అది ఉగ్రవాద దాడే కావొచ్చు!
సాన్ బెర్నార్డినో (కాలిఫోర్నియా): అమెరికాలో భారీ ఆయుధాలతో ఓ వ్యక్తి, ఓ మహిళ సృష్టించిన కాల్పుల బీభత్సంలో 14 మంది చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులను మట్టుబెట్టారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ హలీడే విందు వద్ద జరిగిన ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పులకు తెగబడిన ఇద్దరు నిందితులను సయెద్ రిజ్వాన్ ఫరూక్ (28), తష్ఫీన్ మాలిక్ (27)గా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితుల మధ్య అనుబంధం ఉందని, బహుశా వీళ్లు పెళ్లి చేసుకొని ఉండవచ్చు లేదా నిశ్చితార్థం జరిగి ఉండవచ్చు అని సాన్ బెర్నార్డినో పోలీసు చీఫ్ జరాడ్ బర్గ్వాన్ తెలిపారు.
కాల్పులు జరిపింది ఈ ఇద్దరేనని తాము నమ్ముతున్నామని, మరొక నిందితుడు కూడా ఉన్నట్టు వచ్చిన అనుమానాలు నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. ఈ కాల్పుల దాడి వెనుక ప్రేరేపణలు ఏమిటో ఇంకా స్పష్టం కాకపోయినా ఇది ఉగ్రవాద దాడి అయి ఉండవచ్చునన్న అంశాన్ని కొట్టిపారేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫరూక్ అమెరికాలో జన్మించిన వాడేనని, అయితే మాలిక్ జాతీయత గురించి తెలియదని చెప్పారు. ప్రజారోగ్య ఉద్యోగిగా పనిచేస్తున్న ఫరూక్ తన సహా ఉద్యోగుల నిర్వహిస్తున్న హాలీడే పార్టీలోనే కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడని పోలీసు చీఫ్ వివరించారు.