వర్దా’ ఎఫెక్ట్
-
దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన
-
ఆకాశం మేఘావృతం కావటంతో రైతుల్లో ఆందోళన
-
తీరంలో పెరిగిన అలల ఉధృతి
-
చేపల వేటకు విరామం
-
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
సకాలంలో సాగునీరు అందలేదు. పాలకులు పట్టించుకోలేదు. వరుణుడు కరుణించడంతో నారుపోశారు. ఆ తర్వాత కూడా కాలువలకు నీరు విడుదల చేయలేదు. నారు ముదిరిపోతుండడంతో పుడమితల్లిని నమ్ముకుని నాట్లు వేశారు. నానా పాట్లు పడి ఇంజిన్ల ద్వారా నీరు పెట్టారు. పంట చేతికొచ్చింది. ఆనందంగా కోతలకు సిద్ధమవుతున్న వేళ అన్నదాతల గుండెల్లో ‘తుఫాన్’ మొదలైంది.
మచిలీపట్నం/కోడూరు : ఆకాశంలో కమ్ముకొస్తున్న కారుమేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రంలో ఉధృతంగా ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంతావాసులను వణికిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన చల్లగాలులకు జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ‘వర్దా’ పెను తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు అల్లాడిపోయారు. వర్షం కురిస్తే చేతికందే దశలో ఉన్న వరిపంట నీట మునుగుతుందనే భయంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇప్పటికే వరికోత కోసి ఉన్న పైరును కుప్పలు వేయటం, నూర్పిడి చేసే పనులను హడావుడిగా చేపట్టారు. కుప్పల నూర్పిడి అనంతరం ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. వరికోతలను వాయిదా వేశారు. మరికొందరు భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతింటుందనే భయంతో యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేస్తున్నారు. జిల్లాపై సోమవారం తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు
తుఫాన్ ప్రభావంతో పాలకాయతిప్ప వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు సముద్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి పూర్తిగా మారిపోయింది. అలలు ఉధృతి పెరగడంతోపాటు సముద్రం కొంతమేర ముందుకు చొచ్చుకువచ్చింది. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు విరామం ప్రకటించారు. ఫైబర్ బోట్లు, వలలను భద్రపరుచుకున్నారు.
రేపటి వరకు ప్రభావం
‘వర్దా’ పెను తుఫాన్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రకటించిన వాతావరణ శాఖ... ఈ నెల 13 వరకు తుపాను ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని 7 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుఫాన్ గమనం చెన్నై వైపు ఉన్నప్పటికీ జిల్లాలో కొద్దిపాటి వర్షం కురిసినా వరి దెబ్బతినే ప్రమాదం ఉంది.