ఉద్యమ వరద | Best Lawyer... The Best Leader | Sakshi
Sakshi News home page

ఉద్యమ వరద

Published Mon, Oct 3 2016 12:16 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

ఉద్యమ వరద - Sakshi

ఉద్యమ వరద

స్వాతీ నఖేత్
18 జూలై 2016. అపోజిషన్ అరుపులు, కేకలతో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిధ్వనిస్తోంది.  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ పాటిల్, పృథ్వీరాజ్ చవాన్ సభలో చర్చకు పట్టుపట్టారు. మరో ప్రతిపక్ష నేత (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అజిత్ పవార్.. ‘‘ఇది నిర్భయ ఘటన కంటే కూడా హేయమైన నేరం’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి అంతా కలసి... ఫడ్నవీస్ నైతిక బాధ్యత వహిస్తూ  సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ వర్షాకాల సమావేశాలలో వాళ్లను అంతగా తరుముకొచ్చిన ఉద్యమ వరద... స్వాతీ నఖేత్ పాటిల్!

 
- మాధవ్ శింగరాజు
కోటు దర్పాన్ని ఇస్తుంది. చిరుగుల్నీ దాస్తుంది. అగ్రవర్ణాలకు కులం ఒక కోటు. ఉన్నవాళ్లు ఉన్నదర్పాన్ని కనబరిస్తే, లేనివాళ్లు లేనిదర్పాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ ఇలాగే నడిచింది, గడిచింది. ఇప్పుడు అలా లేదు. కోటులో గుద్దులాటలు అనవసరం అనుకుంటున్నారు. ‘మాకూ రిజర్వేషన్‌లు కావాలి. మాకూ రక్షణ కావాలి’ అని ఉద్యమిస్తున్నారు. వాళ్లు డిమాండ్ చేస్తున్నది ఉద్యోగాలలో రిజర్వేషన్. వాళ్లు అడుగుతున్నది కొన్ని ‘రక్షణ చట్టాల’ నుంచి రక్షణ! అందుకే ఉద్యమానికి ఆసరాగా చిన్న కొమ్మ దొరికినా దాన్ని పట్టుకుంటున్నారు. ఉద్యమ ఆవేశాన్ని రగిల్చే చిన్న నాయకత్వం దొరికినా అనుసరిస్తున్నారు.
 
ఇప్పుడు మహారాష్ర్టలో ‘మరాఠా’లు చేస్తున్నది అదే. మొన్నటి వరకు గుజరాత్‌లో ‘పటేల్ ’లు చేసిందీ అదే. అక్కడి నాయకుడు హార్దిక్ పటేల్. ఇక్కడి నాయకురాలు స్వాతీ నఖేత్.  ఇద్దరూ పాతికేళ్ల లోపు వారు. ఇద్దరూ రూలింగ్ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నవారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం హార్దిక్ పటేల్‌ని విజయవంతంగా అణచివేసింది. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీనే కానీ, స్వాతీ నఖేత్‌ని ఏమీ చేయలేకపోతోంది. అక్కడ ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంది. అంతకన్నా స్ట్రాంగ్ స్వాతీ నఖేత్! అందుకే మహారాష్ట్రలో రెండు పెద్ద అపోజిషన్ పార్టీలు ఇప్పుడు స్వాతి వెనుక నడుస్తున్నాయి.
 
అమ్మాయి కాదు... ఆదిపరాశక్తి!
గుజరాత్‌లో పటేళ్లు 24 శాతం. మహారాష్ట్రలో మరాఠాలు 32 శాతం. వీళ్లని కాదని గేమ్స్ ఆడితే బ్యాలెట్ బద్దలౌతుంది. ఆ సంగతి అక్కడి ప్రభుత్వాలకు తెలుసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి ఇంకాస్త ఎక్కువ తెలుసు. ‘ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అన్నాడు.

‘అమ్మాయి కాదు, ఆదిపరాశక్తి’ అన్నారు ఎవరో. ‘అయితే మనమూ ఆ శక్తిని ఫాలో అయిపోదాం’ అన్నారు ఫడ్నవీస్! రూలింగ్ పార్టీ ఎప్పుడూ ఫాలో అవదు. ఫాలో అయినట్లు కనిపిస్తుందంతే. ఫడ్నవిస్ వ్యూహం వేరు. మరాఠా ఉద్యమాన్ని ‘ఓన్’ చేసుకుని, స్వాతీ నఖేత్‌ని ఉద్యమానికి ‘డిసోన్’ చేయాలని అతడి ఆలోచన. ప్రతిపక్షాల ఆలోచన వేరు. స్వాతి గానీ, మరాఠాలు గానీ వాళ్ల సమస్య కాదు. ఫడ్నవీస్‌కు క్రెడిట్ గానీ, మరోసారి పవర్‌గానీ దక్కకూడదు! ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి. అందుకే అంతా స్వాతి చెంత చేరారు. స్వాతి అజెండాకు తమ జెండాలను కలిపి కుట్టేశారు.
 
మరాఠాల ‘స్వాభిమాన’ నాయిక
మరాఠా రిజర్వేషన్ పాత ఇష్యూ. స్వాతి వచ్చాక మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్.సి.పి. ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు చదువుల్లో, కొలువుల్లో, అసెంబ్లీ హాల్లో 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాణె కమిటీ రికమండ్ చేసింది. అన్ని పార్టీలూ చచ్చినట్టు మద్దతు ఇచ్చాయి. కానీ కోర్టులో కమిటీ సిఫారసులు తేలిపోయాయి. కాంగ్రెస్, ఎన్.సి.పి. బి.జె.పి.. మూడు గవర్నమెంట్లు మారాయి. రిజర్వేషన్ల తుట్టె అలా ఉండిపోయింది. దాన్నిప్పుడు స్వాతి కదిలించారు. ముందు చిన్న చిన్న ర్యాలీలతో మెల్లిగా పొగబెట్టారు.

తర్వాత.. ఇటీవలి ఒక రేప్ కేసును దుప్పటిగా కప్పుకుని తుట్టె వైపు కదిలారు. అలాగని రేప్ కేసు ముసుగులో స్వాతి చేస్తున్న రిజర్వేషన్ ఉద్యమం కాదు ఇది. తనకొక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని ఈ మరాఠా యువతి మరాఠాల కోసం తిప్పుతున్నారు. యూత్ కదా! వాట్స్‌యాప్, సోషల్ మీడియా గ్రూప్ ఆయుధాలు ఎలాగూ ఉంటాయి. మొత్తం మూడు ఆయుధాలతో స్వాతీ నఖేత్ మరాఠాలను ఇప్పుడు సంఘటితం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మునివేళ్లపై పరుగులెత్తిస్తున్నారు.
 
పవార్‌కీ లేనంత ఫాలోయింగ్!
రిజర్వేషన్లు ఒక్కటే మరాఠాల సమస్య కాదు. దళిత చట్టాల నుంచి వాళ్లకు రక్షణ కావాలి! వాళ్లపై వీళ్లు కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లినప్పుడు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దళితులు రివర్స్ కేసులు వేస్తున్నారని వీరి ఆరోపణ. దళిత సంరక్షణ చట్టంలో సవరణలు చేయాలని వీళ్ల డిమాండ్. అదీ జరగడం లేదు. పెపైచ్చు రాజకీయ నాయకులు దళితుల్ని బుజ్జగించడానికి నానా పాట్లూ పడడం మరాఠాలకు నచ్చడం లేదు.

శరద్ పవార్ అంతటి నాయకుడు కూడా దళితుల ముందు కుప్పిగంతులు వేయడం వారికి నచ్చలేదు. పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరాఠాల అభీష్టానికి వ్యతిరేకంగా మరాఠ్వాడా యూనివర్శిటీ పేరును డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీగా మార్చారు. అది మరాఠాలకు ఆగ్రహం తెప్పించింది. తర్వాతి ఎన్నికల్లో అంతకంతా తీర్చుకున్నారు మరాఠ్వాడా ప్రాంత ఓటర్లు. పవార్ పార్టీని కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఒక విషయం వాళ్లకు స్పష్టం అయింది. ఈ రాజకీయ నాయకులంతా ఒకటేనని. స్వాతీ నఖేత్ రాజకీయాల నుంచి రాలేదు.

రాజకీయాల కోసం రాలేదు. అందుకే మహారాష్ట్రలోని మూడు ప్రధాన మరాఠా ప్రాంతాలు... పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట, మరాఠ్వాడా.. స్వాతి వెంట నడుస్తున్నాయి. ఉద్యమానికి ముందువైపు స్వాతి ఉంది కాబట్టే గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమంలా, హర్యానాలో జాట్‌ల ఉద్యమంలా మరాఠా ఉద్యమం రక్తసిక్తం కాలేదు. పద్ధతిగా కదం తొక్కుతోంది. అవును. స్వాతీ నఖేత్ పద్ధతైన అమ్మాయి. ‘లా’ చదువుకుంది. మరాఠాల మనోభావాలను లోతుగా అధ్యయనం చేసింది. అంతే లోతుగా మహారాష్ట్ర రాజకీయ నాయకుల్ని!
 
విమర్శలకు జడవని వ్యక్తిత్వం
మరాఠా బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని అడ్డుపెట్టుకుని మరాఠా ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారనే ఆరోపణను ప్రస్తుతం స్వాతీ నఖేత్ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమం కారణంగా మరాఠాలు, దళితుల మధ్య తలెత్తబోయే విభేదాలకు, వాటి పర్యవసానాలకు కూడా నఖేత్ బాధ్యత వహించాలని ప్రత్యర్థులు ఆమెను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ స్వాతీ నఖేత్ జడవడం లేదు.
 
‘‘దళితుల అభివృద్ధి జరగందే మహారాష్ట్ర అభివృద్ధి జరగదు. ఒక్క దళితులు అనే కాదు... వంజరులు, ముస్లింలు, మరాఠాలు అందరూ పురోగమిస్తేనే రాష్ట్ర పురోగతి. సరైన రోడ్లు లేక, విద్యుత్ సౌకర్యం లేక అందరం ఇక్కట్లు పడుతున్నవాళ్లమే. మేము దళితులతో కలిసి ఉంటామనే అంటున్నాం. అయితే మమ్మల్ని కలవనివ్వకుండా, మాలో మాకు విభేదాలు సృష్టించడానికి రాజకీయనాయకులు కుల రాజకీయాలను రాజేస్తున్నారు’’అని నఖేత్ ఆరోపిస్తున్నారు.
 
బెస్ట్ లాయర్... ది బెస్ట్ లీడర్
మరాఠా క్రాంతి మోర్చా! పెద్ద పార్టీ కాదు. పొలిటి కల్ పార్టీ కాదు. కానీ ఇప్పుడది మహారాష్ట్రలోని పెద్దపార్టీలను, పొలిటికల్ పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. స్వాతి నఖేత్.. మోర్చా నాయకురాలు! ముంబై హైకోర్టు (ఔరంగాబాద్ బెంచ్) న్యాయవాది. బెస్ట్ క్రిమినల్ లాయర్ అవాలని స్వాతి కల. మరాఠీ మ్యూజిక్ అంటే ఇష్టం. గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆమె అభిరుచులు. జిజియా మాత హైస్కూల్‌లో చదువుకున్నారు. మాణిక్‌చంద్ పహాడే లా కాలేజ్‌లో పట్టభద్రురాలయ్యారు. ఎం.పి. లా కాలేజ్, డాక్టర్ బాము కాలేజీలలో న్యాయవాద విద్యలో అప్‌గ్రేడ్ అయ్యారు. తను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని మరాఠాలు అడుగుతున్న సామాజిక న్యాయం కోసం ఒక అస్త్రంలా ఉపయోగిస్తున్నారు స్వాతీ నఖేత్.
 
స్వాతి చేతుల్లోకి వచ్చేసింది
క్రాంతి మోర్చా ప్రధానంగా ఇప్పుడు నాలుగు అంశాలపై ఉద్యమిస్తోంది. ఒకటి: మరాఠాలకు రిజర్వేషన్లు. రెండు:  అఘాయిత్యాలనుంచి ఎస్సీ, ఎస్టీలకు రక్షణకల్పించే చట్టం దుర్వినియోగం కాకుండా ఆ చట్టానికి సవరణలు చేయడం.  మూడు: అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ స్మారక చిహ్నాన్ని స్థాపించడం. నాలుగు:  తమ మరాఠాల అమ్మాయిపై పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన దళిత నేరస్థులకు ఉరిశిక్ష విధించడం. ఇప్పుడీ ఉమ్మడి అంశాల ఉద్యమం స్వాతీ నఖేత్ చేతుల్లోకి వచ్చేసింది. రేప్ ఘటన ఆ ఉద్యమానికి ఇప్పుడు ప్రధాన చోదకశక్తి అయింది.
 
 
13 జూలై 2016

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకంపనలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా డిమాండ్‌కు దారితీసిన ‘ఆ’ హేయమైన ఘటన జరిగిన రోజు! అహ్మద్‌నగర్ జిల్లా కొపర్డి గ్రామంలో పదిహేనేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి, అతి కిరాతకంగా చంపేశారు! పోపుగింజల కోసం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న అమ్మమ్మగారింటికి సైకిలుపై వెళ్లింది ఆ బాలిక. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చూసి రమ్మని తల్లి కొడుకును పంపింది. చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లాడా అబ్బాయి. చెల్లెలు కనిపించలేదు. చెల్లెలి సైకిల్ కనిపించింది. సైకిల్ నిలబెట్టి లేదు. పక్కకు పడి ఉంది! అతడి మనసు కీడును శంకించింది. ఆ చుట్టుపక్కలే వెతికాడు. ఓ ఫామ్‌హౌస్ దగ్గరలో చెల్లెలి మృతదేహం కనిపించింది. నగ్నంగా! ఆమె ఒంటినిండా దెబ్బలు. ప్రతిఘటించడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement