ఆఫీసర్స్‌ అందరూ మహిళలే | All Women Booth to Attract Women Voters in Assam Nalbari | Sakshi
Sakshi News home page

ఆఫీసర్స్‌ అందరూ మహిళలే

Published Mon, Mar 22 2021 12:44 AM | Last Updated on Tue, Mar 23 2021 2:27 PM

All Women Booth to Attract Women Voters in Assam Nalbari - Sakshi

పురబి కన్వార్, నల్బరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌; అమన్‌జీత్‌ కౌర్, నల్బరి జిల్లా ఎస్పీ

మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్‌ మహిళ. సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మహిళ. ముగ్గురు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6 తేదీలలో.. పోలింగ్‌ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా.

బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు.

అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్‌’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్‌ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్‌షెత్రి, ధర్మాపూర్‌లను ప్రత్యేక జోన్‌లుగా, సెక్టార్‌లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు.


‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్‌ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్‌ పురబి కన్వార్‌. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్‌ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్‌ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్‌ సిలిండర్‌లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్‌లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్‌లు అంటించిన సిలిండర్‌లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్, డిస్ట్రిక్ట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్‌ కౌర్‌). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్‌ ఆఫీసర్‌లు, సబ్‌–రిజిస్ట్రార్‌ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్‌ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ లేబర్‌ ఆఫీసర్, సబ్‌–డివిజినల్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్, సాయిల్‌ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement