- విద్యుత్ ప్లాంట్‌పై 5,250 కోట్ల అదనపు వ్యయం
- పెట్టుబడిని అమాంతం పెంచి చూపిన ఏపీ జెన్‌కో
- యోగదారులపై చార్జీల మోతకు కుట్ర
- తెలంగాణకూ భారం కానున్న విద్యుత్ కొనుగోలు
-సీఈఆర్‌సీకి చిక్కకుండా ఏపీ సర్కారు దొంగాట
హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ అంచనా వ్యయం తడిసి మోపెడైంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) నిర్దేశించిన అంచనాలతో పోల్చితే దాదాపు రూ. 5,250 కోట్ల వ్యయం అధికంగా అయినట్లు ఏపీ జెన్‌కో తాజాగా లెక్కలేసింది. దీన్నే సాకుగా చూపించి ప్రజలపై విద్యుత్ చార్జీల వాత పెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంట్ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ రావాల్సి ఉంది. దీంతో కృష్ణపట్నంలో అదనపు వ్యయం ఫలితంగా అక్కడినుంచి వచ్చే విద్యుత్ కొనుగోలు చార్జీలు కూడా పెరిగి భవిష్యత్తులో తెలంగాణ వినియోగదారులపైనా భారం పడే ప్రమాదముంది. కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల సామర్థ్యం గల తొలి యూనిట్‌లో చేపట్టిన వాణిజ్య ఉత్పత్తి గత వారంలో విజయవంతమైంది. రెండో యూనిట్‌లో మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇందులో న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన వాటాను పంపిణీ చేసేందుకు ఏపీ మోకాలడ్డుతోంది. మరోవైపు దొంగదెబ్బ తీసినట్లుగా ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచేయడంతో రెండు రాష్ట్రాల వినియోగదారులపై పెనుభారం పడటం ఖాయమైంది.
సీఈఆర్‌సీ 2011 అక్టోబర్‌లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అంచనా వ్యయం ఒక్కో యూనిట్‌కు సగటున రూ. 4.59 కోట్లకు మించకూడదు. రైల్వే లైన్లు, లింకింగ్ పాయింట్, లోకోమోటివ్ లైన్లు, అన్‌లోడింగ్ పాయింట్లు తదితరాలను పరిగణించినా ఈ ఖర్చు యూనిట్‌కు రూ. 4.75 కోట్లకు మించదని విద్యుత్ నిపుణులు లెక్కతేల్చారు. ఈ లెక్కన కృష్ణపట్నంలో తొలి రెండు యూనిట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 7,600 కోట్లకు మించకూడదు. కానీ ఇప్పటికే రూ. 12,850 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ జెన్‌కో లెక్కలేసుకుంది. అంటే రూ. 5,250 కోట్ల అదనపు వ్యయాన్ని చూపింది. ఎందుకింత ఖర్చయిందన్నది అంతుచిక్కకుండా ఉంది. నిబంధనల ప్రకారం రెండు వేల మెగావాట్ల సామర్థ్యాన్ని మించిన ప్లాంట్లను కేంద్రం మెగా పవర్ ప్లాంట్లుగా గుర్తిస్తుంది. వీటి నిర్మాణానికి ప్రత్యేక రాయితీలు ఇస్తుంది. మూడు యూనిట్లుగల కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం 2,400 మెగావాట్లు. దీంతో దీనికి కేంద్రం నుంచి రాయితీలను ఏపీ అందుకుంది. కేంద్ర ఇంధన శాఖ నిబంధనల ప్రకారం మెగా పవర్ ప్లాంట్లలో 10 శాతం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది.
కృష్ణపట్నం నుంచి కేరళకు పదిశాతం కరెంట్ ఇచ్చే ప్రతిపాదనలున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 53.89 శాతం వాటా ఉండటం, కేరళకు 10శాతం వాటా ఇవ్వనుండటంతో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 79(2) ప్రకారం కృష్ణపట్నం కేంద్రం అంతర్రాష్ట్ర ప్లాంటుగా సీఈఆర్‌సీ పరిధిలో ఉంటుంది. ఈ లెక్కన కృష్ణపట్నం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు.. చార్జీలు నిర్ణయించే అధికారం సీఈఆర్‌సీ పరిధిలోనే ఉంటుంది. కానీ దీన్ని ఏపీఈఆర్‌సీ పరిధిలోనే ఉంచాలని, తద్వారా చేసిన తప్పులన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఏపీఈఆర్‌సీకి ఏపీజెన్‌కో సమర్పించిన పీపీఏల కవరింగ్ లెటర్‌లోనే ఈ ప్లాంటు సీఈఆర్‌సీ పరిధికి చెందినదని నివేదించింది. అదే విషయాన్ని వేలెత్తి చూపిన ఏపీఈఆర్‌సీ ఈ ప్లాంటు పీపీఏలు తమ పరిధిలోకి రావంటూ ఆగస్టులోనే తిప్పిపంపాయి. ఆరు నెలలు గడచినా ఈ ఫైలును సీఈఆర్‌సీకి పంపించకుండా ఏపీజెన్‌కో తొక్కిపెట్టింది. ఈలోగా అంచనా వ్యయం రూ. 5,250 కోట్లకుపైగా పెంచడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది అనుమానాస్పదంగా మారింది. వినియోగదారులపై చార్జీల భారం పెంచే హైడ్రామాలో భాగంగానే పెట్టుబడులను పెంచారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కృష్ణపట్నం ప్లాంటుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందాలు, చార్జీల నిర్ణయాన్ని సీఈఆర్‌సీకి అప్పగించకపోతే పెట్టుబడుల భారంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుదిబండగా కృష్ణపట్నం..!
Published Fri, Feb 13 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement