అంతా జేపీ వల్లే!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందించారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆమె సోమవారం మీడియాకు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ ఆగర్వాల్ సహకరించకపోవడం వల్లే దారుణ పరాజయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, నగరవాసులు చెత్త పాలనను కోరుకోరని, అయితే అది ఇప్పుడు ఎన్నికల్లో జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలకు మీరు బలయ్యారా అన్న విలేకరుల ప్రశ్నను ఆమె సమాధానమిస్తూ ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగమేనన్నారు. అయితే భవిష్యత్ రాజకీయం గురించి ఇంకా ఆలోచించలేదని ముక్తసరి సమాధానమిచ్చారు.
అప్పుడే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశమేమి లేదన్నారు.
అయితే తొలిసారిగా పోటీచేసిన ఆప్‌ని తాము తక్కువగా అంచనా వేశామని అంగీకరించారు. బీజేపీనే తాము ఈ ఎన్నికలలో ప్రత్యర్థిగా పరిగణించామన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదారిపట్టించాయని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చి చూపాలంటూ ఆమె ఆప్‌కి సవాలు విసిరారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పారు. జాతీయ సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఏ సలహా ఇస్తారని ప్రశ్నించగా, అతను తనకన్నా చాలా తెలివైనవారని అభిప్రాయపడ్డారు.