లెక్చరర్‌కు నిప్పంటించాడు! | 24-yr-old teacher on way to college set ablaze by stalker | Sakshi
Sakshi News home page

లెక్చరర్‌కు నిప్పంటించాడు!

Published Tue, Feb 4 2020 5:45 AM | Last Updated on Tue, Feb 4 2020 5:45 AM

24-yr-old teacher on way to college set ablaze by stalker - Sakshi

సాక్షి, ముంబై:  మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్‌ఘాట్‌లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్‌ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్‌ వద్ద అడ్డగించిన వికేశ్‌.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.  40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్‌ ప్రకటించారు.  బాధితురాలు, నిందితుడు వికేశ్‌ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని   ఇన్‌స్పెక్టర్‌ సత్యవీర్‌ తెలిపారు. వికేశ్‌కు  9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్‌ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement