డయాఫ్రం వాల్, ఇతర మరమ్మతులకు రూ.2,620.24 కోట్లు
లోక్‌సభలో తేల్చి చెప్పిన హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్
కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని 2016లో చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు
2013–14 ధరలతోనే పూర్తి చేస్తానంటూ కేంద్రంతో ఒప్పందం
దీంతో నిధుల సంక్షోభంలో కూరుకుపోయిన ప్రాజెక్టు
తాజా ధరల ప్రకారం నిధులిచ్చేలా కేంద్రాన్ని ఒప్పించిన వైఎస్ జగన్
నిధుల సమస్య లేకుండా చేసి ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం తాజా (2023, మార్చి) ధరల ప్రకారం రూ.30,436.95 కోట్లు అని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) 2023 అక్టోబర్ 19న తేల్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో చెప్పారు.
గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కోతకు గురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ పునరుద్ధరణ, డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులకు రూ.2,620.24 కోట్లు ఖర్చువుతుందని ఆర్‌సీసీ అంచనా వేసిందని మంగళవారం టీడీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
తాజా ధరల ప్రకారం నిధులిచ్చేలా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చేశారని, ఇది ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి దోహదపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
నిధుల సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబు
విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు.. 2016 సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. 2013–14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు పనులకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు పోను మిగతా రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబితే దానికీ తలూపారు.
నిజానికి 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.24 కోట్లు. కానీ.. ప్రాజెక్టు మొత్తాన్ని రూ.15,667.90 కోట్లతోనే పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం.
సంక్షోభం నుంచి తప్పించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని అనేకమార్లు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని.. ప్రాజెక్టును రెండో దశల్లో పూర్తి చేద్దామని, తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు, ఆ తర్వాత 45.72 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేద్దామని చెప్పారు.
ఆ మేరకు తొలి దశ పనుల పూర్తికి (డయాఫ్రం వాల్ పునరుద్ధరణ, మరమ్మతులతో కలిపి) తాజా ధరల ప్రకారం రూ.31,625.37 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనాలకు 2023 జూలైలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదముద్ర వేసి, ఆర్‌సీసీకి నివేదించింది. వాటిని పరిశీలించిన ఆర్‌సీసీ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా నిర్ధారించింది.
నాడు మోకాలడ్డి.. నేడు వినతులు
పోలవరం తొలి దశలో ఇప్పటివరకూ అయిన పనులకు చేసిన వ్యయం, కేంద్రం రీయింబర్స్ చేసిన మొత్తంపోనూ మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని గత మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్‌డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అజెండా నుంచి తప్పించింది. ఇలా ఆ నిధులకు మోకాలడ్డిన చంద్రబాబే.. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం తొలి దశకు ఇవ్వాల్సిన రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని, ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment