Darjeeling hills
-
ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!
సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే 22 కి.మీ పరగు డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్‌లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్ జామ్‌తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
63 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..
సాక్షి, న్యూఢిల్లీ : డార్జిలింగ్ టీగా స్థానికంగా పిలిచే ‘మార్గరెట్స్ హోప్ టీ’ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండుల్లో ఒకటి. దీని యజమాని గుడ్‌రీక్ గ్రూప్. ఆరు దశాబ్దాల క్రితం అంటే 1955, జూన్ 25వ తేదీన (సరిగ్గా నేటికి 63 ఏళ్లు) కొండల్లో నెలవైన ఈ టీ గార్డెన్‌లోకి సుత్తీ కొడవలి గుర్తును కలిగిన ఎర్రని జెండాను చేతపట్టుకొని కాలి లింబుని అనే 12 ఏళ్ల బాలిక దూసుకొచ్చింది. అప్పటికే ఆ టీ గార్డెన్ మేనేజర్ భవనానికి 50 మీటర్ల ఇవతల కొన్ని వందల మంది టీ గార్డెన్ కార్మికులు నిలబడి గొంతెత్తి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 12 ఏళ్ల లింబుని కూడా వారితో గొంతును కలిపి గట్టిగా నినాదాలు చేయడం అక్కడి కార్మికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘నారి సంఘటన్’ సభ్యులుగా ఉన్న అనేక మంది మహిళలు కూడా కార్మికుల ముందు వరుసలో నిలబడి నినాదాలు చేస్తున్నారు. వారిలో లింబుని తల్లి కూడా ఉంది. సమీపంలో ఉన్న దిలారామ్ టీ ఎస్టేట్‌లో సమ్మె చేస్తున్న కార్మికులను పనుల్లో చేరాల్సిందిగా పోలీసులు బలవంతం చేస్తున్నారన్న వార్త తెలియడంతో అక్కడికి వెళ్లి అక్కడి కార్మికులకు మద్దతు తెలపాలని మార్గరెట్స్ హోప్ టీ కార్మికులు అటువైపు కదంతొక్కారు. మార్గమధ్యంలో వారికి పలుసార్లు తుపాకీ కాల్పులు వినిపించాయి. అయినా వెరవకుండా దిలారామ్ టీ ఎస్టేట్‌లోకి కార్మికులు పరుగులు తీశారు. వారి వెంట పరుగెత్తికెళ్లిన లింబునికి కళ్ల ముందు ఏదో పేలిన శబ్దం వినిపించింది. కాసేపు ఏదీ కనిపించలేదు. కళ్లు మంటలెత్తుతున్నాయి. చుట్టూ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికాసేపటికి కళ్లు నులుముకుంటూ తేరిపార చూస్తే ఇద్దరు మహిళలు సహా ఆరుగురు కార్మికులు రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేటికీ బతికున్న నాటి 12 ఏళ్ల బాలిక లింబుని నాటి సంఘటన గురించి మీడియాకు చెప్పుకొచ్చారు. టీ గార్డెన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారతీయ గోర్ఖా లీగ్‌లు ఇచ్చిన పిలుపు మేరకు మార్గరెట్స్ హోప్, దిలారామ్ టీ ఎస్టేట్లతోపాటు ముండా, బాలాసన్, మహారాణి టీ ఎస్టేట్లలో సమ్మె జరిగింది. జూన్ 22వ తేదీనే సమ్మె ప్రారంభంకాగా, 25వ తేదీన అది కాల్పులకు దారితీసింది. ఆ మరుసటి రోజు దాదాపు 20 వేల మంది కార్మికులు డార్జిలింగ్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులను పెద్ద ఎత్తున మొహరించి ఎంతోమంది కార్మిక నాయకులను అరెస్ట్ చేశారు. వారిలో సీపీఐ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఆందోళనను మరింత తీవ్రం చేయడంతో టీ ఎస్టేట్ యజమానులు దిగొచ్చారు. రోజుకు కనీస వేతనంగా కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఆరు అణాల (దాదాపు 38 పైసలు) నుంచి ఎనిమిది అణాలకు (దాదాపు 50 పైసలు) పెంచారు. మొదటిసారి బోనస్ ప్రకటించారు. మహిళలకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ డార్జిలింగ్ సంఘటన పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోయింది. 1948, నవంబర్ నెలలోనే భారత ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చినా టీ ఎస్టేట్ కార్మికులకు అమలు కాలేదు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ఈ చట్టాన్ని 2017లో కూడా సవరించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర కార్మికులకే కనీస వేతనాలను కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రంలోని కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలను నిర్ణయించాల్సింది ఆయా రాష్ట్రాలదే. నాటి పోలీసు కాల్పుల్లో మరణించిన ఆరుగురు కార్మికుల సంస్మరణార్థం డార్జిలింగ్ హిల్స్‌పై ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. పాత స్థూపం పాడైపోగా, కొత్త స్థూపాన్ని సీపీఎం నుంచి విడిపోయిన ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ రెవల్యూషనరీ మార్క్సిస్ట్స్’ పార్టీ 2004 నుంచి జూన్ 25వ తేదీన స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని నాటి సమ్మెలో పాల్గొన్న లాక్‌మోతీ దేవన్ మనవడు సలీమ్ సుబ్బా తెలిపారు. డాక్టర్ అభానిరంజన్ తాలపత్ర స్ఫూర్తి నాటి టీ గార్డెన్స్ కార్మికులు సమ్మెకు సీపీఐకి చెందిన డాక్టర్ అభానిరంజన్ స్ఫూర్తినిచ్చారని నక్సల్బరి ఉద్యమకారుల్లో ఒకరైన చారు మజుందార్ కుమారుడు అభిజిత్ మజుందార్ వివరించారు. ఆయన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ టీ గార్డెన్ వర్కర్స్’కు జాయింట్ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం వంద కిలోమీటర్ల దూరంలో మైదాన ప్రాంతంలో నివసిస్తున్న డాక్టర్ అభానిరంజన్ టీ కార్మికుల వైద్య అవసరాల గురించి తెలుసుకొని తేయాకు కొండలపైకి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పట్లో కార్మికుల కాళ్లకు చెప్పులుకానీ బూట్లుగానీ ఉండేవి కావు. పురుగు పుట్ర జొరబడకుండా నిండైన దుస్తులు కూడా ముఖ్యంగా ఆడవాళ్లకు ఉండేవి కావు. ప్రతిరోజు రాత్రి వారిళ్లకు డాక్టర్ వెళ్లి గాయాలకు, ఇన్ఫెక్షన్లకు వైద్యం చేసేవారు. ప్రతిరోజు తేయాకు తోటలో పనికాగానే కార్మికులు చేతులు కడుక్కునేందుకు ఆ డాక్టర్ ఐయోడిన్ సొల్యూషన్‌ను తయారు చేసి ఇచ్చారు. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ కార్మికులను సమ్మెకు పురిగొల్పారు. తెభాగా ఉద్యమంలో కూడా 1946–47లో జరిగిన తెభాగా ఉద్యమంలో కూడా డాక్టర్ అభానిరంజన్ పాల్గొన్నారని అభిజిత్ మజుందార్ తెలిపారు. పండించిన పంటలో సగం కాకుండా మూడొంతుల పంటను ఇవ్వాలంటూ కౌలు రైతులు చేసిన ఉద్యమం అది. ప్రధానంగా ఆ ఉద్యమమే నక్సల్బరి ఉద్యమానికి నాంది పలకగా, ఆ ఉద్యమ నాయకులకు కూడా టీ గార్డెన్ కార్మికుల సమ్మె స్ఫూర్తినిచ్చిందని మజుందార్ మీడియాకు వివరించారు. మార్గరెట్స్ హోప్ టీ గార్డెన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్సల్బరిలో 1967లో రైతుల సాయుధ పోరాటం జరిగింది. డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్‌డివిజన్‌లో నక్సల్బరి ప్రాంతం ఉంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో చారు మజుందార్ ఒకరు. -
డార్జిలింగ్‌లో మళ్లీ అల్లర్లు
సాక్షి, కోల్‌కతా : డార్జిలింగ్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోయింది. గురువారం ఉదయం చెలరేగిన ఘర్షణలో ఓ పోలీస్ అధికారితోపాటు ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గుర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా(జీజేఎం) నేత బిమల్ గురంగ్.. లెప్చా బస్తీలో తలదాచుకున్నాడన్న సమచారం మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న బీజేఎం కార్యకర్తలు పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో ఓ అధికారి గాయపడగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బెంగాల్ పోలీసులు బిమల్ గురంగ్ పై వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే అక్టోబర్ 30న నిర్వహించబోయే భారీ ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో తాను హాజరై తీరతానని బిమల్ ఓ ఆడియో సందేశంలో కార్యకర్తలకు తెలిపారు. ఇదిలా ఉంటే గురంగ్ మద్ధతుదారులు భారీ ఎత్తున్న మారణాయుధాలను.. పేలుడు పదార్థాలను దాచారని.. అక్టోబర్ 30న బహిరంగ సభ ద్వారా పెద్ద ఎత్తున్న హింసకు వ్యూహరచన చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా తాజాగా నిర్వహించిన దాడుల్లో 6 ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చూపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకై జీజేఎం పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. -
డార్జిలింగ్‌ను విభజించే ప్రసక్తే లేదు
డార్జిలింగ్(పశ్చిమబెంగాల్): డార్జిలింగ్ కొండప్రాంత విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆమె ఆదివారమిక్కడ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం డార్జిలింగ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రత్యేక ప్యాకేజీలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాల, విద్యుత్, తాగునీటికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. బంద్ పిలుపులపై తృణమూల్ అధినేత్రి మండిపడ్డారు. సమ్మెలకు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపుల మూసివేతలకు కొందరు పిలుపులిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. -
కేంద్రంతో మాత్రమే చర్చిస్తాం: జీజేఎం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై తాము కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరుపుతామని, పశ్చిమ బెంగాల్ సర్కారుతో ఈ అంశంపై మాట్లాడే ప్రసక్తే లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కరాఖండిగా తేల్చి చెప్పింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా డార్జిలింగ్ పర్వతప్రాంతంలో ఆదివారం తొమ్మిది రోజూ బంద్ కొనసాగింది. ‘ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మా న్యాయమైన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు సాగిస్తాం. ఈ అంశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదు’ అని జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ఆదివారం మీడియాతో అన్నారు. డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా పొందేందుకు కేంద్రంతో జీజేఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బంద్‌కు ఒకరోజు విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 13-14 నుంచి ‘జనతా కర్ఫ్యూ’ ప్రారంభించనున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధించిన 72 గంటల గడువు ఆమె ఆదేశం కాదని, కోర్టు ఆదేశమని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండానే ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగిస్తామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని చెప్పారు. ఒకవైపు డార్జిలింగ్‌లో నిరవధిక బంద్ కొనసాగుతుండగా, మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. జీజేఎం కోర్ కమిటీ సభ్యుడు శేఖర్ శర్మను శనివారం రాత్రి కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌లు ఆపకుంటే కఠిన చర్యలు: గొగోయ్ గువాహటి: ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో అస్సాంలో బంద్‌లు కొనసాగిస్తున్న నిరసనకారులు బంద్ ఆపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హెచ్చరించారు. త్రిపురలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. గిరిజన ప్రాంతాలను కలుపుతూ త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలిని (టీటీఏఏడీసీ) ఏర్పాటు చేయాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే, త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. -
డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
డార్జిలింగ్/గువాహటి/న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన దరిమిలా గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వతప్రాంతంలో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక బంద్ బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. డార్జిలింగ్, కలింపాంగ్, మిరిక్, సుఖిపొక్రీ, కుర్సియాంగ్ తదితర పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. కేంద్రం నుంచి చేరుకున్న ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఒకవైపు బంద్ కొనసాగుతుండగా, మరోవైపు పోలీసులు పాత కేసులకు సంబంధించి అరెస్టులు సాగిస్తున్నారు. జీజేఎంలోని గూర్ఖాలాండ్ పర్సనల్ (జీఎల్పీ) విభాగానికి చెందిన 32 మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 143కు చేరుకుంది. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీకి ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. కర్బీ-ఆంగ్లాంగ్‌లో కర్ఫ్యూ సడలింపు అస్సాంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూను సడలించారు. కర్బీ-ఆంగ్లాంగ్, బోడోలాండ్, కామ్తాపూర్ రా ష్ట్రాల డిమాండుతో అస్సాంలో వివిధ సంస్థ లు, పార్టీల నేతృత్వంలో రెండు రోజులు కొనసాగిన బంద్‌లు బుధవారం ముగిశా యి. మరోవైపు బోడో నాయకులు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌ను కలుసుకుని, తమ డిమాండ్‌ను వినిపించారు. తమ డిమాండు పై ఉన్నతస్థాయిలో చర్చించనున్నట్లు ప్ర ధాని హామీఇచ్చారని చెప్పారు. ఈ అంశం పై బాధ్యతలను హోంమంత్రి షిండేకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు. -
32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులు అరెస్ట్
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారుల చేపట్టిన బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. అయితే 32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులను గతరాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వారందరిపై గతంలోనే కేసు నమోదు అయ్యాయని, అలాగే శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉద్యమకారుల సంఖ్య 143 మందికి చేరిందని తెలిపారు. అయితే గూర్ఖాలాండ్ జనమూక్తి మోర్చ అధ్యక్షుడు బిమల్ గురంగ్ అనిత్ ధపాను ఈ నెల మొదట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ బాసుదేబ బెనర్జీ డార్జిలింగ్ హిల్స్‌లోని స్థానిక అధికారులతో కలసి శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన డార్జిలింగ్‌లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన ముఖ్యకార్యదర్శి రామదాస్ మీనాతో సమావేశమైనారు. స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఆయనకు బెనర్జీకి సూచించారు. కొల్కత్తా వెళ్లగానే డార్జిలింగ్‌లోని పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీకి నివేదిక సమర్పిస్తానని ఆయన తెలిపారు. అయితే డార్జిలింగ్ జిల్లా కలెక్టర్‌గా ఆర్థిక శాఖ సంయూక్త కార్యదర్శి పునీత్ యాదవ్‌ను నియమిస్తు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటివరకు ఆ పదవిలో ఉన్న సౌమిత్ర మోహన్‌ను బృద్వన్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.