సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి పైచేయి ఎవరిది ..?
సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గం
సత్తుపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి పక్షాన సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలిచారు. దీంతో ఆయన నాలుగోసారి గెలిచినట్లయింది. గతంలో ఒకసారి సిపిఎం తరపున, ఆ తర్వాత టిడిపి పక్షాన ఆయన గెలిచారు.2018లో తెలంగాణలో టిడిపి రెండు సీట్లు గెలిస్తే వాటిలో ఒకటి సత్తుపల్లి. మరొకటి అశ్వారావుపేట. కాగా గెలిచిన కొద్ది నెలలకు సండ్ర టిఆర్ఎస్ లో చేరిపోతున్నట్లు ప్రకటించారు. సండ్ర వెంకట వీరయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి పిడమర్తి రవిపై 19002 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
వీరయ్యకు 100044 ఓట్లు రాగా, పిడమర్తి రవికి 81042 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన కె.స్వామికి 7300 పైగా ఓట్లు వచ్చాయి. సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలో 2014లో తన సమీప ప్రత్యర్ధి ఘట్టా దయానంద్‌పై 2485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.వీరయ్య మొదట సిపిఎం తరపున గెలిచారు.ఆ తర్వాత కాలంలో ఆయన టిడిపిలోకి మారి సత్తుపల్లి నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన విద్యార్ధి నేత పిడమర్తి రవి ఓటమి చెందారు. రవికి 6666 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో కూడా గెలవలేకపోయారు.
2014లో ఇక్కడ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్.డి.విజయకుమార్ రెండో స్థానంలో ఉంటే, మాజీ మంత్రి,కాంగ్రెస్ ఐ అభ్యర్ధి సంభాని చంద్రశేఖర్ 30105 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం 2009లో ఎస్సిలకు రిజర్వు అయింది. సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు పాలేరు నియోజకవర్గంలో గెలిచారు. అలాగే సండ్ర వెంకటవీరయ్య పాలేరులో ఒకసారి గెలిచారు. 2009లో పాలేరు జనరల్ కావడంతో వీరిద్దరూ రిజర్వు అయిన సత్తుపల్లికి మారారు. సత్తుపల్లిలో గతంలో జలగం కుటుంబం ఎక్కువ కాలం ఆధిపత్యం వహించింది.
1957లో జలగం కొండలరావు, 1962, 1967,1972లలో వేంసూరు నుంచి జలగం వెంగళరావు గెలిస్తే, 1978 నుంచి ఏర్పడిన సత్తుపల్లిలో కూడా వెంగళరావే గెలుపొందారు. ఆయన కాసు,పివి మంత్రివర్గాలలో ఉండి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఖమ్మం లోక్‌సభస్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి బాధ్యతలుకూడా నిర్వహించారు. పిసిసి అధ్యకక్షునిగా కూడా పనిచేశారు. జలగం వెంగళరావు పద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా వున్నారు.
వెంగళరావు చిన్న కుమారుడు వెంకటరావు 2004లో సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో టిక్కెట్ రాకపోవడంతో ఖమ్మంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. కొంతకాలం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టిఆర్ఎస్ లో చేరి కొత్త గూడెం నుంచి 2014 లో పోటీచేసి గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. వెంగళరావు సోదరుడు కొండలరావు ఎమ్.పిగా కూడా ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో మరో ప్రముఖ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1983 నుంచి అక్కడ టిడిపి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. 1985, 1994, 1999లలో సత్తుపల్లిలోను, 2009లో ఖమ్మంలోను పోటీచేసి గెలిచారు.
2014 లో ఓటమిచెందారు. తదుపరి తుమ్మల టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు.ఆ తర్వాత పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐదోసారి గెలిచారు. కాని 2018 సాధారణ ఎన్నికలో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. తుమ్మల గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను,తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలోను పనిచేశారు.
1978లో జరిగిన ఎన్నికలలో ప్రముఖ సాహితీవేత్త కాళోజీ సత్తుపల్లిలో వెంగళరావుతో పోటీపోడి ఓడిపోయారు. అయితే జలగం ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారం రాకపోవడంతో ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామాచేశారు. సత్తుపల్లి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు వెలమ, మూడుసార్లు కమ్మ, ఒకసారి ఇతరులు గెలుపొందారు.
సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..