‘బంద్’లో చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
– జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు
– ఆందోళనకారులపై వీడియో, డ్రోన్ కెమెరాలతో నిఘా
కర్నూలు: బంద్‌లో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేçపట్టిందని పేర్కొన్నారు. బంద్ పేరుతో అసాంఘిక శక్తులు ఆందోళనకారులతో చేరి హింసాత్మక చర్యలకు పాల్పడితే పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. సీసీ టీవీలు, వీడియో, డ్రోన్ కెమెరాలతో బంద్ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించవద్దని రాజకీయ పక్షాలకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే అలాంటి వారి నుంచి సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం రాబట్టనున్నట్లు పేర్కొన్నారు. వ్యాపార దుకాణాలను బలవంతంగా మూయించరాదని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి వేరొక ప్రకటనలో పేర్కొన్నారు.