రెండురోజులుగా మధ్యాహ్న భోజనం బంద్
Published Fri, Aug 5 2016 12:45 AM | Last Updated on Sat, Aug 25 2018 5:29 PM
చింతపల్లి : పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా మండలంలో మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం నీరు గారుతోంది. మండలంలోని కుర్మేడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో రెండు రోజుల నుంచి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో విద్యార్థులు ఇళ్లనుంచి భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్కూల్‌లో 536 మంది విద్యార్థులుండగా బుధవారం 450మంది, గురువారం 475 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. ప్రతిరోజూ పాఠశాలలో సుమారు 50 నుంచి 70 కేజీల వరకు విద్యార్థులకు భోజనం వండాల్సి ఉంది. నెలకు సుమారు 13 క్వింటాళ్ల బియ్యాన్ని పాఠశాలకు అందించాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు కేవలం పాఠశాలకు 10 క్వింటాళ్లే సరఫరా చేయడంతో బియ్యం అందుబాటులో లేని కారణంగా రెండు రోజులుగా వంటలు వండడం లేదు. విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విద్యార్థులకు భోజనం అందించాల్సి ఉండగా రెండు రోజుల నుంచి విద్యార్థులకు భోజనం వండకపోయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement