చిన్నారిని ఇంట్లో వదిలేసి.. తుపాకులతో పార్టీకి వెళ్లి..!
సమయం బుధవారం ఉదయం. అమెరికా జాతీయుడు, కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్పెక్టర్ అయిన సయెద్ రిజ్వాన్ ఫరుక్ (28), సౌదీకి చెందిన అతని భార్య తష్ఫీన్ మాలిక్ తొందరగా తయారయ్యారు. తమ ఆరు నెలల చిన్నారిని ఫరుక్ తల్లి దగ్గర వదిలేసి.. తాము డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం వెళుతున్నట్టు ఆమెకు చెప్పారు. అయితే మధ్యాహ్నం సమయానికల్లా వారు దాడి చేసేందుకు వీలుగా దుస్తులు ధరించారు. చేతిలో తుపాకులు పట్టుకొని.. ఫరుక్ సహ ఉద్యోగులు నిర్వహిస్తున్న క్రిస్మస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాల్పుల హోరుతో 14మందిని హతమార్చారు. 17మందిని గాయపర్చారు.
వాళ్లు అక్కడి నుంచి తప్పించుకునేలోపే పోలీసులు రంగంలోకి దిగి.. ఎదురుకాల్పుల్లో దంపతులిద్దరిని మట్టుబెట్టారు. ఇది అమెరికా కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన కాల్పుల ఉదంతం తీరు. ఈ దంపతులు ఎందుకు కాల్పులకు దిగారన్నది ఇప్పటికే పోలీసులు నిర్ధారించలేదు. ఈ కాల్పుల ఘటన క్రిస్మస్ పండుగ రానున్న వేళ సాన్ బెర్నార్డినో పట్టణ వాసుల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ కాల్పుల వెనుక ప్రేరణ ఏమిటన్నది తెలియకపోయినా.. ఇది ఉగ్రవాద ఘటన అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయడం లేదని పోలీసులు చెప్తున్నారు.
సాన్ బెర్నార్డినో కౌంటీ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఫరుక్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడంటే అతని సహ ఉద్యోగులే నమ్మలేకపోతున్నారు. ఫరుక్ ముస్లిం భక్తుడు అయినప్పటికీ తన మతం గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదని అతని మాజీ సహ ఉద్యోగి గ్రిసెల్దా రీసింగర్ తెలిపారు. 'అతను ఎప్పుడూ నాకు మత ఛాందసుడిగా కనిపించలేదు. అతనిపై నాకు అనుమానం కలుగలేదు' అని గిసెల్దా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అమెరికాలో నివసించాలన్న స్వప్నంతో ఆ దంపతులు తమ దేశాలను వదిలి ఇక్కడికి వచ్చినట్టు కనిపించేదని మరో సహోద్యోగి చెప్పారు. ఫరుక్ కుటుంబం దక్షిణాసియా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. కాగా అతని భార్య తష్ఫీన్ పాకిస్థాన్ దేశీయురాలని, ఆమె మొదట సౌదీ అరేబియాలో జీవించి ఆ తర్వాత అమెరికాకు వచ్చినట్టు భావిస్తున్నారు.