
శ్రీనగర్: అందాల కశ్మీర్(Kashmir) ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న కట్రా నుండి శ్రీనగర్‌కు నడిచే తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘కశ్మీర్ వందేభారత్ రైలు ప్రారంభమయ్యే చారిత్రాత్మక క్షణం కశ్మీర్‌కు కొత్త అధ్యాయం అవుతుందని’ అన్నారు.
272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ పూర్తికావడంతో కశ్మీర్‌కు కొత్త రైలు మార్గం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయింది. అలాగే కట్రా-బారాముల్లా మార్గంలో రైలు రాకపోకల ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కట్రా- కశ్మీర్ మధ్య రైలు సర్వీసుకు రైల్వే భద్రతా కమిషనర్ ఆమోదం తెలిపారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) ప్రారంభంతో జమ్ము.. శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కశ్మీర్‌కు నేరుగా రైలు సర్వీసు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. నూతన వందేభారత్ రైలు సర్వీసుతో అది నెరవేరనుంది.
కశ్మీర్‌లో పరుగులు తీయబోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇతర రైళ్లకు భిన్నంగా ఉండనుంది. దీనిని మైనస్ -20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా సజావుగా నడిచేలా తీర్చిదిద్దారు. ఈ మార్గంలో నిరంతరాయంగా రైలు సేవలను కొనసాగించేందుకు, పట్టాలపై ఉన్న మంచును తొలగించేందుకు ముందుగా ప్రత్యేక మంచు క్లియరెన్స్ రైళ్లను నడుపుతారు. ఫలితంగా ఈ రైల్వే లైన్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు