
రాళ్లదాడికి దిగిన నిరసనకారులు
శ్రీనగర్ : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు పౌరుల మరణించడంతో ఆదివారం అధికారులు ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో అధికారులు పలుచోట్ల ఆంక్షలు విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. శనివారం షోపియాన్ జిల్లాలోని గనోపోరా గ్రామంలో జరిగిన అల్లర్లలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ఎనిమిది మంది నిరసనకారులు గాయపడ్డారు. ఈ ఘటనపై రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విచారణకు ఆదేశించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ గిలానీ, మిర్విజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్‌లు ఆదివారం కాశ్మీర్ వ్యాలీ బంద్‌కు పిలుపునిచ్చారు. శ్రీనగర్‌లోని ఖనీర్, రైనీవారీ, నౌహాటా, ఎంఆర్ గుంజ్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిబంధనలు విధించారు. బారాముల్లా, బన్నిహాల్ పట్టణాల మధ్య రైల్వే సేవలను ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. గస్తీకి వెళ్లిన ఆర్మీ కాన్వాయ్‌పైకి 100 మందితో కూడిన నిరసన కారుల గుంపు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని రక్షణ శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు.
కాన్వాయ్‌లో 4 వాహనాలు ఉన్నాయని, నిరసనకారులు రాళ్లు విసురుతూ వాహనాలను చుట్టుముట్టి నిప్పుపెట్టడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే ఓ జూనియర్ ఆర్మీ అధికారి వద్ద నున్న ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో జావేద్ అహ్మద్ భట్(20), సోహైల్ జావిద్ లోనె(24) అనే ఇద్దరు మృతిచెందారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment