మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ? | Why Marathas Are Demanding Reservations? | Sakshi
Sakshi News home page

మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?

Published Thu, Jul 26 2018 3:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

Why Marathas Are Demanding Reservations? - Sakshi

రిజర్వేషన్ల కోసం మరాఠాల ఆందోళనలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కావాలంటూ అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న మరాఠాలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారు నిజంగా సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నామని భావిస్తున్నారా? వారు ఉద్యమ బాట పట్టడానికి మరేమైన కారణాలు ఉన్నాయా?

మహారాష్ట్రలో మంగళవారం, బుధవారాల్లో మరాఠాలు నిర్వహించిన ఆందోళన విధ్వంసకాండకు దారి తీసిన విషయం తెల్సిందే. మహారాష్ట్రలో మరాఠాలు 33 శాతం మంది ఉన్నారు. వారికీ రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రధానంగా రెండు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం మించరాదంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు నిర్దేశించిన దానికన్నా ఇప్పటికే రెండు శాతం ఎక్కువ అంటే, 52 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రెండోది సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకే రిజర్వేషన్లు కల్పించాలి.

మరాఠాలు వెనకబడిన వర్గాల కేటగిరీ కిందకు రారని, వారు ఫార్వర్డ్‌ కులమని మండల కమిషన్‌ ఎప్పుడో స్పష్టం చేసింది. రాజకీయంగా కూడా ఎంతో ఎదిగిన మరాఠా కులాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చలేమని జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ 2003లో స్పష్టం చేసింది. ఆ తర్వాత 2008లో మహారాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్‌ తన 22వ నివేదికలో కూడా మరాఠాలను ఓబీసీ కేటగిరీలో చేర్చలేమంటూ చేతులెత్తేసింది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల రిజర్వేషన్ల అంశంపై జస్టిస్‌ సరాఫ్‌ నాయకత్వాన ఓ కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ మనుగడలో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం నారాయణ రాణె నాయకత్వాన మరో కమిషన్‌ వేసింది.

2014లో రాష్ట్ర ఎన్నికలకు కొంత కాలం ముందు నారాయణ రాణె కమిషన్‌ మరాఠాలకు రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. అప్పటి కాంగ్రెస్‌-ఎన్‌సీపీ ప్రభుత్వం ఆదరాబాదరా సమావేశమై మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసింది. దాన్ని నిలిపివేస్తు అదే సంవత్సరం నవంబర్‌ నెలలో బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ-శివసేన ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టమే తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా బాంబే హైకోర్టు అడ్డుకుంది.

మరాఠాలు రిజర్వేషన్లకు అర్హులు కారని అన్ని కమిషన్లు, కోర్టులు ఎందుకు తేల్చాయి?
1960లో మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రానికి సీఎం పదవిని 18 మంది నిర్వహించగా, వారిలో పది మంది మరాఠాలే. 1962 నుంచి 2004 మధ్య 2,430 మంది శాసన సభ్యులు ఎన్నిక కాగా వారిలో సగానికన్నా ఎక్కువ అంటే 1,366 మంది మరాఠాలే ఎన్నికయ్యారు. జిల్లా సహకార బ్యాంకుల్లో, విద్యా సంస్థల్లో, వైద్య, ఇంజనీరింగ్‌ యూనివర్శిటీల్లో వారిదే పైచేయి. వారికే ఎక్కువ షుగర్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పాల సహకార సంఘాలపై వారిదే ఆధిపత్యం.  అన్నింటికంటే వారి చేతుల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా గ్రామీణ సామ్రాజ్యం వారిదే. అందుకే ప్రధానంగా వారి వృత్తి వ్యవసాయం అయింది. ఈ కారణాల వల్లనే వివిధ కమిషన్లు వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ రాగా, ఓట్ల రాజకీయాల కోసం నాడు దిగిపోతున్న కాంగ్రెస్‌-ఎన్‌సీపీ ప్రభుత్వం, నేటి బీజేపీ-శివసేన ప్రభుత్వాలు రిజర్వేషన్లను అనుమతించాయి.

మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా మరాఠా యువకులు వ్యవసాయ రంగానికి దూరం అవుతూ వచ్చారు. వారికి చదువుకునే స్థోమత ఎక్కువగా ఉన్నా చదువులో పెద్దగా రాణించలేక పోయారు. సామాజికంగా వెనకబడిన వర్గాల వారు ముందుకు దూసుకెళుతుంటే తాము విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడి పోయామన్న భావం యువతలో పేరుకుపోయింది. అసహనం పెరిగిపోయింది. కేవలం రిజర్వేషన్ల కారణంగానే బీసీలు, ఓబీసీలు, దళితులు ముందుకు తీసుకుపోతున్నారన్న అక్కసు వారిలో పుట్టింది. ఇలాంటి  పరిస్థితుల్లో అహ్మద్‌ నగర్‌ జిల్లా కోపర్ది నగర్‌లో 2016, సెప్టెంబర్‌ 20వ తేదీన 11 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక అత్యాచారం జరిపి దారుణంగా చంపేశారు. దోషులు దళితులు కావడంతో మరాఠాలు నాడు  పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నేరస్థులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు.

సకాలంలోనే పోలీసులు దళితులను అరెస్ట్‌ చేయగా, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఆ కేసును త్వరితగతిన విచారించి ఏడాదిలోగానే ముగ్గురు దోషులను మరణ శిక్ష విధించింది. అయినా మరాఠాల కోపం చల్లరలేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేశారు. తమకు రిజర్వేషన్లు కావాలనే డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement