Tarakarama Thirtha Sagaram
-
జరిమానా వద్దులే..నజరానా ఇస్తాం
సాక్షి, అమరావతి : సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన సర్కారు నజరానాల వర్షం కురిపిస్తోంది. అంచనా వ్యయాన్ని పెంచి ఇప్పటికే రూ.120.93 కోట్ల మేర లబ్ది చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచి రూ.268.93 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లలో రెండుసార్లు అంచనా వ్యయాన్ని పెంచడంపై ఆర్థికశాఖ అభ్యంతరాలు బుట్టదాఖలయ్యాయి. అంచనాలు పెంచి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు... విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగాండ్రేడు వద్ద చంపావతి నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును నిర్మించి కొత్తగా 24,710 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 8,172 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే పనులకు 2005 ఫిబ్రవరి 19వతేదీన రూ.220.04 కోట్లతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. బొల్లినేని శీనయ్యకు చెందిన సీఆర్18జీ–బీఎస్పీసీఎల్(జేవీ) ఈ ప్రాజెక్టు పనులను రూ.181.50 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2008 మే నెల నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయితే ఆ గడువు కూడా దాటిపోయినా పనులు పూర్తి చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌పై వేటు వేయాల్సిన టీడీపీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ప్రాజెక్టు డిజైన్ మారడం వల్ల తనకు గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్ మొండికేయడంతో 2015లో మట్టికట్టలో 2.200 కి.మీ. నుంచి 5.749 కి.మీ. వరకూ, 0.00 నుంచి 0.890 కి.మీ. వరకు (డైక్–1) పనులను సీఆర్18జీ–బీఎస్పీసీఎల్ నుంచి తప్పించారు. ఆ పనుల విలువ రూ.51.30 కోట్లే. కానీ వాటి అంచనా వ్యయాన్ని రూ.172.23 కోట్లకు పెంచేసి బొల్లినేని శీనయ్యకే చెందిన ఎస్సీఎల్ (శీనయ్య కంపెనీ లిమిటెడ్) ఇన్‌ఫ్రాటెక్‌కు కట్టబెట్టేశారు. అంటే రూ. 120.93 కోట్ల మేరకు కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.220.04 కోట్ల నుంచి 471.31 కోట్లకు పెంచేస్తూ 2015 సెప్టెంబరు 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకూ కేవలం రూ.37.34 కోట్ల విలువైన 20.57 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నోటీసులిచ్చిన అధికారులపై చిందులు.. ఒప్పందం మేరకు పనులు చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌కు గత అక్టోబర్‌లో 61–సీ నిబంధన కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్టర్ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సొరంగం, కుడి, ఎడమ కాలువ పనుల నుంచి తొలగించి రూ.99.77 కోట్ల అంచనాతో గత డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీడీఎస్‌ఎస్ నిబంధనల ప్రకారం ఇందులో 95 శాతాన్ని పాత కాంట్రాక్టర్ నుంచి జరిమానాగా వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్ దీన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తేవడంతోపాటు కోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు టెండర్లను నిలుపుదల చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు అందుకు భిన్నంగా చీవాట్లు పెట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. పనులు గిట్టుబాటు కాకుంటే కొట్టినా సరే కాంట్రాక్టర్లు పనులు చేయరంటూ తీర్మానించిన ప్రభుత్వ పెద్దలు అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.471.31 కోట్ల నుంచి రూ.740.24 కోట్లకు పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆర్థికశాఖ అభ్యంతరాలు బేఖాతర్.. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు కోసం మరో 136.14 ఎకరాల భూమిని సేకరించాలి. 799 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2015 సెప్టెంబరు 19న అంచనా వ్యయం పెంచిన సమయంలోనే భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి నిధులు కేటాయించారు. అంటే తాజాగా అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు కేవలం కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమేనని స్పష్టమవుతోంది. ఆర్థిక శాఖ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్లలోనే అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు ఎలా పెంచేస్తారంటూ ప్రశ్నించింది. పనుల పరిమాణం పెరగడం వల్లే అంచనా వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందన్న జలవనరుల శాఖ వాదనను కొట్టిపారేసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆర్థిక శాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
‘జగన్ సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుంది’
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందని విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామానికి చెందిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డిని కలిసిన భూ నిర్వాసితులు తమ గోడును ఆయన ముందు వెల్లబోసుకున్నారు. రెండు పంటలు పండే 1400 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం పరిహారం మాత్రం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని, పరిహారం ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా న్యాయం జరగటంలేదని వాపోయారు. మమ్మల్నికూడా ఆదుకోవాలన్నా! స్వర్ణ కారులకు హామీ ఇచ్చినట్టే తమను కూడా ఆదుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. విశ్వ బ్రాహ్మణుల్లో కార్పెంటర్లు, శిల్పం, కంచర, కమ్మర ఈ నాలుగు ఉపకులాలను ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. కార్పెంటర్లకు ప్రభుత్వ టింబర్ డిపోలనుంచి రాయితీ, సబ్సీడీతో కలప సరఫరా చేయాలని కోరారు. -
‘తారకరామా’.. ఇది సాధ్యమా..!
‘తారకరామ తీర్థసాగర్’ను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మరోసారి మంత్రి హామీ తొమ్మిదేళ్లలో పూర్తి చేసింది 40 శాతమే.. ఈ కొద్ది కాలంలో ఎలా సాధ్యమో..? విజయనగరం కంటోన్మెంట్ : తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తవుతుందో తెలియదు గానీ.. మన నాయకులకు మాత్రం అది ‘హామీ’లిచ్చేందుకు చాలా ఉపయోగపడుతోంది. పూర్తి కావడం సాధ్యం కాని ఈ పనులకు హామీల మీద హామీలు, గడువుల మీద గడువులు ఇవ్వడం నాయకులకే సాధ్యమైంది. జలయజ్ఞంలో భాగంగా 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన తదనంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పదేళ్ల కాలంలో కేవలం 40 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని ఇటీవల పరిశీలనకు వచ్చిన సందర్భంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రైతాంగం విమర్శిస్తోంది. డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాలకు సాగునీరు ఇచ్చేందుకు నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు బ్యారేజీని గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మించారు. మొత్తం 24,710 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రారంభించారు. సాగునీటితోపాటు విజయనగరం పట్టణానికి 0.162 టీఎంసీల తాగునీరు కూడా సరఫరా చేసేందుకు నిర్ణయించారు. తొమ్మిదేళ్లుగా చేపట్టిన పనులు కేవలం 40 శాతంలోపునే ఉన్నాయని స్వయంగా అధికారులే చెబుతున్నారు. రిజర్వాయరు వద్ద, కాలువల తవ్వకాలకు సంబంధించి ఇంకా భూ సేకరణ చేపట్టలేదు. 2.70 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయరు నిర్మాణాన్ని, కాలువల పనులను.. సక్రమంగా పరిహారాలు ఇవ్వలేదని నిర్వాసితులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రారంభంలో రూ.220.11 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు రూ.475 కోట్లకు పెరిగింది. గడువు మీద గడువు ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలైన నెల్లిమర్ల మండలం కోరాడపేట, వీటీ అగ్రహారం, పడాల పేటలకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకే జీని ఇంకా అమలు చేయలేదు. ప్రాజెక్టుల నిర్మాణ రంగంలోనే భిన్నమైన దీని ప్లాన్‌పైన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొలుత రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008కి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభంలో భూములు కోల్పోతున్న రైతులు, నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో 2008 వరకూ పనులు మొదలుకాలేదు. అప్పటినుంచి రెండేళ్లకు.. అంటే 2010కి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికావాలి. ఇది రెండో గడువు. ఆ తరువాత 2014, 2015లకు గడువు పెంచారు. మరోసారి చివరగా 2017 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించారు. ఇప్పుడేమో మరోసారి ఈ ఆగస్టు నాటికే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పడం ఎంత వరకూ సాధ్యమని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల్లో ఎలా సాధ్యం? గుర్ల మండలం ఆనందపురం గ్రామం నుంచి నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ మధ్య 13.428 కిలోమీటర్ల పొడవు కాలువను నిర్మిస్తున్నారు. ఈ పనులతోపాటు డెంకాడ, భోగాపురంలలో భూ సేకరణ చేయాల్సి ఉంది. మరో పక్క రామతీర్థం కొండలోనుంచి టన్నెల్‌కు అనుమతులు రావాలి. ఇవన్నీ మూడు నెలల్లో సాధ్యమా? ఇది మంత్రిగారికి తెలియదా? లేక అధికారులు చెప్పలేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నుంచి రైల్వే డిపార్ట్మెంట్ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రైతులకు పరి హారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో బాధిత రైతులు ఎప్పటికప్పుడు పనుల ను అడ్డుకుంటున్నారు.