ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం: రఘువీరా
Published Wed, May 3 2017 12:53 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
విజయవాడ: సాధారణ ఎన్నికలు 2019 లో జరిగినా.. లేక అంతకు ముందే జరిగినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం.. జూన్ మొదటివారంలో రాష్ట్రానికి హోదా సాధనకు అండగా ఉన్న 14 పార్టీలతో కలిసి భీమవరంలో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులను కలిసి పరిస్థితిపై మాట్లాడుతాం. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే నియోజకవర్గాల పెంపు అంశం చేపట్టాలి.
మూడేళ్ల టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 8న చార్జ్‌షీట్ విడుదల చేస్తాం. జన్మభూమి కమిటీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు వాటిని ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాలి. ప్రతిసారి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, కాంగ్రెస్ చేసిన తప్పిదాలేంటో చెప్పాలి. నాడు శ్రీ సిటీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు కంపెనీలను అక్కడే ఎందుకు ప్రారంభిస్తున్నారు? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల అధ్యాయం ముగియబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది' అని అన్నారు.
Advertisement