![College Girls Made To Take Oath Against Love Marriage Maharashtra On Valentines Day - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/15/representation.jpg.webp?itok=M5L8d3XP)
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: వాలెంటైన్స్‌డేను పురస్కరించుకుని ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయిన వేళ ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థినుల చేత ‘ప్రేమ’కు వ్యతిరేకంగా ప్రమాణాలు చేయించింది. తాము ఎప్పుడూ ప్రేమలో పడబోమని.. ప్రేమ వివాహం చేసుకోబోమని ప్రతిజ‍్ఞ చేయించింది. ఈ మేరకు.. ‘‘ఎవరినీ ప్రేమించం. ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లం. ప్రేమ వివాహం చేసుకోం. అంతేకాదు కట్నం అడిగేవారిని సైతం మేం పెళ్లి చేసుకోం. మా అమ్మానాన్నలకు మేం విధేయులుగా ఉంటాం’’ అని మరాఠా భాషలో విద్యార్థినుల చేత చెప్పించారు. మహారాష్ట్రలోని అమరావతిలో గల మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ విషయం గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ మాట్లాడుతూ... ఎవరి మాయలో పడబోమని విద్యార్థులు కచ్చితంగా ఇలాంటి ప్రమాణం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వార్ధా ఘటన లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కాలేజీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇక కాలేజీ యాజమాన్యం చర్యను సమర్థిస్తూ ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘ అసలు ప్రేమ వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలి. వాళ్లు మనకోసం మంచి వ్యక్తినే ఎంపిక చేస్తారు కదా. కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది’’ అని పేర్కొంది. కాగా మహారాష్ట్రలోని వార్దాకు చెందిన పాతికేళ్ల మహిళా లెక్చరర్‌ను ప్రేమ పేరుతో వేధించిన.. విక్కీ నగ్రాలే అనే వివాహితుడు ఆమెపై పెట్రోల్‌పోసి నిప్పంటింటిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆస్పత్రిలో చికత్స పొందుతూ మృతి చెందింది.(ఆ లెక్చరర్ చనిపోయింది..!)
Comments
Please login to add a commentAdd a comment