‘తారకరామా’.. ఇది సాధ్యమా..!
‘తారకరామ తీర్థసాగర్’ను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మరోసారి మంత్రి హామీ
తొమ్మిదేళ్లలో పూర్తి చేసింది 40 శాతమే..
ఈ కొద్ది కాలంలో ఎలా సాధ్యమో..?
విజయనగరం కంటోన్మెంట్ : తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తవుతుందో తెలియదు గానీ.. మన నాయకులకు మాత్రం అది ‘హామీ’లిచ్చేందుకు చాలా ఉపయోగపడుతోంది. పూర్తి కావడం సాధ్యం కాని ఈ పనులకు హామీల మీద హామీలు, గడువుల మీద గడువులు ఇవ్వడం నాయకులకే సాధ్యమైంది. జలయజ్ఞంలో భాగంగా 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
ఆయన తదనంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పదేళ్ల కాలంలో కేవలం 40 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని ఇటీవల పరిశీలనకు వచ్చిన సందర్భంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రైతాంగం విమర్శిస్తోంది. డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాలకు సాగునీరు ఇచ్చేందుకు నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు బ్యారేజీని గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మించారు. మొత్తం 24,710 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రారంభించారు.
సాగునీటితోపాటు విజయనగరం పట్టణానికి 0.162 టీఎంసీల తాగునీరు కూడా సరఫరా చేసేందుకు నిర్ణయించారు. తొమ్మిదేళ్లుగా చేపట్టిన పనులు కేవలం 40 శాతంలోపునే ఉన్నాయని స్వయంగా అధికారులే చెబుతున్నారు. రిజర్వాయరు వద్ద, కాలువల తవ్వకాలకు సంబంధించి ఇంకా భూ సేకరణ చేపట్టలేదు. 2.70 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయరు నిర్మాణాన్ని, కాలువల పనులను.. సక్రమంగా పరిహారాలు ఇవ్వలేదని నిర్వాసితులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రారంభంలో రూ.220.11 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు రూ.475 కోట్లకు పెరిగింది.
గడువు మీద గడువు
ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలైన నెల్లిమర్ల మండలం కోరాడపేట, వీటీ అగ్రహారం, పడాల పేటలకు సంబంధించి ఆర్‌ఆర్ ప్యాకే జీని ఇంకా అమలు చేయలేదు. ప్రాజెక్టుల నిర్మాణ రంగంలోనే భిన్నమైన దీని ప్లాన్‌పైన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొలుత రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008కి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
అయితే ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభంలో భూములు కోల్పోతున్న రైతులు, నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో 2008 వరకూ పనులు మొదలుకాలేదు. అప్పటినుంచి రెండేళ్లకు.. అంటే 2010కి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికావాలి. ఇది రెండో గడువు. ఆ తరువాత 2014, 2015లకు గడువు పెంచారు. మరోసారి చివరగా 2017 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించారు. ఇప్పుడేమో మరోసారి ఈ ఆగస్టు నాటికే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పడం ఎంత వరకూ సాధ్యమని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలల్లో ఎలా సాధ్యం?
గుర్ల మండలం ఆనందపురం గ్రామం నుంచి నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ మధ్య 13.428 కిలోమీటర్ల పొడవు కాలువను నిర్మిస్తున్నారు. ఈ పనులతోపాటు డెంకాడ, భోగాపురంలలో భూ సేకరణ చేయాల్సి ఉంది. మరో పక్క రామతీర్థం కొండలోనుంచి టన్నెల్‌కు అనుమతులు రావాలి.
ఇవన్నీ మూడు నెలల్లో సాధ్యమా? ఇది మంత్రిగారికి తెలియదా? లేక అధికారులు చెప్పలేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నుంచి రైల్వే డిపార్ట్‌మెంట్ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రైతులకు పరి హారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో బాధిత రైతులు ఎప్పటికప్పుడు పనుల ను అడ్డుకుంటున్నారు.