ముంబై : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న మరాఠా నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పన్నులు చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్ల కోసం మరాఠా నేతలు గతకొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం వివిధ మరాఠా సంఘాలకు చెందిన నేతలు లాథూర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కార్యలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్లపై ప్రకటన చేసే వరకు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని నేతలు భావిస్తున్నారు.
మరాఠి నేత సంజీవ్ బోర్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న మరాఠా క్రాంతి జన్ ఆందోళన్ పేరిట రహదారులపై నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. మరాఠాలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని కోరారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గతవారం చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మరాఠా నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారని.. వాటిని తక్షణమే ఎత్తివేయాలని మరో నేత శాంతారామ్ కుంజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment