
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిపై ఫొటోలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ముప్పు ఉందని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కట్పాలియా వాదనలు వినిపించగా.. జస్టిస్ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుని ‘ప్రాజెక్టు నిర్మాణంపై మీరు స్టే అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ‘పనుల నిలిపివేత’ ఉత్తర్వులు అమల్లో ఉండగా.. ఏటా దీనిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తోందని కట్పాలియా నివేదించారు. బచావత్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాలని, కానీ 50 లక్షల ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం సాగుతోందని, దీనిపైనే తమ అభ్యంతరమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. పోలవరం నిర్మాణంపై మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని నివేదించారు.
పదే పదే ఎందుకు అభ్యర్థించాల్సి వస్తోంది?
ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వైఖరేమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అనుమతుల మేరకు, బచావత్ అవార్డు ప్రకారమే నిర్మాణం జరుగుతోందని ఖాద్రీ వివరించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు బచావత్ అవార్డుకు లోబడి ఉన్నప్పుడు పదేపదే స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అది పర్యావరణ విభాగానికి చెందినదని ఖాద్రీ వివరించబోగా.. ఒక్కో శాఖకు ఒక్కో న్యాయవాది వస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, తెలంగాణ వాదనలపై జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ.. ‘ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి’ అని సూచించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment