సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా చాల బలమైన వర్గమైన మరాఠాలకు ఉపాధి, విద్యావసాకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించినంతరం అసెంబ్లీ హాలంతా ‘జై భవాని, జై శివాజీ’ నినాదాలతో మారుమోగిపోయింది. ఈ బిల్లు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మరాఠా నాయకులు ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నత్యాలు చేశారు. పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర జనాభాలో 32 శాతం జనాభా కలిగిన మరాఠాల్లో మెజారిటీ వర్గాన్ని తమవైపు తిప్పుకొని 2019లో జరుగనున్న సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మరాఠాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెల్సిందే.
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితే మారి పోతుందన్నది నిస్సందేహం. కానీ బిల్లు ఇంతకు చట్టం రూపం దాలుస్తుందా? అన్నది ప్రధాన ప్రశ్న. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా ఇప్పటికే రాష్ట్రంలో వివధ వర్గాలకు, కులాలకు 52 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిపైనా 16 శాతం అదనంగా రిజర్వేషన్లు కల్పించడమన్నది మామూలు విషయం కాదు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లరని, చట్టం తీసుకరావచ్చని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భావిస్తున్నారు. ఈ బిల్లుకు రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ కూడా సుముఖంగా ఉందని రాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. ఇంతకాలం తమ పార్టీని సమర్థిస్తూ వచ్చిన మరాఠాలను దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు కనుక కాంగ్రెస్ పార్టీ బిల్లును సవాల్ చేయదని భావిస్తున్నారు. అది నిజమే. బిల్లుకు కాంగ్రెస్ సభ్యులు మద్దతివ్వడమే కాకుండా బిల్లు ఆమోదం అనంతరం మరాఠా నాయకులకు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.
ఆజాద్ మైదాన్‌లో రిజర్వేషన్ల కోసం గత పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నేతల్లో మాత్రం ఇంకా ఆనందం కనిపించడం లేదు. వారి దీక్షను కూడా విరమించలేదు. తాము నమ్మే శివసేన నుంచి కబురు వచ్చాకే వారు నిరసన దీక్షను విరమించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంటే వారికి ఇంకా రిజర్వేషన్లు చట్టరూపం దాలుస్తాయన్న నమ్మకం లేదన్న మాట. మరాఠీలు గత మూడేళ్లుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 58 మౌన ప్రదర్శనలు జరిపారు. గత జూలై–ఆగస్టులో వారు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర మరాఠాల్లో చిన్నకారు, సన్నకారు రైతులే ఎక్కువ ఉండడం, కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభం వల్ల వారు కష్టాల పాలవడం తెల్సిందే. మహారాష్ట్రలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల్లో కూడా మరాఠాలే ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర మరాఠాల్లో మూడు శాతం మందే ధనవంతులని ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ ఓ నివేదిక వెల్లడించింది. మరాఠాల్లో 37 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారని, 93 శాతం మంది ఏడాదికి లక్ష రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలని, 77 శాతం మంది మరాఠాలు వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నారని, రైతుల్లో 62.7 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని బీసీ కమిషన్ జరిపిన ఓ సర్వేలే తేలింది.
మరాఠాల్లో 60 నుంచి 65 శాతం మంది కచ్చా ఇళ్లలో నివసిస్తున్నారని, వారిలో 4.3 శాతం మందే అకాడమిక్ ఉద్యోగాలు చేస్తున్నారు. మరాఠాల్లో రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ ఉండడం వల్ల వారు తమ పిల్లలను ఎక్కువగా ఉన్నత చదువులను చదివించలేక పోయారు. చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు దొరక్కపోవడానికి రిజర్వేషన్లే కారణమని వారికి అర్థమైంది. అందుకని వారు మూడేళ్లుగా అవిశ్రాంతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఉద్యమం తీవ్రత కారణంగానే రిజర్వేషన్ల బిల్లు వచ్చింది. అది చట్టరూపం దాలుస్తుందా అన్నదే అనుమానం. ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయిన పలు రాష్ట్రాల్లో అదనపు రిజర్వేషన్ల హామీలు ఆచరణకు నోచుకోలేని విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment