జరిమానా వద్దులే..నజరానా ఇస్తాం | Fraud In Tarakarama Thirtha Sagaram Project | Sakshi
Sakshi News home page

జరిమానా వద్దులే..నజరానా ఇస్తాం

Published Sun, Feb 3 2019 8:46 AM | Last Updated on Sun, Feb 3 2019 11:18 AM

Fraud In Tarakarama Thirtha Sagaram Project - Sakshi

సాక్షి, అమరావతి : సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన సర్కారు నజరానాల వర్షం కురిపిస్తోంది. అంచనా వ్యయాన్ని పెంచి ఇప్పటికే రూ.120.93 కోట్ల మేర లబ్ది చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం  మరోసారి పెంచి రూ.268.93 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లలో రెండుసార్లు అంచనా వ్యయాన్ని పెంచడంపై ఆర్థికశాఖ అభ్యంతరాలు బుట్టదాఖలయ్యాయి.

అంచనాలు పెంచి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు... 
విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగాండ్రేడు వద్ద చంపావతి నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును నిర్మించి కొత్తగా 24,710 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 8,172 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే పనులకు 2005 ఫిబ్రవరి 19వతేదీన రూ.220.04 కోట్లతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. బొల్లినేని శీనయ్యకు చెందిన సీఆర్‌18జీ–బీఎస్‌పీసీఎల్‌(జేవీ) ఈ ప్రాజెక్టు పనులను రూ.181.50 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2008 మే నెల నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయితే ఆ గడువు కూడా దాటిపోయినా పనులు పూర్తి చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌పై వేటు వేయాల్సిన టీడీపీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
 
ప్రాజెక్టు డిజైన్‌ మారడం వల్ల తనకు గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్‌ మొండికేయడంతో 2015లో మట్టికట్టలో 2.200 కి.మీ. నుంచి 5.749 కి.మీ. వరకూ, 0.00 నుంచి 0.890 కి.మీ. వరకు (డైక్‌–1) పనులను సీఆర్‌18జీ–బీఎస్‌పీసీఎల్‌ నుంచి తప్పించారు. ఆ పనుల విలువ రూ.51.30 కోట్లే. కానీ వాటి అంచనా వ్యయాన్ని రూ.172.23 కోట్లకు పెంచేసి బొల్లినేని శీనయ్యకే చెందిన ఎస్‌సీఎల్‌ (శీనయ్య  కంపెనీ లిమిటెడ్‌) ఇన్‌ఫ్రాటెక్‌కు కట్టబెట్టేశారు. అంటే రూ. 120.93 కోట్ల మేరకు కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.220.04 కోట్ల నుంచి 471.31 కోట్లకు పెంచేస్తూ 2015 సెప్టెంబరు 19న సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకూ కేవలం రూ.37.34 కోట్ల విలువైన 20.57 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 

నోటీసులిచ్చిన అధికారులపై చిందులు.. 
ఒప్పందం మేరకు పనులు చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌కు గత అక్టోబర్‌లో 61–సీ నిబంధన కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్టర్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సొరంగం, కుడి, ఎడమ కాలువ పనుల నుంచి  తొలగించి రూ.99.77 కోట్ల అంచనాతో గత డిసెంబర్‌ 17న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీడీఎస్‌ఎస్‌ నిబంధనల ప్రకారం ఇందులో 95 శాతాన్ని పాత కాంట్రాక్టర్‌ నుంచి జరిమానాగా వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్‌ దీన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తేవడంతోపాటు కోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు టెండర్లను నిలుపుదల చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు అందుకు భిన్నంగా చీవాట్లు పెట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. పనులు గిట్టుబాటు కాకుంటే కొట్టినా సరే కాంట్రాక్టర్లు పనులు చేయరంటూ తీర్మానించిన ప్రభుత్వ పెద్దలు అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.471.31 కోట్ల నుంచి రూ.740.24 కోట్లకు పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు.

ఆర్థికశాఖ అభ్యంతరాలు బేఖాతర్‌.. 
తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు కోసం మరో 136.14 ఎకరాల భూమిని సేకరించాలి. 799 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2015 సెప్టెంబరు 19న అంచనా వ్యయం పెంచిన సమయంలోనే భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి నిధులు కేటాయించారు. అంటే తాజాగా అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు కేవలం కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమేనని స్పష్టమవుతోంది. ఆర్థిక శాఖ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్లలోనే అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు ఎలా పెంచేస్తారంటూ ప్రశ్నించింది. పనుల పరిమాణం పెరగడం వల్లే అంచనా వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందన్న జలవనరుల శాఖ వాదనను కొట్టిపారేసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆర్థిక శాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement