. బంద్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేశారు. మరికొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ఐదారుగురు ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. నేటి ముంబై బంద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో నవీ ముంబైతోపాటు పన్వేల్, థానేలో బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు మరాఠా నాయకులు ప్రకటించారు. నిలిచిన రవాణా వ్యవస్థ బంద్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. అందోళనకారులు రైలు పట్టాలపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే ఆందోళనాకారులు రోడ్లపై భైఠాయించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే శివాజీ చౌక్, ములంద్ చౌక్ల వద్ద బంద్ ప్రభావం ఎక్కవగా కనబడింది. పాత ముంబై- పుణె, ముంబై-గోవా రహదార్లపై రాస్తారోకాలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన బస్సుల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. రహదార్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. బంద్‌లో స్వచ్చందంగా పాల్గొనాల్సిందింగా ఆటో యూనియన్స్‌కు ఆందోళనకారులు ముందే హెచ్చరించడంతో రోడ్లపై ఆటోలు తిరగలేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాలు, ఆన్లైన్ క్యాబ్ ఏజన్సీలు ఇష్టానుసారంగా ధరలు పెంచేశాయి. బంద్ విజయవంతం: మరాఠ మోర్చా నేత ముంబై బంద్ విజయవంతంగా ముగిసిందని మరాఠ క్రాంతి మోర్చ నేత వీరేంద్ర పవార్ పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగుకుండా ముందస్తు జాగ్రత్తగా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో యువత స్వచ్చందంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టం చేశారు. బంద్‌లో అక్కడక్కడా జరిగిన అవాంఛనీయ ఘటనలకు కారణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిసేనని వీరేంద్ర పవార్ స్పష్టంచేశారు. -
మరాఠాల ఆందోళనల్లో హింస
ఔరంగాబాద్: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠాలు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఆత్మహత్య చేసుకున్న మరాఠా యువకుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన శివసేన ఎంపీపై కొందరు దాడి చేయటంతోపాటు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతోపాటు ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుపడ్డ పోలీసులతో ఆందోళన కారులు తలపడ్డారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లపై బైఠాయించారు. శివసేన ఎంపీపై దాడి మరాఠాలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సోమవారం మరాఠా క్రాంతి మోర్చా ‘జల్ సమాధి’ కార్యక్రమం చేపట్టింది. ఔరంగాబాద్‌లో చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాకాసాహెబ్ షిండే(27) అనే యువకుడు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేగావ్ గ్రామానికి వెళ్లిన లోక్‌సభ సభ్యుడు చంద్రకాంత్ ఖైరేకు చేదు అనుభవం ఎదురైంది. కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేయటంతో ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డొ చ్చిన పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ మోహరించిన అగ్ని మాపక శకటానికి కూడా నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంతో ఆందోళనకారులను చెదరగొట్టారు. జగన్నాత్ సొనావనే(31), గుడ్డు సొనావనే అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. జల్నా జిల్లా ఘన్ సాంగ్వి పోలీస్‌స్టేషన్‌పై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. లాతూర్ జిల్లాలోని నీలాంగా ప్రాంతంలో హైదరాబాద్–లాతూర్ బస్సుపై కూడా రాళ్లు రువ్వారు. వదంతులు వ్యాపించకుండా ఔరంగాబాద్ జిల్లా అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఔరంగాబాద్–అహ్మదాబాద్ హైవే పై ఆందోళనకారులు పోలీసు వ్యాన్, బస్సు సహా డజను వాహనాలను ధ్వంసం చేశారు. షిండే కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా తీర్మానించింది. నేడు ముంబై బంద్ ‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణలు చెప్పేదాకా ఆందోళనలు కొనసాగిస్తాం. ముంబై, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం బంద్ పాటిస్తాం’ అని మరాఠా మోర్చా నేత రవీంద్ర పాటిల్ తెలిపారు. నవీ ముంబైతోపాటు పన్వేల్‌లో బుధవారం బంద్ పాటించాలని ‘సకల్ మరాఠా సమాజ్’ కూడా పిలుపునిచ్చింది. కాగా, రాష్ట్ర జనాభాలో 33 శాతం వరకు ఉన్న మరాఠాలు రాజకీయంగా కీలకంగా ఉన్నారు. రిజర్వేషన్లు కావాలంటూ మరాఠా సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి. -
ఈ ఘర్షణలు మొట్టమొదటిసారి..
సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఆందోళనతో మహారాష్ట్ర దద్దరిల్లడానికి దారితీసిన ‘బీమా కోరేగావ్’ యుద్ధం స్మారక దినోత్సవానికి 200 ఏళ్లు. అగ్రవర్ణమైన పెషావర్లకు, మహర్లతో (దళితులు) కూడిన బ్రిటిష్ సైన్యానికి మధ్యన 1818లో యుద్ధం జరిగింది. స్మారక స్థూపాన్ని మాత్రం కోరేగావ్‌లో 1851లో నిర్మించారు. దళితుల నాయకుడు డాక్టర్ అంబేడ్కర్ 1927లో ఆ స్మారక స్థూపాన్ని సందర్శించి కోరేగావ్ రెజిమెంట్ సైన్యం సేవల గురించి గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. దాంతో 1927 నుంచే అధికారికంగా స్మారకోత్సవం ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన దేశం నలుమూలల నుంచి దళితులు అక్కడికెళ్లి స్మారకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఆరేడు ఏళ్లుగా స్మారక స్థూపం వద్ద సందర్శకుల సందడి పెరగ్గా, ఈ రెండేళ్ల కాలంలో మరింత పెరిగింది. మరాఠాలు, దళితుల మధ్య సామరస్యపూర్వకంగానే ఎప్పుడూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ వస్తోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవు. సందర్శకుల కోసం మరాఠీలే ఉచితంగా తాగునీటి స్టాళ్లను ఏర్పాటు చేసి ఆహారాన్ని కూడా ఉచితంగానే అందించే వారు. తమ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సిందిగా, ఇంట్లో భోజనం చేయాల్సిందిగా దళిత పర్యాటకులను మరాఠాలు ఇళ్లలోకి ఆహ్వానించేవారు. గ్రామంలోని గణేశ్ ధీరేంజ్ లాంటి ప్రముఖ మరాఠా కుటుంబీకులు దూరం నుంచే స్థూపాన్ని స్మరించేవారు ఈ సారే మొట్టమొదటిసారిగా సామరస్య కార్యక్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తలు జరుగుతాయని ముందే ఊహించినట్లున్నారు స్థానిక భీమా పంచాయతీ సర్పంచ్ పర్యాటకులకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎస్సీ మహిళ ఈసారి సర్పంచ్‌గా గెలిచారు. -
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రేపు రాష్ట్ర బంద్!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హింస వాతావరణం నెలకొంది. దళితులు, మరాఠాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలో ఒకరు మృతిచెందగా, పలువరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ముంబై, పుణె, ఔరంగాబాద్‌లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వారి ఆగ్రహజ్వాలలకు పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రజలు ఆందోళనలు మిరమించి, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. ఈ హింసాత్మక ఘటన వెనుక ఉన్నదేవరో తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దళిత సంఘాలు రేపు మహారాష్ట్రలో బందుకు పిలుపునిచ్చాయి. -
ఇక మరాఠాల వంతు..!
సాక్షి, ముంబై : గుజరాత్లో పటేదార్ల రిజర్వేషన్ ఉద్యమంతో స్ఫూర్తిపొందిన మరాఠాలు.. మహారాష్ట్రలో మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. మరాఠా యోధుడు శివాజీ జన్మదినమైన పిబ్రవరి 19 నుంచి రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు మరాఠాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్లో పటేదార్లు ఉద్యమం, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో మహారాష్ట్ర శాసనసభ, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పటేదార్ల తరహా ఉద్యమాన్ని నిర్మించేందుకు మరాఠాలు సిద్ధమవుతున్నారు. ఉద్యమ నిర్మాణం గురించి మరాఠా నేతలు.. మంగళవారం సమావేశమయ్యారు. మరోదశ ఉద్యమాన్ని శివాజీ చక్రవర్తి జన్మదినం నాడు మొదలు పెట్టి.. 2019లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు 2019లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యమ నేతలు తెలిపారు. మరాఠాలు కోరికేంటి? విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ.. మరాఠాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమానికి కారణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో.. వారికే విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. రిజర్వేషన్ల ఆసరాతో ఆయా వర్గాలు వేగంగా పురోగమిస్తున్నాయి. అదే రీతిలో మరాఠాలు తిరోగమిస్తున్నారు. బీజేపీ 2014 ఎన్నికల తరువాత బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర పఢ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో.. మరాఠాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫలితాలను మార్చే మరాఠాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను, పార్టీల తలరాతలను మరాఠాలు మార్చగలరు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మరాఠాలు ఫలితాలను తారుమారు చేయగలరు. మొత్తం మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33 శాతం వరకూ ఉన్నారు. చెక్కెర కర్మాగారాలు, విద్యాసంస్థలు, కో-ఆపరేటిక్ సెక్టార్లలో మరాఠాలది తిరుగులేని ఆధిపత్యం. -
ఉద్యమ వరద
స్వాతీ నఖేత్ 18 జూలై 2016. అపోజిషన్ అరుపులు, కేకలతో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిధ్వనిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ పాటిల్, పృథ్వీరాజ్ చవాన్ సభలో చర్చకు పట్టుపట్టారు. మరో ప్రతిపక్ష నేత (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అజిత్ పవార్.. ‘‘ఇది నిర్భయ ఘటన కంటే కూడా హేయమైన నేరం’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి అంతా కలసి... ఫడ్నవీస్ నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ వర్షాకాల సమావేశాలలో వాళ్లను అంతగా తరుముకొచ్చిన ఉద్యమ వరద... స్వాతీ నఖేత్ పాటిల్! - మాధవ్ శింగరాజు కోటు దర్పాన్ని ఇస్తుంది. చిరుగుల్నీ దాస్తుంది. అగ్రవర్ణాలకు కులం ఒక కోటు. ఉన్నవాళ్లు ఉన్నదర్పాన్ని కనబరిస్తే, లేనివాళ్లు లేనిదర్పాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ ఇలాగే నడిచింది, గడిచింది. ఇప్పుడు అలా లేదు. కోటులో గుద్దులాటలు అనవసరం అనుకుంటున్నారు. ‘మాకూ రిజర్వేషన్లు కావాలి. మాకూ రక్షణ కావాలి’ అని ఉద్యమిస్తున్నారు. వాళ్లు డిమాండ్ చేస్తున్నది ఉద్యోగాలలో రిజర్వేషన్. వాళ్లు అడుగుతున్నది కొన్ని ‘రక్షణ చట్టాల’ నుంచి రక్షణ! అందుకే ఉద్యమానికి ఆసరాగా చిన్న కొమ్మ దొరికినా దాన్ని పట్టుకుంటున్నారు. ఉద్యమ ఆవేశాన్ని రగిల్చే చిన్న నాయకత్వం దొరికినా అనుసరిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ర్టలో ‘మరాఠా’లు చేస్తున్నది అదే. మొన్నటి వరకు గుజరాత్లో ‘పటేల్ ’లు చేసిందీ అదే. అక్కడి నాయకుడు హార్దిక్ పటేల్. ఇక్కడి నాయకురాలు స్వాతీ నఖేత్. ఇద్దరూ పాతికేళ్ల లోపు వారు. ఇద్దరూ రూలింగ్ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నవారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం హార్దిక్ పటేల్‌ని విజయవంతంగా అణచివేసింది. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీనే కానీ, స్వాతీ నఖేత్‌ని ఏమీ చేయలేకపోతోంది. అక్కడ ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంది. అంతకన్నా స్ట్రాంగ్ స్వాతీ నఖేత్! అందుకే మహారాష్ట్రలో రెండు పెద్ద అపోజిషన్ పార్టీలు ఇప్పుడు స్వాతి వెనుక నడుస్తున్నాయి. అమ్మాయి కాదు... ఆదిపరాశక్తి! గుజరాత్లో పటేళ్లు 24 శాతం. మహారాష్ట్రలో మరాఠాలు 32 శాతం. వీళ్లని కాదని గేమ్స్ ఆడితే బ్యాలెట్ బద్దలౌతుంది. ఆ సంగతి అక్కడి ప్రభుత్వాలకు తెలుసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి ఇంకాస్త ఎక్కువ తెలుసు. ‘ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అన్నాడు. ‘అమ్మాయి కాదు, ఆదిపరాశక్తి’ అన్నారు ఎవరో. ‘అయితే మనమూ ఆ శక్తిని ఫాలో అయిపోదాం’ అన్నారు ఫడ్నవీస్! రూలింగ్ పార్టీ ఎప్పుడూ ఫాలో అవదు. ఫాలో అయినట్లు కనిపిస్తుందంతే. ఫడ్నవిస్ వ్యూహం వేరు. మరాఠా ఉద్యమాన్ని ‘ఓన్’ చేసుకుని, స్వాతీ నఖేత్‌ని ఉద్యమానికి ‘డిసోన్’ చేయాలని అతడి ఆలోచన. ప్రతిపక్షాల ఆలోచన వేరు. స్వాతి గానీ, మరాఠాలు గానీ వాళ్ల సమస్య కాదు. ఫడ్నవీస్‌కు క్రెడిట్ గానీ, మరోసారి పవర్‌గానీ దక్కకూడదు! ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి. అందుకే అంతా స్వాతి చెంత చేరారు. స్వాతి అజెండాకు తమ జెండాలను కలిపి కుట్టేశారు. మరాఠాల ‘స్వాభిమాన’ నాయిక మరాఠా రిజర్వేషన్ పాత ఇష్యూ. స్వాతి వచ్చాక మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్.సి.పి. ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు చదువుల్లో, కొలువుల్లో, అసెంబ్లీ హాల్లో 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాణె కమిటీ రికమండ్ చేసింది. అన్ని పార్టీలూ చచ్చినట్టు మద్దతు ఇచ్చాయి. కానీ కోర్టులో కమిటీ సిఫారసులు తేలిపోయాయి. కాంగ్రెస్, ఎన్.సి.పి. బి.జె.పి.. మూడు గవర్నమెంట్లు మారాయి. రిజర్వేషన్ల తుట్టె అలా ఉండిపోయింది. దాన్నిప్పుడు స్వాతి కదిలించారు. ముందు చిన్న చిన్న ర్యాలీలతో మెల్లిగా పొగబెట్టారు. తర్వాత.. ఇటీవలి ఒక రేప్ కేసును దుప్పటిగా కప్పుకుని తుట్టె వైపు కదిలారు. అలాగని రేప్ కేసు ముసుగులో స్వాతి చేస్తున్న రిజర్వేషన్ ఉద్యమం కాదు ఇది. తనకొక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని ఈ మరాఠా యువతి మరాఠాల కోసం తిప్పుతున్నారు. యూత్ కదా! వాట్స్‌యాప్, సోషల్ మీడియా గ్రూప్ ఆయుధాలు ఎలాగూ ఉంటాయి. మొత్తం మూడు ఆయుధాలతో స్వాతీ నఖేత్ మరాఠాలను ఇప్పుడు సంఘటితం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మునివేళ్లపై పరుగులెత్తిస్తున్నారు. పవార్‌కీ లేనంత ఫాలోయింగ్! రిజర్వేషన్లు ఒక్కటే మరాఠాల సమస్య కాదు. దళిత చట్టాల నుంచి వాళ్లకు రక్షణ కావాలి! వాళ్లపై వీళ్లు కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లినప్పుడు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దళితులు రివర్స్ కేసులు వేస్తున్నారని వీరి ఆరోపణ. దళిత సంరక్షణ చట్టంలో సవరణలు చేయాలని వీళ్ల డిమాండ్. అదీ జరగడం లేదు. పెపైచ్చు రాజకీయ నాయకులు దళితుల్ని బుజ్జగించడానికి నానా పాట్లూ పడడం మరాఠాలకు నచ్చడం లేదు. శరద్ పవార్ అంతటి నాయకుడు కూడా దళితుల ముందు కుప్పిగంతులు వేయడం వారికి నచ్చలేదు. పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరాఠాల అభీష్టానికి వ్యతిరేకంగా మరాఠ్వాడా యూనివర్శిటీ పేరును డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీగా మార్చారు. అది మరాఠాలకు ఆగ్రహం తెప్పించింది. తర్వాతి ఎన్నికల్లో అంతకంతా తీర్చుకున్నారు మరాఠ్వాడా ప్రాంత ఓటర్లు. పవార్ పార్టీని కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఒక విషయం వాళ్లకు స్పష్టం అయింది. ఈ రాజకీయ నాయకులంతా ఒకటేనని. స్వాతీ నఖేత్ రాజకీయాల నుంచి రాలేదు. రాజకీయాల కోసం రాలేదు. అందుకే మహారాష్ట్రలోని మూడు ప్రధాన మరాఠా ప్రాంతాలు... పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట, మరాఠ్వాడా.. స్వాతి వెంట నడుస్తున్నాయి. ఉద్యమానికి ముందువైపు స్వాతి ఉంది కాబట్టే గుజరాత్లో పటేళ్ల ఉద్యమంలా, హర్యానాలో జాట్ల ఉద్యమంలా మరాఠా ఉద్యమం రక్తసిక్తం కాలేదు. పద్ధతిగా కదం తొక్కుతోంది. అవును. స్వాతీ నఖేత్ పద్ధతైన అమ్మాయి. ‘లా’ చదువుకుంది. మరాఠాల మనోభావాలను లోతుగా అధ్యయనం చేసింది. అంతే లోతుగా మహారాష్ట్ర రాజకీయ నాయకుల్ని! విమర్శలకు జడవని వ్యక్తిత్వం మరాఠా బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని అడ్డుపెట్టుకుని మరాఠా ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారనే ఆరోపణను ప్రస్తుతం స్వాతీ నఖేత్ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమం కారణంగా మరాఠాలు, దళితుల మధ్య తలెత్తబోయే విభేదాలకు, వాటి పర్యవసానాలకు కూడా నఖేత్ బాధ్యత వహించాలని ప్రత్యర్థులు ఆమెను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ స్వాతీ నఖేత్ జడవడం లేదు. ‘‘దళితుల అభివృద్ధి జరగందే మహారాష్ట్ర అభివృద్ధి జరగదు. ఒక్క దళితులు అనే కాదు... వంజరులు, ముస్లింలు, మరాఠాలు అందరూ పురోగమిస్తేనే రాష్ట్ర పురోగతి. సరైన రోడ్లు లేక, విద్యుత్ సౌకర్యం లేక అందరం ఇక్కట్లు పడుతున్నవాళ్లమే. మేము దళితులతో కలిసి ఉంటామనే అంటున్నాం. అయితే మమ్మల్ని కలవనివ్వకుండా, మాలో మాకు విభేదాలు సృష్టించడానికి రాజకీయనాయకులు కుల రాజకీయాలను రాజేస్తున్నారు’’అని నఖేత్ ఆరోపిస్తున్నారు. బెస్ట్ లాయర్... ది బెస్ట్ లీడర్ మరాఠా క్రాంతి మోర్చా! పెద్ద పార్టీ కాదు. పొలిటి కల్ పార్టీ కాదు. కానీ ఇప్పుడది మహారాష్ట్రలోని పెద్దపార్టీలను, పొలిటికల్ పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. స్వాతి నఖేత్.. మోర్చా నాయకురాలు! ముంబై హైకోర్టు (ఔరంగాబాద్ బెంచ్) న్యాయవాది. బెస్ట్ క్రిమినల్ లాయర్ అవాలని స్వాతి కల. మరాఠీ మ్యూజిక్ అంటే ఇష్టం. గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆమె అభిరుచులు. జిజియా మాత హైస్కూల్లో చదువుకున్నారు. మాణిక్‌చంద్ పహాడే లా కాలేజ్‌లో పట్టభద్రురాలయ్యారు. ఎం.పి. లా కాలేజ్, డాక్టర్ బాము కాలేజీలలో న్యాయవాద విద్యలో అప్‌గ్రేడ్ అయ్యారు. తను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని మరాఠాలు అడుగుతున్న సామాజిక న్యాయం కోసం ఒక అస్త్రంలా ఉపయోగిస్తున్నారు స్వాతీ నఖేత్. స్వాతి చేతుల్లోకి వచ్చేసింది క్రాంతి మోర్చా ప్రధానంగా ఇప్పుడు నాలుగు అంశాలపై ఉద్యమిస్తోంది. ఒకటి: మరాఠాలకు రిజర్వేషన్లు. రెండు: అఘాయిత్యాలనుంచి ఎస్సీ, ఎస్టీలకు రక్షణకల్పించే చట్టం దుర్వినియోగం కాకుండా ఆ చట్టానికి సవరణలు చేయడం. మూడు: అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ స్మారక చిహ్నాన్ని స్థాపించడం. నాలుగు: తమ మరాఠాల అమ్మాయిపై పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన దళిత నేరస్థులకు ఉరిశిక్ష విధించడం. ఇప్పుడీ ఉమ్మడి అంశాల ఉద్యమం స్వాతీ నఖేత్ చేతుల్లోకి వచ్చేసింది. రేప్ ఘటన ఆ ఉద్యమానికి ఇప్పుడు ప్రధాన చోదకశక్తి అయింది. 13 జూలై 2016 మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకంపనలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా డిమాండ్‌కు దారితీసిన ‘ఆ’ హేయమైన ఘటన జరిగిన రోజు! అహ్మద్‌నగర్ జిల్లా కొపర్డి గ్రామంలో పదిహేనేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి, అతి కిరాతకంగా చంపేశారు! పోపుగింజల కోసం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న అమ్మమ్మగారింటికి సైకిలుపై వెళ్లింది ఆ బాలిక. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చూసి రమ్మని తల్లి కొడుకును పంపింది. చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లాడా అబ్బాయి. చెల్లెలు కనిపించలేదు. చెల్లెలి సైకిల్ కనిపించింది. సైకిల్ నిలబెట్టి లేదు. పక్కకు పడి ఉంది! అతడి మనసు కీడును శంకించింది. ఆ చుట్టుపక్కలే వెతికాడు. ఓ ఫామ్‌హౌస్ దగ్గరలో చెల్లెలి మృతదేహం కనిపించింది. నగ్నంగా! ఆమె ఒంటినిండా దెబ్బలు. ప్రతిఘటించడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. -
మధ్యతరగతికి సొంత ఇల్లు
ముంబై: రాష్ట్రంలోని నగరాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మంత్రాలయ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముంబై సహా ఇతర మహా నగరాల్లో నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. త్వరలోనే దీనికోసం కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో మహారాష్ట్రను ‘ఆన్లైన్’ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చవాన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తమకు కావాల్సిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చునన్నారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పారదర్శక, స్ఫూర్తిదాయక పాలన అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు సైతం ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ ప్రభుత్వం మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల వల్ల మైనారిటీ వర్గాలైన ముస్లింలు, మరాఠాలు ఉద్యోగ,విద్యా రంగాల్లో తగిన అవకాశాలు పొందగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకం ద్వారా లబ్ధిదారులు పైసా ఖర్చు లేకుండానే తగిన వైద్య సేవలు పొందగలుగుతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.62 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం వీరి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.712 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఇదిలా ఉండగా, నాగపూర్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి నితిన్ రావుత్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధాని అయిన నాగపూర్‌ను దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆలోచనలకు రూపంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు డీఎఫ్ సర్కార్ కృషిచేస్తోందని అన్నారు. నగరానికి పశ్చిమంలో 1800 ఎకరాల్లో గోరెవాడా జూను అభివృద్ధిచేసేందుకు కార్యాచరణ రూపొంది స్తున్నామన్నారు. పుణ్యక్షేత్రమైన సుఫీ సెయింట్ బాబా తాజుద్దీన్ సమాధి వద్ద రూ.132.49 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే ఆహార భద్రత చట్టం కింద సుమారు 7.17 కోట్ల మందికి ఆహార దినుసులను అందజేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.900 కోట్లు ఖర్చుపెడుతోందని రావుత్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కృష్ణ, పోలీస్ కమిషనర్ కె.కె.పాఠక్, డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గడ్చిరోలీ జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ‘మాఝీ ముంబై- నిర్మల్ ముంబై’ డ్రైవ్ ప్రారంభం ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ‘మాఝీ ముంబై-నిర్మల్ ముంబై’ అనే కార్యక్రమాన్ని ధారవిలో ప్రారంభించారు. నగరంలో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో చెత్త సమస్య చాలా ఎక్కువగా ఉంద న్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు చవాన్ వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. -
మోసకారి సర్కార్
ముంబై: రిజర్వేషన్లపై మరాఠా ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విపక్ష నేత వినోద్ తావ్డే ఆరోపించారు. విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాలంటే తమనూ ఓబీసీలో చేర్చాలని కొంతకాలంగా మరాఠాలు డిమాండ్ చేస్తుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నారాయణ్ రాణే నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్ష నేత వినోద్ తావ్డే శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరాఠాల రిజర్వేషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లనేవి ఉద్యోగాలు, చదువులకు మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ రిజర్వేషన్లను రూపుమాపాలన్నారు. మరాఠాల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రిజర్వేషన్లపై వారి అభిప్రాయమేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తుంటే వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఈ విషయమై తావ్డే పార్టీ సీనియర్ నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను కలిశారు. మరాఠాల విషయంలో నిజాయతీగా వ్యవహరించి, నిర్ణయం తీసుకోవాలని కోరారు.