సత్తుపల్లి మట్టా దయానంద్‌కి గట్టి దెబ్బ Sathupalli Congress Matta Dayanand SC Certification Under Threat | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి కాంగ్రెస్‌ ఆశావహుడు మట్టా దయానంద్‌కి గట్టి దెబ్బ.. అయినా ప్లాన్‌బీతో రెడీ

Published Tue, Aug 22 2023 8:49 PM

Sathupalli Congress Matta Dayanand SC Certification Under Threat - Sakshi

సాక్షి, ఖమ్మం:  సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్‌కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు.  ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. 

వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్‌ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. 

దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్కు నోటీసులు జారీ అయ్యాయి.  

ప్లాన్‌ బీ కూడా?

2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై  2018లో టీఆర్ఎస్(బీఆర్‌ఎస్‌) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్‌రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు.  కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్‌లు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement