అంచనాల్లో ఇంత అరాచకమా!? | Central Government Objection On Polavaram Estimated Cost | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 6:43 AM | Last Updated on Sat, Nov 3 2018 6:44 AM

Central Government Objection On Polavaram Estimated Cost - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లోని లోపాలను కేంద్రం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015–16 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌)తో పోల్చితే.. 2013–14 ఎస్‌ఎస్‌ఆర్‌ ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం అధికంగా ఉండటంపై నివ్వెరపోయింది. హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాల్లో భారీగా అంతరాలు ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. భూసేకరణ.. సహాయ, పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణ నివేదికలపై ఈనెల 12 నుంచి ఢిల్లీలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని.. వాటికి సంబంధిత అధికారులు హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహేతుకమైన వివరణలు ఇస్తే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించి.. సాంకేతిక సలహా మండలి (టీఏసీ)కి పంపుతామని తెలిపింది. 

సవరణల్లో లోపాలను అధ్యయనం చేయండి
పోలవరం పనుల పురోగతి, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు మసూద్‌ హుస్సేన్, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఆర్కే గుప్తా, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల (2010–11 ధరల ప్రకారం) నుంచి 2013–14 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లకు సవరిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిలో కేంద్ర జలవనరుల శాఖ ఎత్తిచూపిన లోపాలపై గత నెల 13న రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఆ నివేదికపై ఈ నెల 12లోగా సమగ్రంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌ ఆదేశించారు.

భూసేకరణ, పునరావాస ప్యాకేజీపైనా అనుమానాలు
ఇదిలా ఉంటే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్ల నుంచి రూ.33,225.74 కోట్లకు పెరగడంపై కూడా కేంద్రం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగకపోయినా ముంపునకు గురయ్యే భూమి రెండింతలకు చేరడం, ముంపు గ్రామాలు పెరగడం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య భారీగా పెరగడంపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. 

అంతలోనే ఇంత తేడానా..
పోలవరం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.6,600.56 కోట్లనీ.. ఇందులో కేవలం స్పిల్‌ వే, ఈసీఆర్‌ ఆఫ్‌ పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ఆధారంగా రూ.4,054 కోట్ల నుంచి రూ.5535.41 కోట్లకు పెంచారని.. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయం రూ.8,081.41 కోట్ల అవుతుందని కేంద్ర జలవరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ పేర్కొన్నారు. కానీ.. 2013–14 ధరల ప్రకారం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.11,338.37 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలు తక్కువగా ఉంటాయని.. ఆ లెక్కన అంచనా వ్యయం తగ్గాల్సి ఉండగా ఎందుకు పెరిగిందని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నిలదీశారు.

2015–16 ధరల ప్రకారం ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు పెంచారని, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు పెంచారనీ.. కానీ 2013–14 ధరల ప్రకారం పంపిన ప్రతిపాదనల్లో ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 4,476.96 కోట్లకు, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,644.13 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement