మంగళవారం ఔరంగాబాద్‌లో వాహనాన్ని ధ్వంసంచేస్తున్న ఆందోళనకారులు
ఔరంగాబాద్: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠాలు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఆత్మహత్య చేసుకున్న మరాఠా యువకుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన శివసేన ఎంపీపై కొందరు దాడి చేయటంతోపాటు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతోపాటు ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుపడ్డ పోలీసులతో ఆందోళన కారులు తలపడ్డారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లపై బైఠాయించారు.
శివసేన ఎంపీపై దాడి
మరాఠాలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సోమవారం మరాఠా క్రాంతి మోర్చా ‘జల్ సమాధి’ కార్యక్రమం చేపట్టింది. ఔరంగాబాద్‌లో చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాకాసాహెబ్ షిండే(27) అనే యువకుడు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేగావ్ గ్రామానికి వెళ్లిన లోక్‌సభ సభ్యుడు చంద్రకాంత్ ఖైరేకు చేదు అనుభవం ఎదురైంది. కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేయటంతో ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డొ చ్చిన పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అక్కడ మోహరించిన అగ్ని మాపక శకటానికి కూడా నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంతో ఆందోళనకారులను చెదరగొట్టారు. జగన్నాత్ సొనావనే(31), గుడ్డు సొనావనే అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. జల్నా జిల్లా ఘన్ సాంగ్వి పోలీస్‌స్టేషన్‌పై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. లాతూర్ జిల్లాలోని నీలాంగా ప్రాంతంలో హైదరాబాద్–లాతూర్ బస్సుపై కూడా రాళ్లు రువ్వారు.
వదంతులు వ్యాపించకుండా ఔరంగాబాద్ జిల్లా అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఔరంగాబాద్–అహ్మదాబాద్ హైవే పై ఆందోళనకారులు పోలీసు వ్యాన్, బస్సు సహా డజను వాహనాలను ధ్వంసం చేశారు. షిండే కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా తీర్మానించింది.
నేడు ముంబై బంద్
‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణలు చెప్పేదాకా ఆందోళనలు కొనసాగిస్తాం. ముంబై, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం బంద్ పాటిస్తాం’ అని మరాఠా మోర్చా నేత రవీంద్ర పాటిల్ తెలిపారు. నవీ ముంబైతోపాటు పన్వేల్‌లో బుధవారం బంద్ పాటించాలని ‘సకల్ మరాఠా సమాజ్’ కూడా పిలుపునిచ్చింది. కాగా, రాష్ట్ర జనాభాలో 33 శాతం వరకు ఉన్న మరాఠాలు రాజకీయంగా కీలకంగా ఉన్నారు. రిజర్వేషన్లు కావాలంటూ మరాఠా సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment